వామ్మో.. గుంతల రోడ్లు

ABN , First Publish Date - 2022-09-09T04:42:03+05:30 IST

చిన్నపాటి వర్షం వచ్చినా వాహన చోదకుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు.. ఎక్కడ చూసినా గుంతలు వాటి నిండా నీరు.. ఏగుంత ఎంతలోతు ఉందో తెలీదు.. జారి పడితే ఇక అంతేసంగతులు.. దుస్తులన్నీ తడిచిపోయి కాళ్లు, చేతులకు దెబ్బలు.. వర్షానికి రోడ్లు దెబ్బతినడం.. ప్యాచ్‌లు వేయడం.. మళ్లీ గుంతలు పడిపోవడం పరిపాటిగా మారింది.

వామ్మో.. గుంతల రోడ్లు
గుంతలో దిగిన ఆటోను ముందుకు నెట్టుతున్న దృశ్యం



చిన్నపాటి వర్షానికే జలమయం
ఏ గుంత ఎంతలోతుందో తెలీదు
జారి పడ్డారా.. అంతేసంగతులు
జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి


చిన్నపాటి వర్షం వచ్చినా వాహన చోదకుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు.. ఎక్కడ చూసినా గుంతలు వాటి నిండా నీరు.. ఏగుంత ఎంతలోతు ఉందో తెలీదు.. జారి పడితే ఇక అంతేసంగతులు.. దుస్తులన్నీ తడిచిపోయి కాళ్లు, చేతులకు దెబ్బలు.. వర్షానికి రోడ్లు దెబ్బతినడం.. ప్యాచ్‌లు వేయడం.. మళ్లీ గుంతలు పడిపోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం రోడ్లు వేయకుండా తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతోంది. దీంతో వర్షం వచ్చినప్పుడు వాహన చోదకులు బయటకు రావాలంటే బెంబేలెత్తి పోతున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి/రాజాం)

- విజయనగరం నగర పాలక సంస్థ అయినా రోడ్ల రూపురేఖలు మాత్రం మారలేదు. రోడ్లు వేస్తూనే ఉన్నారు. ఒకటి, రెండు నెలల్లోనే గోతులు పడిపోతున్నాయి. వీటికి ప్యాచ్‌లు వేసినా ప్రయోజనం ఉండడంలేదు. నగరంలోని కలెక్టరేట్‌, కేఎల్‌ పురం, జడ్పీ రోడ్డు, జడ్పీ అతిథి గృహం రోడ్డు, ఎత్తు బ్రిడ్జి డౌన్‌, రింగు రోడ్డు పరిధిలోని ఐస్‌ ప్యాక్టరీ జంక్షన్‌, కొత్తపేట నీళ్ల ట్యాంకు వెళ్లే మార్గం, గంటస్తంభం వద్ద ప్రధాన మార్కెట్‌, కార్పొరేషన్‌ కార్యాలయ సమీపంలో వర్షం నీరు రోడ్డుపైనే నిలబడుతోంది. కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు లేదా ప్యాచ్‌ వర్కులు చేసినపుడు లోతట్టు ప్రాంతాలను ఎత్తు చేయాల్సి ఉంది. కానీ గోతులు మాత్రమే పూడుస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతంలో వర్షపునీరు నిలబడి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
- గజపతినగరం మండల కేంద్రం మీదుగా వస్తున్న ఎన్‌హెచ్‌ 26లో చంపావతి వంతెన నుంచి మధుపాడ వరకు రోడ్డు పాడైంది. గజపతినగరం మండల కేంద్రం పరిధిలో ఇటీవలే రోడ్డు వేశారు. అప్పుడే గుంతలుపడి వర్షపు నీరు నిలిచింది.
- బొబ్బిలి మన్సిపాలిటీలో ఫూల్‌బాగ్‌ రోడ్డు, అప్పయ్యపేట రోడ్డు, రామన్నదొరవలస, పాతబొబ్బిలి వేళ్లే రోడ్లు మున్సిపాలిటీ పరిధిలోనే గోతులమయం అయ్యాయి.

రాజాంలో చెరువుల్లా..!
రాజాం పట్టణంలో గురువారం వర్షం కురవడంతో రోడ్ల మీద గోతులన్నీ నిండిపోయాయి. అవి ఎంతలోతు ఉన్నాయో తెలియక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. రాజాంలో రహదారి విస్తరణ పనులకు రూ 20 కోట్లు మంజూరు చేశామని అధికారపార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నాగానీ.. ఆచరణలో కనిపించడం లేదని కొల్ల అప్పలనాయుడు, పైల వెంకటరమణ, వంగా వెంకటరావు, శాసపు రమేష్‌కుమార్‌, రాజేష్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైతే రహదారి నిర్మాణంతో పాటు రెండు వైపుల కాలువలు నిర్మిస్తేనే ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పట్టణంలోని అంబేద్కర్‌ కూడలి నుంచి జీఎంఆర్‌ఐటీ వరకు పూర్తిగా రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. గురువారం ఈ గుంతల్లో ఆటోలు ఆగిపోవడంతో వాటిని నెట్టే పరిస్థితి నెలకొంది.



Updated Date - 2022-09-09T04:42:03+05:30 IST