కొత్త జిల్లా.. సమస్యల ఖిల్లా
ABN , First Publish Date - 2022-12-31T00:31:58+05:30 IST
ఈ ఏడాది కొందరికి మోదాన్ని... కొందరికి ఖేదాన్ని మిగిల్చింది. ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలు.. 15 మండలాలతో నూతన జిల్లాగా ‘పార్వతీపురం మన్యం’ ఆవిర్భవించింది. మరో చరిత్రకు అంకురార్పణ జరిగింది.

2022లో నూతన జిల్లాగా ‘పార్వతీపురం మన్యం’ ఏర్పాటు
వసతుల కల్పన, అభివృద్ధి పనులపై దృష్టి సారించని ప్రభుత్వం
అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత
టీడీపీ కార్యక్రమాలకు విశేష ప్రజాదరణ
కలిసొచ్చిన విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన
(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)
కాల ప్రవాహంలో మరో ఏడాది కలసిపోతోంది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ ఏడాది కొందరికి మోదాన్ని... కొందరికి ఖేదాన్ని మిగిల్చింది. ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలు.. 15 మండలాలతో నూతన జిల్లాగా ‘పార్వతీపురం మన్యం’ ఆవిర్భవించింది. మరో చరిత్రకు అంకురార్పణ జరిగింది. మరోవైపు రాజకీయంగా కొందరిని పదవుల్లో కూర్చోబెట్టి.. ఎప్పటికీ మరచిపోలేని ఆనందాన్ని పంచింది. రాజకీయాలు, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో చోటుచేసుకున్న ముఖ్య సంఘటనలను ఓసారి మననం చేసుకుందాం.
జిల్లా ఆవిర్భావం..
ఈ ఏడాది ఏప్రిల్-4న పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భవించింది. 15 మండలాలు , సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచాయతీతో కొత్త జిల్లా ఏర్పాటైంది. శ్రీకాకుళం నుంచి పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం, విజయనగరం జిల్లా నుంచి గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ , గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు, పాచిపెంట, సాలూరుతో నూతన జిల్లాలో భాగమయ్యాయి. కలెక్టర్‌గా నిశాంత్‌కుమార్, ఎస్పీగా విద్యాసాగర్‌నాయుడు, జేసీగా ఆనంద్, డీఆర్‌వోగా జె.వెంకటరావుతో కూడిన ఉన్నతాధికారుల పాలన పురుడు పోసుకుంది.
గాడిన పడని పాలన..
జిల్లా ఆవిర్భావం జరిగి సుమారు తొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఇంకా పాలన గాడిన పడలేదు. కలెక్టర్ కార్యాలయానికి తప్ప ఎస్పీతోపాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా సొంత గూడులేదు. పార్వతీపురం పట్టణంలోని ఆర్‌సీఎం పాఠశాలలోనే ఇప్పటికీ పలు ప్రభుత్వ కార్యాలయాలను , మరికొన్నింటిని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో, గ్రామ సచివాలయాల్లో నిర్వహిస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. నూతన జిల్లాలో వసతుల కల్పన, అభివృద్ధిపై వైసీపీ సర్కారు దృష్టి సారించకపోవడంతో సమస్యలు అలానే కొనసాగుతున్నాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళన
జిల్లాలో ఎన్నడు లేని విధంగా జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీకి వారికి జీతాలు అందేవి. వైసీపీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ప్రతినెలా ఒకటో తేదీకే జీతాలు చెల్లించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని , సీపీఎస్ రద్దు చేయాలని పలుమార్లు కలెక్టరేట్, విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కలిసొచ్చిన చంద్రబాబు పర్యటన
విజయనగరం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన పార్వతీపురం మన్యం జిల్లాకు బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ‘మన్యం’లో ఇప్పటివరకు చంద్రబాబు పర్యటన జరగకపోయినప్పటకి రాజాం, బొబ్బిలి, విజయనగరంలో జరిగిన బహిరంగ సమావేశాలు, రోడ్‌షోలకు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. చంద్రబాబు సభలకు ఊహించని విధంగా ప్రజలు రావడం టీడీపీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని అందించింది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
టీడీపీ కార్యక్రమాలకు స్పందన భేష్
జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రధానంగా బాదుడే-బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాల ద్వారా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు. నిత్యావసరాల ధరలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు, పన్నుల పెంపు ఘనత వైసీపీదేనని ప్రజలకు తెలియజేయడంలో సఫలీకృతులయ్యారు. మొత్తంగా నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీకి విశేష ఆదరణ లభిస్తుండడంతో శ్రేణులు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.
