-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Woman assaulted with hammer-NGTS-AndhraPradesh
-
మహిళపై సుత్తితో దాడి
ABN , First Publish Date - 2022-08-15T05:36:31+05:30 IST
మండలంలోని విజయరాంపుం గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి సుత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

దత్తిరాజేరు: మండలంలోని విజయరాంపుం గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి సుత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై బూర్జివలస ఎస్ఐ రాజేష్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయరాంపురం గ్రామానికి చెందిన తెంటు ఈశ్వరమ్మ భర్త గత కొన్నేళ్ల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన పోల ఎర్రంనాయుడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయనతో సుమారు 12 సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా వీరి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో శనివారం ఎర్రంనాయుడు సుత్తితో ఆమె మొఖంపై గట్టిగా కొట్టి గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ఈశ్వరమ్మ స్పృహ కోల్పోయింది. తల్లి తవుడమ్మ చూసి, స్థానికుల సహాయంతో 108 వాహనంలో బాడంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. తల్లి తవుడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.