అసలేం జరుగుతోంది?
ABN , First Publish Date - 2022-07-30T05:35:25+05:30 IST
ఇలా గంటల వ్యవధిలో తాటిపూడి పైలెట్ ప్రాజెక్టు ద్వారా సరఫరా అవుతున్న నీరు రంగు మారుతోంది. నెలల తరబడి ఇదే తంతు. కానీ సమస్య మూలాలను గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా 99 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్రికల్లో కథనాలు రావడం.. అధికారులు హడావుడి చేయడం పరిపాటిగా మారుతోంది. ఎప్పటికప్పుడు గడువులు విధిస్తూ అధికారులు గడిపేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారమార్గం చూ

‘తాటిపూడి’ పైలెట్ ప్రాజెక్టు గాడిలో పడేదెప్పుడు
కుళాయిల ద్వారా బురద నీరు
రెండు నెలలుగా ఇదే తంతు
సమస్య మూలాలను గుర్తించలేని వైనం
యంత్రాంగం విఫలం
(శృంగవరపుకోట)
- శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలోని కుళాయి నుంచి శుక్రవారం 7 గంటల సమయంలో వచ్చిన బురద నీరు ఇది. నల్లమడ్డితో నీరు కనీస ఆనవాళ్లు లేకుండా పోయింది. కనీసం పాత్రలు తోముకునేందుకు కూడా వీలు లేని నీరు వచ్చిందని మహిళలు వాపోతున్నారు. గంటల తరబడి అదే రకం నీరు వచ్చిందని చెబుతున్నారు.
- శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కుళాయి ద్వారా ఇలా స్వచ్ఛమైన నీరు వచ్చింది. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శివానందకుమార్ తనిఖీ చేయగా నీరు స్వచ్ఛంగా కనిపిస్తోంది. స్థానికులకు అడుగగా.. రెండు నెలల నుంచి బురద నీరు వస్తుండడంతో పట్టడం మానేశామని చెబుతున్నారు.
-- ఇలా గంటల వ్యవధిలో తాటిపూడి పైలెట్ ప్రాజెక్టు ద్వారా సరఫరా అవుతున్న నీరు రంగు మారుతోంది. నెలల తరబడి ఇదే తంతు. కానీ సమస్య మూలాలను గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా 99 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్రికల్లో కథనాలు రావడం.. అధికారులు హడావుడి చేయడం పరిపాటిగా మారుతోంది. ఎప్పటికప్పుడు గడువులు విధిస్తూ అధికారులు గడిపేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారమార్గం చూపడం లేదు. వాస్తవానికి ఎస్.కోట నియోజకవర్గంలోని 319 గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రారంభంలో మెరుగైన సేవలందేవి. అయితే ప్రాజెక్టు నిర్వహణను గాలికొదిలేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా మోటార్లు పనిచేయడం లేదని.. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని అధికారులు తరచూ చెబుతున్నారు. వాస్తవానికి గత మే నెల నుంచే తరచూ ప్రాజెక్టు మొరాయిస్తూ వస్తోంది. వేసవిలో ప్రజలు పడిన బాధ వర్ణనాతీతం. కానీ అధికారులు సీరియస్గా దృష్టిసారించిన దాఖలాలు లేవు. తొలుత ప్రాజెక్టులోని కీలక విభాగాలను శుద్ధి చేశారు. తరువాత పైపులైన్లను తనిఖీ చేశారు. కానీ బురద నీరు ఎక్కడ నుంచి వస్తుందో గుర్తించలేకపోయారు. ఎక్కడ లోపం ఉందో పట్టుకోలేకపోయారు.
ఇదీ పరిస్థితి
ఎస్.కోట నియోజకవర్గంలో 3,08,754 జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో కేవలం ఎస్.కోట, కొత్తవలస పట్టణాల్లోనే 2 లక్షలకుపైగా జనాభా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్టు ద్వారా కేవలం ఎస్.కోట పట్టణానికే నీరందించగలుగుతున్నారు. కొత్తవలసకు అసలు నీరందించడం లేదు. ఈ రెండు పట్టణాల్లో ఆరు నెలల్లో ఇంటింటికీ కుళాయి పథకం ద్వారా తాగునీరు అందిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. కొత్తగా ప్రభుత్వం ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడంతో కాలనీలు పెరిగాయి. ఎస్.కోట పుణ్యగిరి రోడ్డులోని నూతనంగా నిర్మిస్తున్న కాలనీకి తాగునీటి సదుపాయం కల్పిస్తామని చెబుతున్నారు. దీనికిగాను రూ.10 కోట్లు జలజీవన్ మిషన్ నిధులను చూపిస్తున్నారు. ఒక్క ఎస్.కోట పట్టణానికి ఇంటింటా కుళాయిలకు రూ.8.50 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు పెరిగిన పట్టణం విస్తీర్ణంతో అదనపు వ్యయం అవుతుంది. అయితే జలజీవన్ మిషన్ పేరు చెప్పి..పైలెట్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారన్న అపవాదును అయితే అధికారులు ఎదుర్కొంటున్నారు.
సరఫరాను మెరుగుపరుస్తాం
తాటిపూడి పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తాం. కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటిని అన్నిరకాల తనిఖీలు చేశాం. చూసేందుకు నీరు బాగాలేకపోయినా తాగొచ్చు. తనిఖీల్లో ఇదే నిర్థారణ అయ్యింది. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. మామిడిపల్లి ఊటబావుల నుంచి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. రూ.10 కోట్ల జలజీవన్ మిషన్ నిధులు అందుబాటులో ఉన్నాయి.
-శివానందకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, విజయనగరం