పర్యాటకం..ప్రగతికి మార్గం!

ABN , First Publish Date - 2022-04-08T05:01:50+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో నియోజకవర్గానిది ఒక్కో ప్రత్యేకత. ఒడిశా ముఖ ద్వారాంగా ఉండే ఈ జిల్లాలో పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తుందనం ఎటువంటి అతిశయోక్తి కాదు. నాలుగు నియోజకవర్గాల్లో గిరిజనులే అధికం. పరిశ్రమల జాడ ఉండదిక్కడ.

పర్యాటకం..ప్రగతికి మార్గం!
సీతంపేటలో ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు

పార్వతీపురం మన్యం జిల్లాకు టూరిజమే శరణ్యం

చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు అధికం..

అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం

ఉద్యోగ, ఉపాధి మెరుగుపడే అవకాశం

కలెక్టర్‌ దృష్టిసారించాలని జిల్లా వాసుల వినతి

(పార్వతీపురం)

పర్యాటక ప్రాంతాల సమాహారం పార్వతీపురం మన్యం జిల్లా. సువిశాల అటవీ ప్రాంతం ఈ జిల్లా సొంతం. అటు పాలకొండ నుంచి  ఇటు పార్వతీపురం వరకూ చూడదగ్గ పర్యాకట ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.  ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసినట్టు ప్రకటించింది. ఏ జిల్లాకు అనుగుణంగా.. అక్కడి వనరులకు తగ్గట్టు ప్రోత్సాహమందించనున్నట్టు చెబుతూ వచ్చింది. ఈ లెక్కన పార్వతీపురం మన్యం జిల్లాకు పర్యాటకంగా చేయూతనందించినట్టయితే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి అడుగులు పడనున్నాయి.

- పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో నియోజకవర్గానిది ఒక్కో ప్రత్యేకత. ఒడిశా ముఖ ద్వారాంగా ఉండే ఈ జిల్లాలో పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తుందనం ఎటువంటి అతిశయోక్తి కాదు. నాలుగు నియోజకవర్గాల్లో గిరిజనులే అధికం. పరిశ్రమల జాడ ఉండదిక్కడ.  గిరిజనుల అటవీ ఉత్పత్తుల సేకరణతో ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకరంగమే పెద్దదిక్కుగా నిలుస్తోంది. అందుకే గిరిజన ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పడంతో పాటు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం పెంపొందించుకోవచ్చు. అభివృద్ధి సాధించిన జిల్లాల సరసన చోటు దక్కించుకోవచ్చు. 

పాలకొండలో..

పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట, భామిని గిరిజన మండలాలు. పాలకొండ, వీరఘట్టం మైదాన ప్రాంతాలు. సీతంపేట మండలం ఇప్పటికే పర్యాటకంగా ప్రాచుర్యం పొందింది. గత టీడీపీ ప్రభుత్వం ఇక్కడ ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు ప్రారంభించింది. పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా రూపొందించింది. ఏడాది పొడవునా ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఉంటుంది. మెట్టుగూడ, సున్నపుగెడ్డ జలపాతాలు సైతం ఉన్నాయి. అయితే వీటిని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చు. సీతంపేటలో ట్రైబుల్‌ మ్యూజియం సైతం నిర్మించారు. పనులు చివరి దశలో ఉన్నాయి. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మ్యూజియంను నిర్మించారు. పాడలి వ్యూపాయింట్‌ సైతం ఉంది. దీనిని అభివృద్ది చేస్తే అల్లూరి జిల్లాలోని పాడేరు ప్రాంతంలోని మంజంగి, లంబసింగి తరహాలో ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. జగతపల్లి రిసార్ట్స్‌ను అభివృద్ధి చేస్తే పర్యాటకులు బస చేసేందుకు వీలుంటుంది. అప్పట్లో ఐటీడీఏ పీవో రూ.48 కోట్లతో ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. ఎందుకో ఆ అంశం మరుగున పడిపోయింది.  ఇటీవల గిరిజన సంక్షేమశాఖ మాజీ డైరెక్టర్‌ చినవీరభద్రుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ప్రకటించారు. భామిని మండలంలో వంశధార నదీ తీర ప్రాంతంలో కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం నేరడి వద్ద బ్యారేజీతో పాటు ఎత్తిపోతల పథకానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేసే చాన్స్‌ సైతం ఉంది. 

కురుపాంలో..

కురుపాం నియోజకవర్గంలో కూడా చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కానీ సరైన నిర్వహణ, అభివృద్ధి లేక పర్యాటకులకు దూరమవుతున్నాయి. తాడికొండలో జలపాతం, ఎస్‌కే పాడులో ఉద్యాన నర్సరీలు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వ ఆమోదం, నిధుల లభ్యత లేకపోవడమే ఇందుకు కారణం. ఎత్తయిన కొండల నడుమ.. తాడికొండ జలపాతం, గోరటితోట, జర అటవీ ప్రాంతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఐటీడీఏ పీవో డాక్టర్‌ లక్ష్మీశా హయాంలో తాడికొండ జలపాతం వద్ద రూ. 2.50 లక్షలతో కొద్దిపాటి అభివృద్ధి పనులు చేయించారు. ఎస్‌కే పాడు హార్టీకల్చర్‌ నర్సరీ ప్రాంతంలో రూ.25 లక్షలతో పగోడాలు, బాణం గుర్తు ఆకారంలో స్వాగత ద్వారం, ఇతర నిర్మాణాలను ప్రారంభించారు. కానీ ఆయన బదిలీ అయిన తరువాత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతం పర్యాటక అభివృద్ధికి కాగితాలకే పరిమితమైంది.మూడు జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న తోటపల్లి జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయవచ్చు. గతంలో ఐటీడీఏ పీవోలుగా పనిచేసిన రజిత్‌కుమార్‌ షైనీ, డాక్టర్‌ లక్ష్మీశాలు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. బోటు షికారు, ఐటీడీఏ పార్కులను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ నుంచి నిధులు రాక.. నిర్వహణ లేక ప్రయత్నాలన్నీ మరుగునపడిపోయాయి. 

సాలూరులో..

సాలూరు నియోజకవర్గంలో కూడా పర్యాటక ప్రాంతాలు అధికం. ఎత్తైన ఘాట్‌లు, మనసు దోచే జలాపాతాలు సైతం ఉన్నాయి. తోణాం, కురుకూటి తదితర ప్రాంతాల్లో ఉన్న జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అటు ఇదే నియోజకవర్గంలో పాచిపెంట, మక్కువ మండలాల్లో సైతం అభివృద్ధికి దూరంగా చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి. గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు సమాంతరంగా పర్యాటకాభివృద్ధి చేస్తే జిల్లాకు దండిగా ఆదాయం సమకూరడంతో పాటు గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యే అవకాశముంది. దీనిపై నూతన కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ దృష్టిపెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. 


పర్యాటకాభివృద్ధికి కృషి

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో  గుమ్మలక్ష్మీపురం, సాలూరు మండలాల్లో ఉన్న జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నావంతు కృషి చేస్తాను. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తా.

-ఆర్‌.కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో, పార్వతీపురం



Updated Date - 2022-04-08T05:01:50+05:30 IST