మునిసిపాలిటీకి ఓకే

ABN , First Publish Date - 2022-04-05T06:24:12+05:30 IST

చీపురుపల్లి మేజరు పంచాయతీ అప్‌గ్రేడ్‌ వ్యవహారం తాజాగా తెరపైకి వస్తోంది. మంత్రి మాటల్లో ఆ సంకేతాలు ప్రస్ఫుటమయ్యాయి. మేజరు పంచాయతీగా ఉన్న దీనిని మునిసిపాలిటీగా చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం చీపురుపల్లిలో జరిగిన సభలో అప్‌గ్రేడేషనకు అనుకూలంగా సంకేతాలిచ్చారు.

మునిసిపాలిటీకి ఓకే
చీపురుపల్లి పట్టణం వ్యూ

మంత్రి సంకేతాలు

నాయకులు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్య

(చీపురుపల్లి)

చీపురుపల్లి మేజరు పంచాయతీ అప్‌గ్రేడ్‌ వ్యవహారం తాజాగా తెరపైకి వస్తోంది. మంత్రి మాటల్లో ఆ సంకేతాలు ప్రస్ఫుటమయ్యాయి. మేజరు పంచాయతీగా ఉన్న దీనిని మునిసిపాలిటీగా చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం చీపురుపల్లిలో జరిగిన సభలో అప్‌గ్రేడేషనకు అనుకూలంగా సంకేతాలిచ్చారు. పంచాయతీగా ఇంకా ఎన్నాళ్లుంటామని? మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయితే తప్ప నిధులు రావని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మాట్లాడడానికి చీపురుపల్లి, గరివిడి నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు. వాస్తవానికి మేజరు పంచాయతీగా ఉన్న చీపురుపల్లిని మునిసిపాలిటీగా మార్చాలన్న డిమాండ్‌ ఒకటిన్నర దశాబ్దాలుగా ఉంది. 2003లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే గద్దే బాబూరావు చీపురుపల్లిని నగర పంచాయతీగా మార్చాలని సంకల్పించి ఆ మేరకు చేయగలిగారు. అప్పట్లో చీపురుపల్లి మండలంలో ఉన్న రావివలస పంచాయతీ, గరివిడి పట్టణంతో పాటు ఆ మండలంలో ఉన్న దువ్వాం, కే.లక్ష్మిపురం తదితర గ్రామాలను కలుపుతూ చీపురుపల్లి పేరుతో నగర పంచాయతీ ఏర్పాటైంది. 

అంతవరకూ వచ్చి...

2004 ఆగస్టు వరకూ నగర పంచాయతీ కొనసాగింది. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నగర పంచాయతీని రద్దు చేసింది. ఆ తర్వాత స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు అప్పటి మంత్రి బొత్స సత్సనారాయణ నగర పంచాయతీని తిరిగి మేజరు పంచాయతీగా మార్పు చేశారు. ఆ తరువాత పలుమార్లు మునిసిపాలిటీ ప్రస్తావన వచ్చినప్పటికీ సాధ్యం కాలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం నాయకులు కూడా అప్‌గ్రేడేషనను వ్యతిరేకించారు. ఆ పార్టీ హయంలో అప్‌గ్రేడేషన వద్దంటూ పంచాయతీ తీర్మానాన్ని కూడా ప్రభుత్వానికి  పంపించారు. దీంతో చీపురుపల్లికి మునిసిపాలిటీ యోగం లభించలేదు. తాజాగా చీపురుపల్లికి రెవెన్యూ డివిజన మంజూరైన నేపథ్యంలో పంచాయతీ అప్‌గ్రేడేషన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రెవెన్యూ డివిజనకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఏ పట్టణం కూడా మేజరు పంచాయతీగా ఉన్న దాఖలాలు లేవని, దీంతో బాటు నిధులు రావాలంటే మునిసిపాలిటీగా మార్పు చేయడం అనివార్యమన్నది అధినాయకత్వం చెబుతున్న మాట. ఈ పరిణామాలు గమనిస్తే చీపురుపల్లి, గరివిడి జంట పట్టణాలు కలిపి త్వరలోనే చీపురుపల్లి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కావొచ్చునని కనిపిస్తోంది.Read more