కొఠియా గ్రామాల్లో ఒడిశా దూకుడు
ఏవోబీ కొఠియా ప్రాంతంలో ఒడిశా ప్రభుత్వం దూకుడుతోనే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అభివృద్ధి పేరుతో ఒడిశా ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి తహసీల్దార్ వరకూ తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలకు ప్రత్యేక పథకాలను అందిస్తున్నారు. ఏపీ అధికారులు వెళ్తే ఒడిశా అధికారులు పోలీస్ బలగాలతో అడుగడుగున అడ్డుకుంటున్నారు. కొఠియా గ్రామాలకు చెందిన ప్రజలు ఆంధ్రలో ఉంటామని బహిరంగంగా చెబుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెరవేరని హామీలు
జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు, సరిహద్దు వివాదం, పలు అభివృద్ధి పనులపై వైసీపీ సర్కారు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. ప్రధానంగా జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంతో పాటు కొఠియా గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ప్రత్యేక చర్చలు జరిపారు. అయినా ఈ ఏడాదిలో జంఝావతి ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. కొఠియా సరిహద్దు సమస్యలేవీ పరిష్కారం కాలేదు. ఇక ‘మన్యం’లో అడారిగడ్డ, తోటపల్లి ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తికాని పరిస్థితి ఉంది. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలు కూడా పూర్తి కావడం లేదు. వైద్యకళాశాల నిర్మాణం ఇంకా స్థల ఎంపికలోనే ఉంది. పార్వతీపురంలో తాగునీటి పరిష్కారానికి చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. పూర్ణపాడు-లాబేసు వంతెనను పూర్తిచేస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. ఆస్పత్రుల ఆధునికీకరణకు నిధులు మంజూరు జరిగాయని చెప్పినప్పటికి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఇంటింటికీ కొళాయిల పనులు ఎప్పుడు పూర్తివుతాయో తెలియని పరిస్థితి జిల్లాలో ఉంది.
జిల్లా అధికారుల బదిలీలు
జిల్లా ఆవిర్భావం తర్వాత పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పనిచేసిన కూర్మనాథ్ నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన భావనకు కూడా బదిలీ అయ్యింది. గృహనిర్మాణ శాఖ పీడీగా పనిచేసిన కూర్మినాయుడు అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. అదే విధంగా కొంత మంది గ్రూప్-1 అధికారులకు బదిలీలు జరిగాయి.
ఓవైపు గజరాజులు.. మరోవైపు పులి!
జిల్లావాసులను ఓవైపు పులి, మరోవైపు ఏనుగులు గజగజలాడిస్తున్నాయి. ప్రధానంగా భామిని, సీతంపేట, కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి , పార్వతీపురం, బలిజిపేట తదితర మండలాల వాసులను ఏనుగులు హడలెత్తిస్తున్నాయి. గజరాజుల కారణంగా ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున పంటలతో పాటు ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. వాటి తరలింపు విషయంలో ప్రభుత్వం, అటవీశాఖాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో పెద్ద పులి సంచారం కూడా మన్యం వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు మూగజీవాలను హతమార్చిన పులిని పట్టుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
‘గడప గడపకు’ నిలదీతలు
‘ గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో క్షేత్రస్థాయికి వెళ్లిన వైసీపీ నేతలకు నిలదీతలు ఎదురయ్యాయి. కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో కొరిశీల గ్రామానికి చెందిన గిరిజనులు రహదారులు నిర్మించాలని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిని నిలదీశారు. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండంలో చెల్లంనాయుడువలస గ్రామంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావును ఆ పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలోకి రావద్దంటూ నినాదాలు చేశారు.
