నోటీసులతోనే సరా!

ABN , First Publish Date - 2022-08-26T05:06:52+05:30 IST

ప్రజల నుంచి అన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. ఆలస్యమైతే అపరాధ రుసుం వేసి మరీ రాబెడుతున్నారు. అయితే ఏళ్లుగా బకాయి పడిన సర్కారీ కార్యాలయాల విషయంలో మాత్రం పురపాలక సంఘాల అధికారులు సరిగ్గా స్పందించడం లేదు.

నోటీసులతోనే సరా!
పన్నులు చెల్లించాల్సిన పార్వతీపురం అటవీశాఖ రేంజర్‌ కార్యాలయం

    ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు
  ప్రభుత ్వ కార్యాలయాల బకాయిలపై మౌనం
  ఒత్తిడి చేయని అధికారులు
  పెదవి విరుస్తున్న జిల్లావాసులు
(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)


ప్రజల నుంచి అన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. ఆలస్యమైతే అపరాధ రుసుం వేసి మరీ రాబెడుతున్నారు. అయితే ఏళ్లుగా బకాయి పడిన సర్కారీ కార్యాలయాల విషయంలో మాత్రం పురపాలక సంఘాల అధికారులు సరిగ్గా స్పందించడం లేదు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కోట్లలో రావల్సిన బకాయిలపై ఒత్తిడి చేయడం లేదు. దీనిపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. సామాన్యులకు ఒకలా.. ప్రభుత్వ కార్యాలయాలకు మరోలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా జిల్లావాసులు పన్నుల భారంతో సతమతమవుతున్నారు. అష్టకష్టాలు పడి ఇంటి పన్ను, చెత్త పన్నును చెల్లిస్తున్నారు. ఏ కారణం చేతనైనా సకాలంలో చెల్లించుకుంటే అపరాధ రుసుం వేసి పన్నులు వసూలు చేస్తున్న పురపాలక సంఘ అధికారులు ప్రభుత్వ శాఖల నుంచి రావలసిన పన్ను బకాయిలపై మాత్రం నోరు విప్పడం లేదు.  కొన్ని శాఖల వైపు కన్నెత్తి చూడడం లేదు.  దీంతో కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు కూడా అందడం లేదు. జిల్లాకేంద్రం విషయానికొస్తే..  2006 - 07 నుంచి ఆర్‌అండ్‌బీ సబ్‌ డివిజనల్‌ కార్యాలయం (కొత్త బెలగాం) రూ. 2,84,596 మేర ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. జంఝావతి ప్రాజెక్టు ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా రూ. 2,85,332,   పోలీస్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌   రూ. 32,56,868, పీడబ్ల్యూడీ కార్యాలయం రూ. 19,38,715, సబ్‌ కలెక్టరేట్‌ రూ. 2,68,945,  టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ కార్యాలయం నుంచి రూ. 12,36,318 చొప్పున పన్ను బకాయిలు రావల్సి ఉన్నాయి.  2014-15 నుంచి అటవీశాఖ కార్యాలయం (రేంజర్‌) రూ. 1,67,756  చెల్లించాల్సి ఉంది. ఇక సాలూరు పురపాలక సంఘంలో 42 ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ. 64.31 లక్షల మేర ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది.  అయితే ఇప్పటివరకు కేవలం రూ. 15 వేలు మాత్రమే కలెక్షన్‌ చేశారు. మిగిలిన రూ. 64.16 లక్షలు వసూళ్లు చేయడంలో పురపాలక సంఘం నోటీసులకే పరిమితమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.


నోటీసులు జారీ చేస్తున్నాం
 ప్రభుత్వ శాఖలకు చెందిన పన్నుల బకాయిలు వసూళ్లు చేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నాం. పన్నులు కట్టాలని కోరుతున్నాం.
 - ఆనంద్‌కుమార్‌, ఇన్‌చార్జి కమిషనర్‌, పార్వతీపురం
 

Read more