ఏసీబీ అటాక్‌

ABN , First Publish Date - 2022-08-05T05:15:52+05:30 IST

ఏలూరు నగర పాలక సంస్థలో గురువారం ఏసీబీ తనిఖీలు జరిగాయి.

ఏసీబీ అటాక్‌

ఏలూరు కార్పొరేషన్‌లో తనిఖీలు.. నేడు కొనసాగింపు

అవకతవకలపై ఆరా.. ఆంధ్రజ్యోతి కథనాలతో కదలిక

ఎలాంటి అవినీతి జరగలేదని కమిషనర్‌ వివరణ

ఏలూరు టూ టౌన్‌, ఆగస్టు 4 : ఏలూరు నగర పాలక సంస్థలో గురువారం ఏసీబీ తనిఖీలు జరిగాయి. శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగిస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగంలో పలు రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ ప్రసాద్‌ మాట్లాడుతూ బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌ చేయడంలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. బిల్డింగ్‌ ప్లాన్‌ దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ప్లాన్‌లకు విరుద్దంగా నిర్మాణాలు జరిగాయా ? లేదా ? అని పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్లాన్‌కు విరుద్దంగా కట్టిన బిల్డింగులకు ఫైన్‌లు విధిస్తున్నారా ? లేదా ? ఆరా తీస్తామని చెప్పారు. బిల్డింగులు నిర్మించే ముందు సాయిల్‌ టెస్ట్‌ సర్టిఫికేట్లు యాజమానులు తీసుకున్నారో లేదో చూస్తామన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఏమైనా తప్పులకు పాల్పడి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కాలంలో నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతి, అవకతవకల పై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు వెలువడ్డాయి. వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి కథనాల మేరకు విజిలెన్స్‌ విచారణ జరిగినట్లు తెలిసింది. తనిఖీల్లో ఏసీబీ సీఐలు నాగేంద్రప్రసాద్‌, భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఎలాంటి అవినీతి జరగలేదు : కమిషనర్‌ 

ఏలూరు నగర పాలక సంస్థలో ఎలాంటి అవినీతి జరగలేదని కమిషనర్‌ షేక్‌ షాహీద్‌బాబు పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిలో ఈ నెల 3న ప్రచురితమైన నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలు అనే వార్తపై కమిషనర్‌ స్పందించారు. నగరపాలక సంస్థ వాహనాలకు వాడే ఆయిల్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందనే వార్తల్లో ఎలాంటి వాస్త వం లేదన్నారు. అంతా పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఆర్‌సీల వేలం పాట కూడా మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. ఆయిల్‌ కుంభకోణంపై వైసీపీ కార్పొరేటర్‌ సీఎంకు ఫిర్యాదు చేసిన రోజు స్పందించని కమిషనర్‌, మేయర్‌ జిల్లా కలెక్టర్‌ ఆయిల్‌ కుంభకోణంపై విచారణ కమిటీ వేసేటప్పటికి ఎలాంటి తప్పు జరగలేదని ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమైంది. 


Updated Date - 2022-08-05T05:15:52+05:30 IST