నిరీక్షణ
ABN , First Publish Date - 2022-06-18T05:43:54+05:30 IST
ఈ పరిస్థితి ఈ ముగ్గురుదే అనుకుంటే పొరబడినట్టే. జిల్లాలో అనేకమంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. అన్ని అర్హతలతో దరఖాస్తులు చేసుకుంటున్నా.. వారికి మోక్షం లభించడం లేదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతు

పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పండుటాకులు
వివిధ కారణాలతో నిలిపివేత
పునరుద్ధరించాలని అధికారులకు వినతులు
కార్యాలయాల వద్ద పడిగాపులు
కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిది అదే పరిస్థితి
(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)
- ఏడు పదుల వయసు దాటిన వృద్ధ దంపతులు తాన్న రామినాయుడు, నారాయణమ్మలు కలెక్టరేట్ వద్ద ఇలా పడిగాపులు కాస్తున్నారు. వీరిది పార్వతీపురం మండలం డి.ములగడ. రామినాయుడు పింఛన్ నిలిచిపోవడంతో పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నెలలు గడుస్తున్నా పింఛన్ మాత్రం పునరుద్ధరణకు నోచుకోలేదు.
- గరుగుబిల్లి మండలం శివ్వాం గ్రామానికి చెందిన సెల్లా శంకరరావుకు సాంకేతిక కారణాలు చూపుతూ పింఛన్ నిలిపివేశారు. సచివాలయంలో ఫిర్యాదుచేస్తే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. కలెక్టర్కు వినతినందించినా పింఛన్ మాత్రం ఇంతవరకూ పునరుద్ధరించలేదు.
- కొమరాడ మండలం గంగరేగువలస గ్రామానికి చెందిన సరోజిని వితంతువు. నెలల కిందట పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంతవరకూ మంజూరు చేయలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. కనీసం స్పందించేవారే కరువయ్యారు.
-- ఈ పరిస్థితి ఈ ముగ్గురుదే అనుకుంటే పొరబడినట్టే. జిల్లాలో అనేకమంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. అన్ని అర్హతలతో దరఖాస్తులు చేసుకుంటున్నా.. వారికి మోక్షం లభించడం లేదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కారణాలతో నిలిచిపోయిన పింఛన్లు పునరుద్ధరించాలని, కొత్తగా మంజూరు చేయాలని స్పందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్నాయి. వాస్తవంగా ప్రతి ఆరు నెలలకొకసారి ప్రభుత్వం పింఛన్ల మంజూరు ప్రక్రియను చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్ల కోసం ప్రతినెలా పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడు మంజూరవుతాయా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా సర్కారు అనేక నిబంధనలు పెడుతుండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన రేగుతోంది. ఇప్పటికే ఎంతోమంది అర్హులకు పింఛన్లు రద్దు చేశారు. అమ్మఒడి, ఉచిత విద్యుత్ తదితర పథకాల్లోనూ కోత పెడుతున్నారు. ఇటువంటి సమయంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న తమకు పింఛన్లు మంజూరవుతాయో.. లేదో? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 1,33,713 మందికి సామాజిక పింఛన్లు అందుతున్నాయి. ఇందులో 77,377 వృద్ధాప్య, అభయ హస్తం 3,392 , చేనేత కార్మికులు 812, దివ్యాంగులు 14,455, వితంతు 30,371, గీత కార్మికులు 165, హిజ్రాలు ఒకటి, మత్స్యకారులు 748, ఒంటరి మహిళలు 2,157, ట్రెడేషనల్ కోబలర్స్ 1087, డప్పు కళాకారులు 1,422, కళాకారులు 152 , వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందిస్తున్న పింఛనుదారుల సంఖ్య 544, కిడ్నీ, తదితర సమస్యలు ఉన్నవారికి అందిస్తున్నవి 22, ఆర్ట్ పింఛన్లు 108 ఉన్నాయి.
దరఖాస్తులు ఇలా..
జిల్లా వ్యాప్తంగా కొత్తగా పింఛన్ల కోసం 5 వేలకు పైబడి దరఖాస్తులు గ్రామ సచివాలయాలకు వచ్చాయి. సీతానగరం మండలానికి సంబంధించి 650 దరఖాస్తులు, మక్కువ 395, జియ్యమ్మవలస 380, కొమరాడ 455, పాచిపెంట 470 , గరుగుబిల్లి 440, పాలకొండ 430, వీరఘట్టం 320, గుమ్మలక్ష్మీపురం 439, కురుపాం మండలంలో 346 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఎంపీడీవోల లాగిన్ నుంచి అర్హులకు పింఛన్లను మంజూరు చేసేందుకు సిఫారసు చేస్తారు.
ఏ ఆధారం లేదు..
నా వయసు 76 సంవత్సరాలు. నాకున్న భూమిని 2000 సంవత్సరంలో నలుగురు పిల్లలకు పంపిణీ చేశాను. ప్రస్తుతం ఏ ఆధారం లేదు. ఎటువంటి భూమి లేకపోయినప్పటికీ 1బీలో నా పేరు చూపుతున్నారు. రికార్డులను సరిచేసి పింఛన్ మంజూరు చేయాలి.
- సోమురెడ్డి తవిటినాయుడు, జోగింపేట, సీతానగరం మండలం
అర్హత ఉన్నా..
నాకు 61 సంవత్సరాలు. నా ఆధార్లో కూడా అదే వయసు ఉంది. అర్హత ఉన్నప్పటికీ నాకు పింఛను మంజూరు కాలేదు. ప్రభుత్వం అందించే పింఛనే ఆధారం. దీనిపై అధికారులు స్పందించాలి.
- సుంకరి బంగారునాయుడు, లక్ష్మీపురం, సీతానగరం మండలం
వచ్చే నెల నుంచి అందిస్తాం
కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ వచ్చే నెల నుంచి అందిస్తాం. తుది జాబితా ఇంకా మా కార్యాలయానికి రాలేదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పింఛన్లు మంజూరు చేస్తున్నాం.
- సత్యంనాయుడు, పీడీ, డీఆర్డీఏ