ఎవరికో పగ్గాలు?

ABN , First Publish Date - 2022-01-29T04:00:30+05:30 IST

జిల్లాలో టీడీపీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల నాటికి గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పనిలో పడింది. అందులో భాగంగా నియోజకవర్గ బాధ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా నెల్లిమర్ల, కురుపాం నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జిగా మహిళా నేత తోయిక జగదీశ్వరికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నెల్లిమర్ల విషయంలో మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో దీని

ఎవరికో పగ్గాలు?

కొలిక్కిరాని నెల్లిమర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకం

నేతల మధ్య పోటీయే కారణం

కురుపాం బాధ్యురాలిగా తోయిక జగదీశ్వరి

శత్రుచర్ల ఆమోదంతో మార్గం సుగమం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో టీడీపీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల నాటికి గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పనిలో పడింది. అందులో భాగంగా నియోజకవర్గ బాధ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా నెల్లిమర్ల, కురుపాం నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జిగా మహిళా నేత తోయిక జగదీశ్వరికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నెల్లిమర్ల విషయంలో మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. గడిచిన ఎన్నికల్లో ఓటమి చవిచూసినా.. పార్టీ కేడర్‌ మాత్రం చెక్కుచెదరలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు ఇప్పటి వరకూ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన వయోభారంతో బాధ పడుతుండడంతో పార్టీ కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో చురుగ్గా లేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన నేత కోసం టీడీపీ అధిష్టానం అన్వేషిస్తోంది. ఈ నియోజకవర్గంలో నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. వారంతా ఇన్‌చార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ద్వితీయ శ్రేణి నాయకత్వం అభిప్రాయాన్ని సేకరించింది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. ముఖాముఖీగా నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో  ఆచితూచి అడుగులేస్తున్నారు. మాజీ మంత్రి పతివాడ మనుమడు సైతం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అన్ని మండలాల నుంచి మాజీ ప్రజాప్రతినిధులు ఆశావహులుగా ఉన్నారు. అందులో ఇద్దరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎవరికి టిక్కెట్‌ దక్కినా మిగతా వారు కలిసికట్టుగా పని చేస్తామని అధినేతకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆ ఇద్దరిలో ఎవరికి ఇన్‌చార్జి పదవి దక్కుతుందో వేచిచూడాలి. 

మహిళా నేతకు అవకాశం

కురుపాం నియోజకవర్గ విషయంలో కూడా కొద్దిరోజుల పాటు ఊగిసలాట కొనసాగింది. అక్కడ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వయోభారంతో బాధ పడుతుండడంతో బలమైన నేత కోసం కొద్దినెలలుగా అధిష్టానం వెతుకులాట ప్రారంభించింది. అక్కడ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆమెను ఢీకొట్టగల అభ్యర్థి కోసం అన్వేషించింది. ఈ నేపథ్యంలో చాలా పేర్లు తెరపైకి వచ్చినా చివరకు గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేటకు చెందిన మహిళా నేత తోయిక జగదీశ్వరిని అధిష్టానం ఖరారు చేసింది. ఆమె ప్రస్తుతం ఎల్విన్‌పేట ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. రాజకీయ నేపథ్య కుటుంబం కావడం, శత్రుచర్ల ఆమోదముద్ర వేయడంతో ఆమె నియామకానికి మార్గం సుగమమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుపొందింది. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం పోటీ పెరిగింది. కానీ అధిష్టానం జగదీశ్వరి వైపే మొగ్గుచూపింది. Read more