యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-24T05:15:12+05:30 IST

పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు.

యువకుడి ఆత్మహత్య

శృంగవరపుకోట రూరల్‌, జనవరి 23: పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లి గ్రామానికి చెందిన కొయిలాడ బాలాజీ(33) గత కొంత కాలంగా ఎస్‌.కోట మండ లంలోని కాపుసోంపురంలో నివసిస్తున్నాడు. బాలాజీ ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా కుటుంబ సభ్యులు ఇంటికి రానివ్వకపోవడంతో, భార్య శార్వాణితో పాటు కొంత కాలం కిందట కాపుసోంపురం వచ్చేశాడు. గ్రామంలోని ఓ రిసార్ట్‌లో మూడేళ్లగా పని చేశాడు. గత నెలలోనే సొంతంగా ఓ టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈనెల 14న తన టిఫిన్‌ సెంటర్‌లోనే పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భార్య స్థానికుల సహాయంతో ఎస్‌.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చింది. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తారకేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తు న్నారు. బాలాజీకి ఒక వ్యక్తితో ఆర్థిక పరమైన లావాదేవీల్లో గొడవలు ఉన్న కారణం గా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పలువురు భావిస్తున్నారు. ఇతను చనిపోయే ముందు ఆత్మహత్యకుగల కారణాలను ఒక లేఖ రాశాడని, ఈ లేఖను భార్య పోలీసులకు అందించినట్టు సమాచారం. ఈ లేఖ బహిర్గతమయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక బాబు, పాప ఉన్నారు.

 

Read more