రాయితీ లేదుపో!

ABN , First Publish Date - 2022-12-31T00:32:34+05:30 IST

ఇలా భారీ రాయితీ ఉంటుందని ఆశపడి భంగపడిన రైతులు జిల్లాలో వందలాది మంది ఉన్నారు. ప్రభుత్వ రాయితీ తగ్గడంతో అంత మొత్తంలో నగదు చెల్లించుకోలేని చాలా మంది రైతులు సూక్ష్మ సేద్యంపై ఆశలు వదులుకుంటున్నారు.

రాయితీ లేదుపో!

రాయితీ లేదుపో!

సూక్ష్మసేద్యానికి తగ్గిన ప్రోత్సాహం

సబ్సిడీని తగ్గించిన ప్రభుత్వం

గతంలో ఎస్సీ, ఎస్టీలకు శతశాతం, ఇప్పుడు పూర్తిగా ఎత్తివేత

వారు కూడా వాటా మొత్తం కట్టాల్సిందే

ఇతర వర్గాలకూ మరింత భారం

పెదవివిరుస్తున్న రైతులు

=====================================

సూక్ష్మసేద్యం విస్తీర్ణం : 28 వేల ఎకరాలు

మొత్తం రైతులు : 24 వేల మంది

=====================================

(రాజాం)

- ఈయన పేరు బట్నా అప్పలనాయుడు. రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన ఈయనకు 6 ఎకరాల భూమి ఉంది. మెట్ట ప్రాంతం కావడంతో సూక్ష్మ సేద్య పరికరాలకు దరఖాస్తు చేసుకున్నాడు. మూడేళ్ల పాటు అదిగో ఇదిగో అంటూ చెప్పిన అధికారులు. రూ.4.50 లక్షల విలువైన పరికరాలు ఇచ్చారు. కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే రాయితీ కల్పించారు. గత ప్రభుత్వం 5 ఎకరాలు దాటిన రైతులకు 50 శాతం రాయితీ అందించింది.ఈ లెక్క రూ.2.25 లక్షల రాయితీ అందించాలి. కానీ రూ.75 వేలు కోత విధించింది.

- ఈయన పేరు బనాన ఈశ్వరరావు ఈయనది అదే పరిస్థితి. ఆరు ఎకరాల మెట్ట పొలంలో ఆరుతడి పంటలు వేసుకునేందుకు నిర్ణయించాడు సూక్ష్మసేద్య పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. భారీగా రాయితీ ఉంటుందని అధికారులు చెప్పారు. తీరా పరికరాలు ఇచ్చేటప్పుడు రూ.3 లక్షలు కట్టించుకున్నారు. రూ.4.50 లక్షల విలువైన పరికరాలు చేతిలో పెట్టారు. రాయితీ తగ్గడంతో అప్పుచేసి కట్టాల్సి వచ్చిందని ఈశ్వరరావు వాపోతున్నాడు.

ఇలా భారీ రాయితీ ఉంటుందని ఆశపడి భంగపడిన రైతులు జిల్లాలో వందలాది మంది ఉన్నారు. ప్రభుత్వ రాయితీ తగ్గడంతో అంత మొత్తంలో నగదు చెల్లించుకోలేని చాలా మంది రైతులు సూక్ష్మ సేద్యంపై ఆశలు వదులుకుంటున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేవి. ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మ సాగు పథకం (ఏపీఎంఐపీ) కింద రాయితీపై పరికరాలను అందించేవి. నీటిని పొదుపుగా వినియోగించి సాగు చేసే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అటకెక్కింది. మూడేళ్లుగా ఒక్క రైతుకూ సూక్ష్మ సేద్య ఫలాలు అందలేదు. దీనిపై విమర్శలు రావడం, ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ ఏడాది సూక్ష్మ సేద్యాన్ని పునరుద్ధరించారు.. కానీ ఈ పథకానికి ఇచ్చే రాయితీ ఎంత? ఏ జిల్లాకు ఏ కంపెనీ పరికరాలు ఇచ్చేది? అన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. ‘ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి.. ఆ తరువాత రాయితీ గురించి చూద్దాం’ అని ప్రభుత్వం చెప్పారు. తీరా రాయితీ గణనీయంగా తగ్గించి చేతిలో పరికరాలు పెట్టారు.

