సమస్యల పరిష్కారానికి పోరాటం
ABN , First Publish Date - 2022-12-16T23:53:29+05:30 IST
ఏపీ బెవరేజస్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.రమణ తెలిపారు.
నెల్లిమర్ల: ఏపీ బెవరేజస్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.రమణ తెలిపారు. బెవరేజస్ కలాసీ కార్మికుల ఎగుమతి, దిగుమతి కూలీ రేట్లు ఒప్పందం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో లోడింగ్, అన్ లోడింగ్ బంద్ చేసి శుక్రవారం స్థానిక బెవరేజస్ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతి కూలీ రేట్లు ఒప్పందం ముగిసి సంవత్సరాలు గడుస్తున్నా కాంట్రాక్టర్ గానీ ప్రభుత్వం గానీ ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులతో జరిగిన చర్చలు విఫలమైనందున నేటి నుంచి వర్క్ బంద్ చేపట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం సిగ్మా కంపెనీతో గత ఏడాది అక్టోబరుతో ఒప్పందం ముగిసిపోయిందని, అయినా నేటికీ కొత్త ఒప్పందం చేయలేదని కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కూలీ రేట్లు రూ.7 నుంచి రూ.10 పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ బెవరేజెస్ జిల్లా నాయకులు శ్రీను, మేస్ర్తీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.