నీతి ఆయోగ్‌ లక్ష్యాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-03-17T05:28:50+05:30 IST

నీతి ఆయోగ్‌ లక్ష్యాలను సాధించడం ద్వారా జిల్లా ర్యాంకులను మరింత మెరుగుపరిచేందుకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి సూచించారు. నీతి ఆయోగ్‌ సూచికలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

నీతి ఆయోగ్‌ లక్ష్యాలు సాధించాలి
సమీక్ష సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టర్‌ సూర్యకుమారి 

విజయనగరం (ఆంధ్రజ్యోతి), మార్చి 16: నీతి ఆయోగ్‌ లక్ష్యాలను సాధించడం ద్వారా జిల్లా ర్యాంకులను మరింత మెరుగుపరిచేందుకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి సూచించారు. నీతి ఆయోగ్‌ సూచికలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ, స్త్రీశిశు సంక్షేమం, విద్య, వ్యవసాయం, పశు సంవర్థక శాఖ, మైక్రో ఇరిగేషన, వ్యవసాయ మార్కెటింగ్‌ తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. లక్ష్యాలను సాధించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి బుధవారం వ్యాక్సినేషనను పక్కాగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎనఎంల పనితీరు బాగాలేదని.. విధుల్లో అలసత్వం వహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముద్ర రుణాలపై సమీక్షిస్తూ కొన్ని శాఖలు పనితీరులో ముందున్నప్పటికీ, ఆ ప్రగతిని ఆనలైనలో అప్‌లోడ్‌ చేయడంలో వెనుకబడ్డాయన్నారు. అంగనవాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం సరిగా అందించడం లేదని నిరాశ వ్యక్తం చేశారు. తుది దశకు చేరిన 72 అంగనవాడీ కేంద్రాల భవన నిర్మాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద 5,216 చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు. కొదమ, ధారపర్తి తదితర గిరిగ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టాల ని ఆదేశించారు. నిరుద్యోగ యువతకు విస్తృతంగా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీవో జె.విజయలక్ష్మి, డీఎంహెచవో డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి, ఐసీడీఎస్‌ పీడీ ఎం.రాజేశ్వరి, పశు సంవర్థకశాఖ జేడీలు తారకరామారావు, వైవీ రమణ, డీఈవో జయశ్రీ, ఏపీసీ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

జగనన్న విద్యా దీవెన పథకం కింద 2021 అక్టోబరు త్రైమాసకానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ముఖ్యమంత్రి జగన విడుదల చేశారు. వెలగపూడి సెక్రటేరియట్‌ నుంచి బుధవారం వర్చువల్‌ విధానంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 269 కళాశాలల్లో వివిధ కోర్సులు చదువుతున్న 57,418 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.30.98 కోట్లు జమ కానున్నాయని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు అందచేశారు. కార్యక్రమానికి జేసీ వెంకటరావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సునీల్‌రాజ్‌కుమార్‌, బీసీ సంక్షేమ శాఖాధికారి డి.కీర్తి హాజరయ్యారు. 

పొట్టి శ్రీరాములు త్యాగాలు చిరస్మరణీయం

అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కలెక్టర్‌ సూర్యకుమారి అన్నారు. ఆ మహనీయుని జయంతిని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స హాల్‌లో బుధవారం నిర్వహించారు. తొలుత చిత్రపటానికి అధికారులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించి న మహోన్నత వ్యక్తి గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలన్నారు. 

మౌనికకు అభినందనలు

జాతీయ స్థాయిలో జరిగే యువ పార్లమెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాకు చెందిన లాలా మహలక్ష్మీ మౌనికను కలెక్టర్‌ సూర్యకుమారి అభినందించారు. తన చాంబర్‌కు బుధవారం వచ్చిన యువతికి కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత ఆశయాలతో మౌనిక మరిన్ని విజయాలు సాధించాలని, సివిల్స్‌లో రాణించాలని ఆకాంక్షించారు. 



Updated Date - 2022-03-17T05:28:50+05:30 IST