‘మన్యం’లో వైసీపీకి షాక్
కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం నుంచి జియ్యమ్మ వలస ఎంపీపీ సురేష్ వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై చంద్రబాబునాయుడుతో మాట్లాడారు. తన అనుచరులతో టీడీపీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కొంత మంది టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. వాస్తవంగా వివిధ నియోజకవర్గాల్లోని వైసీపీలో చాపకింద నీరులా వర్గ విభేదాలు ఉన్నాయి. సరైన సమయంలో అవి బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిష్ఠానం టిక్కెట్లు ఇవ్వదని రఆ పార్టీలోని కొంత మంది నాయకులు జోరుగా ప్రచారం చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణలో సాలూరు నియోజకవర్గానికి కలిసోచ్చింది. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ విస్తరణకు ముందు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉపముఖ్యమంత్రిగా, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రిగా పనిచేశారు.
పాఠశాలల విలీనం
నూతన విద్యావిధానం అమలు వల్ల జిల్లాలోని 143 ప్రభుత్వ పాఠశాలలు విలీనమయ్యాయి. ప్రాథమిక బడులను సమీపంలో ఉన్నత పాఠశాలల్లో కలపడంతో పల్లెల్లో స్థానికంగా చదువుకునే అనేకమంది చిన్నారులు విద్యకు దూరమయ్యారు. మరికొందరు ‘ప్రైవేట్’ స్కూళ్ల బాట పట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పొచ్చు.
కొన్ని క్రైమ్‌లు
ఈ ఏడాది మే నెలలో పాలకొండ మండలంలో బాలికపై యువకుడు హత్యాచారం చేసిన సంఘటనకు సంబంధించి పోక్సో కేసు నమోదు చేశారు. అదే నెలలో సీతానగరం వద్ద సమతా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మే 12న గరుగుబిల్లి మండలం రావివలసలో అత్త రాముడమ్మను కోడలు గౌరమ్మ హత్య చేసింది. మే30న సీతంపేట మండలం మర్రిపాడులో ప్రత్యర్థుల చేతిలో సింగన్న అనే వ్యక్తి హతమయ్యాడు. మే 27న సవరుగున్ను అనే వ్యక్తి హత్యకు ప్రతీకారంగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి 16మందిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అదే నెలలో పార్వతీపురం పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలే మహిళల మెడలో బంగారు గొలుసులు తెంపుకుని పరారైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. జూలై నెలలో పాలకొండ నగర పంచాయతీకి చెందిన కమిషనర్ రామారావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
పేరుకే ఐటీడీఏలు
జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలు నామమాత్ర సేవలకే పరిమితమయ్యాయి. సర్కారు నిధులు కేటాయించకపోవడంతో రోజువారీ ఖర్చులకు కిటకిటలాడాల్సిన పరిస్థితి. గతంలో గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ట్రాక్టర్‌లు, వ్యవసాయ యంత్రాలతో పాటు ట్రైకార్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను అందించేవారు. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
రైతులకు తప్పని ఇబ్బందులు
ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బందులు తప్పలేదు. గోనె సంచులు, రవాణా సదుపాయం కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాటిని రైతులు ఏర్పాటుచేసుకుంటే ఆ తర్వాత వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కీలక బాధ్యతల నుంచి సర్కారు తప్పించుకుంది. దీంతో ధాన్యం తరలింపునకు అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. మరోవైపు మిల్లర్లు కూడా అదనంగా ధాన్యం ఇవ్వాలని, తేమశాతం అని మెలిక పెట్టడంతో రైతులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది.
Read more