రెండు లారీలు ఢీ

ABN , First Publish Date - 2022-10-30T00:05:53+05:30 IST

బొండపల్లి మండలంలో ని 26వ నెంబర్‌ జాతీయ రహదారిపై శనివారం వేకువ జామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడి కక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

 రెండు లారీలు ఢీ
ప్రమాద దృశ్యం

బొండపల్లి: మండలంలో ని 26వ నెంబర్‌ జాతీయ రహదారిపై శనివారం వేకువ జామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడి కక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎస్‌ఐ ఎస్‌.రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నుంచి ఒడిషాకు ఐరెన్‌ లోడుతో వెళుతున్న లారీ, విశాఖపట్టణం నుంచి రాయగడకు కర్రల లోడుతో వెళ్తున్న లారీ.. బోడసింగిపేట పెట్రోల్‌ బంకుకు సమీపంలో బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన లారీ డ్రైవర్‌ కుమారస్వామి(30) ఇనుప కడ్డీల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో విశాఖపట్టణం జిల్లా శొంఠ్యాంకు చెందిన ఎన్‌.శ్రీను, కె.సీతారాంలు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ 108 వాహనంలో విజయనగరంలోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. క్యాబిన్‌లో చిక్కుకొని మృతిచెందిన వ్యక్తిని పోలీసులు రెండు గంటలపాటు శ్రమించి, బయటకు తీశారు. రెండు లారీలు కూడా జాతీయ రహదారికి మధ్యలో ఉండిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. అటు గజపతినగరం వైపు, ఇటు బొండపల్లి వైపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. మృతదేహాన్ని గజపతినగరం లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-10-30T00:15:24+05:30 IST