నువ్వా?...నేనా?

ABN , First Publish Date - 2022-03-06T04:54:35+05:30 IST

శృంగవరపుకోట వైసీపీలో విభేదాలు పెరుగుతున్నాయా? ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌వార్‌ ప్రారంభమయ్యిందా? ఇందుకు సీఎం కప్‌ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు కారణమయ్యా యా?..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే వీరద్దరి మధ్య అధికారులు, వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు నలిగిపోతున్నారు.

నువ్వా?...నేనా?

ఎస్‌.కోట వైసీపీలో విభేదాలు

ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌వార్‌

చిచ్చురేపిన సీఎం కప్‌ కబడ్డీ పోటీలు

ఓ నేతకు ప్రాధాన్యం లేకపోవడమే కారణం

జిల్లా స్థాయికి చేరిన పంచాయితీ

(శృంగవరపుకోట)

శృంగవరపుకోట వైసీపీలో విభేదాలు పెరుగుతున్నాయా? ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌వార్‌ ప్రారంభమయ్యిందా? ఇందుకు సీఎం కప్‌ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు కారణమయ్యా యా?..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే వీరద్దరి మధ్య అధికారులు, వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు నలిగిపోతున్నారు. ఒకరిని కలిస్తే ఇంకొకరికి ఆగ్రహం కలుగుతుందని భయపడుతున్నారు. ఇంతలో కబడ్డీ పోటీలు ఇద్దరి మధ్య పెద్ద చిచ్చు పెట్టాయి. మహా శివరాత్రి సందర్భంగా సీఎం కప్‌ పేరిట నిర్వహించిన పోటీల్లో ఓ కీలక నేత హవా కనిపించింది. విజేతలకు ఇచ్చే ట్రోఫీపై కూడా సీఎంతో పాటు ఆ నేత ఫొటోను మాత్రమే ముద్రించారు. సహజంగా ఇది మరో కీలక నేతకు ఆగ్రహం తెప్పించింది. అవమానంగా భావించిన ఆయన అధికారులు, వైసీపీ నేతల వద్ద అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఓ నేత అందుబాటులో ఉన్న వైసీపీ క్రియాశీలక నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల నాటి నుంచి జరిగిన పరిణామాలు, పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని వివరించినట్టు తెలుస్తోంది. మరో నేత తీరుపై ఓకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అటు తరువాత గురువారం రాత్రికి పంచాయితీ జిల్లా నాయ కత్వం వద్దకు చేరినట్టు తెలుస్తోంది. వారు ఏం ఆదేశాలిచ్చారో తెలియదు కానీ.. శుక్రవారం ఉదయం వేపాడ మండల సర్వసభ్య సమావేశానికి ఆ ఇద్దరు నేతలు హాజరయ్యారు. తమ మధ్య ఏమీ జరగనట్టు వ్యవహరించారు. తామిద్దరం ఒకటేనని సంకేతాలిచ్చారు. అంతటితో ఆగకుండా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. దీనిపై వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు కలిసి ఉన్నట్టు చెబుతున్నారని.. లోలోపల మాత్రం విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నారు. సమస్యలతో పాటు అభివృద్ధి పనుల విషయమై ఎవరిని కలిస్తే.. ఎవరి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. 

-----------


Updated Date - 2022-03-06T04:54:35+05:30 IST