ఇలా మార్చారు

గతంలో ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు శతశాతం రాయితీతో డ్రిప్‌, స్ర్పింక్లర్లు, ఇతర పరికరాలను అందించేవారు. ఇతర రైతులకు 90 శాతం రాయితీపై వీటిని ఇచ్చేవారు. అదే విధంగా ఐదు నుంచి పది ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీపై, ఇతరులకు 70 శాతం రాయితీపై పరికరాలను ఇచ్చేవారు. కానీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 44 పేరిట సరికొత్త రాయితీలను తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం ఐదు ఎకరాల్లోపు రైతులందరికీ 90 శాతం, పది ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీ అందించడానికి నిర్ణయించారు. దీనిపై రైతులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలను ఇతర వర్గాలతో కలిపి రాయితీ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. గతంలో డ్రిప్‌ యూనిట్‌ విలువ రూ.97 వేలు ఉంటే...ప్రస్తుతం రూ.1.20 లక్షలకు పెరిగింది. అలాగే స్పింకర్ల యూనిట్‌ రూ.16వేల నుంచి రూ.22 వేలకు పెరిగింది. అదేస్థాయిలో లబ్ధిదారుని వాటా పెరగడంతో రైతులపై పెనుభారం పడుతోంది. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీని ఎత్తివేశారు. వారు కూడా 10 శాతం వాటా ధనం చెల్లించాల్సి ఉంటుంది.

జిల్లాకు ఎంతో ప్రయోజనం

జిల్లాలో మెట్ట ప్రాంతం అధికం. ఆయిల్‌ పామ్‌, కొబ్బరి, మామిడి, బొప్పాయి, జీడి, అరటి, కోకో, జామ తదితర పంటలను రైతులు సాగు చేస్తుంటారు. జిల్లాలో 28 వేల ఎకరాల్లో 24 వేల మంది రైతులు సూక్ష్మ సేద్యం చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటికి ఆరుతడి అవసరం. మెట్ట ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు కూడా అంతంతమాత్రం. ఈ నేపథ్యంలో బిందు సేద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు గుర్తించాయి. పండ్ల తోటలు వేసేందుకు అనేక మంది రైతులు ముందుకు వస్తున్నా.. సాగునీరు విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. అదే బిందు సేద్యం యూనిట్లు మంజూరైతే సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.

రబీకి నిలిచిన సాగునీరు

జిల్లాలో తోటపల్లి, మడ్డువలసతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సాగునీటి సరఫరాను నిలిపివేశారు. ఆధునికకీరణ పనుల నెపంతో సరఫరాను నిలివేస్తున్నట్టు ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో రబీ సాగునకు రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఈ సమయంలో ఆరుతడి పంటల వైపే మోగ్గుచూపుతున్నారు. అందుకే బిందు, సూక్ష్మ సేద్యం పరికరాలు అందిస్తే ఎంతో ఉపయోగమని రైతులు చఎబుతున్నారు.

ఎరువులు వాడకం తగ్గుతుంది

సూక్ష్మ సేద్య విధానంతో పంటలకు నేరుగా పోషకాలు అందుతాయి. నీళ్ల నుంచి మొక్కలకు ఎరువులను అందించడం ద్వారా సరాసరి మొక్కకే పోషకాలు చేరుతాయి. తద్వారా ఎరువుల వినియోగం తగ్గుతుంది. దానికి కావలసిన వెంచురీ సదుపాయాన్ని కూడా రాయితీ పరికరాలతో పాటు గతంలో అందించేవారు. సంప్రదాయ విధానంలో ఎరువులు చల్లడం ద్వారా వాటిలో 30 శాతం మేర పోషకాలు ఆవిరవుతుంటాయి. అదే సూక్ష్మ సేద్య విధానంలోని పైపుల ద్వారా ఎరువులు అందిస్తే... ఎకరా దగ్గర అదనంగా అర ఎకరం పొలానికి పోషకాలు అందించవచ్చు. భూగర్భ జలాలను సైతం రక్షించుకోవచ్చు.

ఏర్పాట్లు చేస్తున్నాం

సూక్ష్మ సేద్యానికి సంబంధించి పరికరాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం పథకంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కొత్తగా రాయితీ విధానాన్ని ప్రకటించింది. అర్హులందరికీ పథకం వర్తింపజేస్తాం. జిల్లాలో ప్రస్తుతం సూక్ష్మ సేద్యం పంటను 28 వేల ఎకరాల్లో 24 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటలు రైతులకు గిట్టుబాటు ఉంటుంది. అటు రాయితీలు తగ్గిన మాట వాస్తవమే. రైతుల విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

లక్ష్మీనారాయణ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ఏపీఎంఐపీ, విజయనగరం

Updated Date - 2022-12-31T00:32:36+05:30 IST