‘ఎంప్లాయిమెంట్‌’ ఏదీ?

ABN , First Publish Date - 2022-12-31T00:31:52+05:30 IST

అన్నిచోట్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాలు పేరుకే అన్న చందంగా మారాయి. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో గిరిజన యువతకు ‘ఉపాధి’ కల్పన లక్ష్యం నీరుగారుతోంది. ఉద్యోగావకాశాలు లేక అనేకమంది వలసబాట పట్టాల్సి వస్తోంది.

    ‘ఎంప్లాయిమెంట్‌’ ఏదీ?
సీతంపేట గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఎంప్లాయిమెంట్‌ నమోదు కేంద్రం

రెన్యూవల్స్‌కు ఆసక్తి చూపని గిరిజన యువత

ఉద్యోగాలకు కాల్‌ లెటర్స్‌ రాని వైనం

వలసబాటలో నిరుద్యోగులు

నీరుగారుతున్న లక్ష్యం

(సీతంపేట)

ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఒకప్పుడు ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాలు ఎంతో కీలకంగా ఉండేవి. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను తెలియజేస్తూ కాల్‌ లెటర్స్‌ పంపించేవి. నిరుద్యోగులకు మార్గదర్శిగా ఉండేవి. దీంతో ఎంప్లాయిమెంట్‌ నమోదుకు యువత, విద్యార్థులు ఆసక్తి చూపేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. అన్నిచోట్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాలు పేరుకే అన్న చందంగా మారాయి. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో గిరిజన యువతకు ‘ఉపాధి’ కల్పన లక్ష్యం నీరుగారుతోంది. ఉద్యోగావకాశాలు లేక అనేకమంది వలసబాట పట్టాల్సి వస్తోంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా స్పందించకపోవడం విమర్శలు తావిస్తోంది. వాస్తవంగా ఐటీడీఏ పరిధిలో గిరిజన నిరుద్యోగుల కోసం సీతంపేటలోని జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో 1998లో ఎంప్లాయిమెంట్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎంప్లాయిమెంట్‌ కోసం అప్పట్లో పెద్దఎత్తున యువత, గిరిజన విద్యార్థులు నమోదు చేసుకునేవారు. వీటిని జిల్లా కేంద్రంలో ఉన్న ఎంప్లాయిమెంట్‌ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ రెన్యువల్‌ కార్డు వచ్చే విధంగా జూనియర్‌ అసిస్టెంట్‌ చర్యలు తీసుకునేవారు. అయితే నమోదు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా కాల్‌ లెటర్స్‌ రాకపోవడంతో గిరిజన యువత ఎంప్లాయిమెంట్‌ రెన్యూవల్స్‌కు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొందరు విద్యార్థులు నమోదుపై కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. గతంలో 5,800 మంది గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు రెన్యువల్‌ చేసుకోగా ప్రస్తుతం రెండు వేల మందికి ఆ సంఖ్య పడిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల సుదూర ప్రాంతాలైన 16 మండలాలు మందస, మెళియాపుట్టి, హిరమండలం, పాతపట్నం, కొత్తూరు ప్రాంతాలకు చెందిన గిరిజనులు శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలు చేరాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజనులు కూడా ఎంప్లాయిమెంట్‌ నమోదు, రెన్యూవల్స్‌కు ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా గతంలో ఎంప్లాయిమెంట్‌ రెన్యువల్‌ ఆధారంగా నాలుగో తరగతి సిబ్బంది నియామకాలు జరిగేవి. అయితే ఈ నియామకాలు కూడా దశాబ్దం నుంచి జరగని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఎంప్లాయిమెంట్‌ రెన్యువల్‌ అధికారి కె.దేశ్‌ను వివరణ కోరగా ప్రస్తుతం రెన్యువల్‌ తగ్గడం మాట వాస్తవమేనని తెలిపారు.

Updated Date - 2022-12-31T00:31:53+05:30 IST