మాండస్‌ కలవరం

ABN , First Publish Date - 2022-12-09T23:59:30+05:30 IST

జిల్లాలో రైతులను మాండస్‌ తుఫాన్‌ కలవరపెడుతోంది.

మాండస్‌ కలవరం
ధాన్యంపై టార్పాలిన్లు కప్పుతున్న దృశ్యం

రైతుల గుండెల్లో గుబులు

పార్వతీపురం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి)/సాలూరు: జిల్లాలో రైతులను మాండస్‌ తుఫాన్‌ కలవరపెడుతోంది. చేతికందొచ్చిన పంటలను రక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలులకు తోడు అక్కడక్కడా జల్లులు కురుస్తుండడంతో రైతన్నకు కంటి మీద కునుకు కరువవుతోంది. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చాలాచోట్ల కల్లాల్లోనే ధాన్యం రాశులు ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు శుక్రవారం సాలూరు మండలంలో మామిడిపల్లి, మర్రిపల్లి గ్రామాలతో పాటు గిరిజన పంచాయతీలైన సారిక, కురుకూటి, తోణాంలో రైతులు వరికోత పనుల్లో నిగమ్నమయ్యారు. కొందరు కోసిన పైరును కుప్పలుగా వేసి టార్పాలిన్లు కప్పారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని బస్తాలకెత్తి ఇళ్లకు తరలిస్తున్నారు. మొత్తంగా ధాన్యాన్ని భద్రపరిచేందుకు నానా తంటాలు పడుతున్నారు. తుఫాన్‌ గండం నుంచి తమను గట్టెక్కించాలని భగవంతుడిని వేడుకుంటున్నారు.

Updated Date - 2022-12-09T23:59:31+05:30 IST