భూమికి భూమి ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2022-07-19T04:52:02+05:30 IST

‘సేకరించిన భూమికి సమానమైన భూమి ఇవ్వాలి.. మార్కెట్‌ విలువ పెంచాకే భూములు సేకరించాలి.. గ్రామ సభలు ఏర్పాటు చేయాలి.. మెరుగైన పరిహారం ఇవ్వాలి’ అంటూ రైతుల నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంగణం మార్మోగింది.

భూమికి భూమి ఇవ్వాల్సిందే
కలెక్టరేట్‌ గేటు వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

మార్కెట్‌ విలువ పెంచాకే భూ సేకరణ చేపట్టాలి
‘సుజల స్రవంతి’ కాలువ నిర్వాసిత రైతుల ఆందోళన
 కలెక్టరేట్‌ వద్ద భారీగా మోహరింపు
కలెక్టరేట్‌, జూలై 18:
‘సేకరించిన భూమికి సమానమైన భూమి ఇవ్వాలి.. మార్కెట్‌ విలువ పెంచాకే భూములు సేకరించాలి.. గ్రామ సభలు ఏర్పాటు చేయాలి.. మెరుగైన పరిహారం ఇవ్వాలి’ అంటూ రైతుల నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంగణం మార్మోగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భూములు కోల్పోనున్న రైతులంతా సోమవారం భారీసంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించే దాకా అక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. అరుపులు, కేకలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
కాలువ నిర్మాణం ద్వారా కొత్తవలస,ఎల్‌.కోట, వేపాడ, ఎస్‌.కోట, గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, గుర్ల మండలాల్లోని 58 గ్రామాలకు చెందిన రైతుల భూములు కలవనున్నాయి. అయితే ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా వారి భూముల్లో సర్వే చేయడంతో కొన్ని నెలలుగా రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఏపీ రైతు సంఘం అఽధ్వర్యంలోసోమవారం నిరసనకు దిగారు. కలెక్టరేట్‌ గేటు వద్ద బైఠాయించారు. కలెక్టర్‌ బయటకు రావాలంటూ డిమాండ్‌ చేశారు. రైతు సంఘం అధ్యక్షుడు బి.రాంబాబు మాట్లాడుతూ రైతులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసి కాలువ ఎలైన్మెంట్‌, ఇతర  సమస్యలను తొలుత నివృత్తి చేయాలన్నారు. రైతుల ఆందోళనతో పరిస్థితిని అదుపులో చేసేందుకు కొందరు కలెక్టరేట్‌కు చెందిన అధికారులు గేటు వద్దకు వచ్చి రైతుల సమస్యలను విన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఆ తర్వాతే వారంతా శాంతించారు. నిరసనలో రైతు సంఘం నాయకులు చల్లా జగన్‌, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-19T04:52:02+05:30 IST