తేలేదెప్పుడు?
ABN , First Publish Date - 2022-06-06T05:39:07+05:30 IST
ఏ మండల వాసులో వారికే తెలియదు.. ఉన్నది ఒక మండలంలో అయితే.. సంక్షేమ పథకాలు మరో మండలం నుంచి అందుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి.
తీరని సరిహద్దు గ్రామ ప్రజల కష్టాలు
రెండు మండలాల మధ్య నలుగుతున్న వైనం
ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం
(జియ్యమ్మవలస)
ఏ మండల వాసులో వారికే తెలియదు.. ఉన్నది ఒక మండలంలో అయితే.. సంక్షేమ
పథకాలు మరో మండలం నుంచి అందుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి. దీంతో
అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ మండల వాసులో కచ్చితంగా
చెప్పలేకపోతున్నారు. దీనిపై అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఇదీ
పార్వతీపురం మన్యం జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో ఉంటున్న ప్రజల
పరిస్థితి. జిల్లాల విభజన నేపథ్యంలో తమకూ శాశ్వత పరిష్కారం చూపాలని వారు
కోరుతున్నారు.
ఒకటి కాదు.. రెండు కాదు ఏళ్ల తరబడి పలువురు గ్రామస్థులు
సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ మండల వాసులో అధికారులు
తేల్చిచెప్పకపోవడంతో తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. ప్రధానంగా జిల్లాలో
లక్ష్మీపేట, గంగరాజపురం గదబవలస, పెదబుడ్డిడి గదబవలస తదితర సరిహద్దు
గ్రామాలు రెండు మండలాల మధ్య నలుగుతున్నాయి. తాజాగా నిర్వాసిత గ్రామం
నిమ్మలపాడు కూడా ఈ కోవలోకి వచ్చేసింది. వీటి పరిస్థితి ఒక్కసారి చూస్తే..
లక్ష్మీపేట గ్రామం కురుపాం మండలం పొడి పంచాయతీలో ఉంది. కానీ జియ్యమ్మవలస
మండలం తాళ్లడుమ్మ పంచాయతీ, తాళ్లడుమ్మ రెవెన్యూ పరిధిలో ఉంది. అయితే వీరికి
అన్ని రకాల సంక్షేమ ఫలాలు తాళ్లడుమ్మ పంచాయతీ నుంచే అందుతున్నాయి. ఏ
ఎలక్షన్ వచ్చినా తాళ్లడుమ్మ పోలింగ్ స్టేషన్‌లోనే ఓటు హక్కు
వినియోగించుకుంటున్నారు.
గంగరాజపురం గదబవలస అనే మరో గ్రామం
గరుగుబిల్లి మండలం తోటపల్లి పంచాయతీలో ఉంది. కానీ అదే గ్రామం జియ్యమ్మవలస
మండలం కుదమ రెవెన్యూలో ఉంది. వీరికి కూడా సంక్షేమ ఫథకాలన్నీ కుదమ పంచాయతీ
నుంచే అందుతున్నాయి.
పెదబుడ్డిడి గదబలస గ్రామంలో మొత్తం 25 కుటుంబాలు
ఉండగా, సగం జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి పంచాయతీ పరిధిలో ఉంది. మరో సగం
గరుగుబిల్లి మండలం లఖనాపురం పంచాయతీలో ఉంది. ఫలితంగా ఈ గ్రామాల ప్రజలు
అయోమయంలో ఉన్నారు. సంక్షేమ ఫలాలు, రెవెన్యూ పరిధి అంతా జియ్యమ్మవలస మండలంలో
ఉంటే, వేరే మండలాల పరిధిలోని తమ గ్రామాలు ఉండడం ఏమిటని వారు
ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై సర్కారు
స్పందించి తమ గ్రామాలు జియ్యమ్మవలస మండలంలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని
వారు డిమాండ్ చేస్తున్నారు.
నిర్వాసిత గ్రామానిదీ అదే పరిస్థితి
కొమరాడ
మండలం నిమ్మలపాడు తోటపల్లి బ్యారేజీ ముంపు ప్రాంతంలో ఉన్న గ్రామం. ఇది
పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ గ్రామస్థులకు జియ్యమ్మవలస మండలంలో బట్లభద్ర,
బిత్రపాడులో స్థలాలు ఇస్తే పూర్తిగా ఇళ్లు నిర్మించుకుని ఉన్నారు. ఇప్పుడు
ఈ మూడు నిర్వాసిత గ్రామాలు ఒకే చోట ఉన్నాయి. అయితే వారు కూడా జియ్యమ్మవలస
మండలంలో కలపాలని కోరుతున్నారు.
డి-నోటిఫై చేయాలి
నిర్వాసిత
గ్రామాల విషయంలో ప్రభుత్వం డి-నోటిఫై చేయాలి. ఇక మిగిలిన గ్రామాల విషయంలో
రెవెన్యూ పరిధి మారదు. పంచాయతీ ఉన్నతాధికారులు మాత్రం దానిపై కచ్చిత
నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
- జి.శ్రీరామ్మూర్తి, తహసీల్దార్, జియ్యమ్మవలస మండలం