తమిళనాడులో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-16T00:18:03+05:30 IST

కార్తీకమాసం కావడంతో పుణ్యక్షేత్రాలను దర్శిద్దామని బయల్దేరారు. కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగారు. ఇంతలో కుదుపు. వారు ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొంది.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం
మృతి చెందిన బొన్నాడ శ్రీనివాసరావు (ఫైల్‌)

అరుణాచలానికి 20 కిలోమీటర్ల సమీపంలో పోలూరు వద్ద ఘటన

సాలూరు వాసుల్లో ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

చెన్నై ఆసుపత్రిలో క్షతగాత్రులకు వైద్యసేవలు

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు

సాలూరు, నవంబరు 15:

వారంతా చిరకాల మిత్రులు.. ఆరుగురిదీ ఒకే ఊరు.. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. సాటి వారికి తోచిన సాయం చేస్తుంటారు. కార్తీకమాసం కావడంతో పుణ్యక్షేత్రాలను దర్శిద్దామని బయల్దేరారు. కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగారు. ఇంతలో కుదుపు. వారు ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొంది. ఫ్లైఓవర్‌ దిగువకు కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా సాలూరుకు చెందిన వారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రమాదం జరిగింది.

పట్టణానికి చెందిన బొన్నాడ శ్రీనివాసరావు, రవ్వా శ్యాం శంకరరావు, సుతాపల్లి రామకృష్ణ, పతేడ ధనంజయ, బరాటం శంకరరావు, కొల్లేపర రాజేష్‌ స్నేహితులు. పుణ్యక్షేత్రాల దర్శనార్థం ఈనెల 13న కారులో సాలూరు నుంచి బయల్దేరారు. వారిలో శ్రీనివాసరావు అయ్యప్ప మాలధారణలో, రాజేష్‌లు శివమాలలో ఉన్నారు. సోమవారం శ్రీకాళహస్తి దర్శనం అనంతరం నుంచి తమిళనాడులో ఉన్న అరుణాచలం పుణ్యక్షేత్రానికి బయల్దేరారు. అయితే అరుణాచలం పుణ్యక్షేత్రానికి 20 కిలోమీటర్లు దూరంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా పోలూరు గ్రామ సమీపంలో వెల్లురు రైల్వే ప్లైఓవర్‌పై ఎదురుగా వస్తున్న బస్సును గమినించలేక ఢీకొట్టారు. దీంతో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఫ్లైఓవర్‌ కింద పడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుడుతున్న బొన్నాడ శ్రీనివాసరావు (44) మంగళవారం వేకువజామున సుమారు మూడు గంటల సమయంలో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మిగిలిన వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో క్షతగాత్రులు వైద్య సేవలు పొందుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు. వారిని చూసేందుకు సాలూరు నుంచి చెన్నైకు పయనమయ్యారు.

విషాదంలో కుటుంబ సభ్యులు

పట్టణంలో వెలమపేటకు చెందిన బొన్నాడ శ్రీనివాసరావు మృతి చెందాడని తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి కృష్ణ శివమాలధారణలో కాశీ ప్రయాణంలో ఉండగా భార్య పద్మ, తల్లి పార్వతిని ఎవరూ ఓదార్చలేకపోయారు. ఐదేళ్ల కుమార్తె లిషిత, ఎనిమిదేళ్ల కుమారుడు సుహాన్‌ కన్నీరుమున్నీరయ్యారు. పారమ్మతల్లి ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా, సనాతన హైందవ దర్శసేన, లైన్స్‌ డైమండ్స్‌ అధ్యక్షుడిగా సేవలందించిన శ్రీనివాసరావు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్న విషయాన్ని బంధువులు, మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదుగురు క్షతగాత్రుల్లో ఒకరైన పతేడ ధనంజయ పట్టణంలో గాడివీధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నారు. పట్టణంలో నాయుడువీధికి చెందిన బారటం శంకరరావు లారీ యూనియన్‌లో పనిచేస్తున్నారు. చిట్లువీధికి చెందిన రవ్వా శ్యాంశంకరరావు, కోటవీధికి చెందిన కొల్లేపర రాజేష్‌, సుతాపల్లి రామకృష్ణలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోని జీవనం సాగిస్తున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారు. తమవారి పరిస్థితి ఎలా ఉందోనని టెన్షన్‌ పడుతున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించి తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని , క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేక చొరవ చూపి బొన్నాడ శ్రీనివాసరావు మృత దేహాన్ని త్వరితగతిన పట్టణానికి చేరేలా చూడాలన్నారు.

Updated Date - 2022-11-16T00:18:31+05:30 IST