YCP Leaders: ఎమ్మెల్యే కొల్లగట్లపై తిరుగుబాటు చేసిన విజయనగరం వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2022-08-03T17:07:42+05:30 IST
ఎమ్మెల్యే కొల్లగట్ల వీరభద్ర స్వామిపై విజయనగరం వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారు.

విజయవాడ: ఎమ్మెల్యే కొల్లగట్ల వీరభద్ర స్వామి (MLA Kollagatla)పై విజయనగరం వైసీపీ నేతలు (YCP Leaders) తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా నేతలు విజయవాడ వచ్చి.. మంత్రి బొత్స (Minister Bosta)ను క్యాంప్ కార్యాలయంలో కలిసి పరిస్థితి వివరించారు. సీఎం జగన్ (CM Jagan) దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే విషయంలో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా వైసీపీ ఇన్చార్జ్ పిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొల్లగట్ల వీర భద్ర స్వామి నియంతలా వ్యవహరిస్తున్నారని, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు చేస్తున్నారని, పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ వివరాలన్నీ మంత్రి బొత్స సత్యనారాయణకు వివరించి.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లమని చెప్పామన్నారు.
75 ఏళ్ల స్వాతంత్ర్యంలో బీసీలకు ఇంకా స్వాతంత్య్రం రాలేదని విజయ్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయనగరం టికెట్ బీసీలకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వీరభద్రస్వామి ఆగడాలు పెరిగి పోతున్నాయని, మాకు, మావాళ్లకు సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా టిక్కెట్లు ఇవ్వలేదని, వైసీపీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నా.. ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని విజయ్ కుమార్ అన్నారు.