పడిగాపులు

ABN , First Publish Date - 2022-12-07T00:15:54+05:30 IST

జిల్లాలో ప్రయాణికులు మంగళవారం నానా అవస్థలు పడ్డారు.

 పడిగాపులు
పార్వతీపురం బస్‌స్టేషన్‌లో ఖాళీగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌లు వెళ్లే పాయింట్‌

ప్రయాణికులకు తప్పని కష్టాలు

పార్వతీపురంటౌన్‌, డిసెంబరు 6: జిల్లాలో ప్రయాణికులు మంగళవారం నానా అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు కాశారు. కాంప్లెక్స్‌ల్లో గంటలకొద్దీ నిరీక్షించారు. ఉన్న బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులైతే సమయానికి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లగలమా? లేదా! అని టెన్షన్‌ పడ్డారు. ఇంకొందరు బస్సులకు వేలాడుతూ.. రాకపోకలు సాగించగా, మరికొందరు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఈసురోమంటూ ఇళ్లకు వెనుదిగిరారు. విజయవాడలో బుధవారం వైసీపీ తలపెట్టిన బీసీ గర్జనకు ఆర్టీసీ బస్సులు తరలించడమే ఈ పరిస్థితికి కారణం. జిల్లా పరిధిలో పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోల నుంచి 34 ఎక్స్‌ప్రెస్‌, అలా్ట్ర డీలక్స్‌ బస్సులను మంగళవారం నాటికే తరలించారు. దీంతో విజయనగరం, విశాఖపట్నం సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. కొందరు తప్పనిసరై ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆర్టీసీ బస్సుల వినియోగించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి సుధాకర్‌ను వివరణ కోరగా బీసీ గర్జన సభకు బస్సులు తరలింపు అనేది వాస్తవమేనని చెప్పారు. కానీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

Updated Date - 2022-12-07T00:15:57+05:30 IST