ఒకటా.. రెండా?

ABN , First Publish Date - 2022-08-28T05:02:59+05:30 IST

ఒకటా.. రెండా?

ఒకటా.. రెండా?

- జిల్లాలో సంచరిస్తున్న పులుల సంఖ్యపై కొరవడిన స్పష్టత

- ఒకేరోజు రెండు మండలాల్లో కనిపిస్తున్న టైగర్లు

- ఇది ఎలా సాధ్యం?

- తిరుగుతున్నవి రెండు పులులా?

- ధ్రువీకరించని అటవీశాఖ అధికారులు

రాజాం రూరల్‌, ఆగస్టు 27: జిల్లాలో సంచరిస్తున్న పులి ఒకటా.. రెండా అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 5న దత్తిరాజేరులో తిరిగిన పులి శనివారం రాజాం నియోజకవర్గం వంగర మండలంలో సంచరించింది. పులి కదలికలు వాస్తవమేనని నిర్ధారించిన అటవీశాఖ అధికారులు అది ఒకటా.. రెండా ఇంకా ఎక్కువే తిరుగాతున్నాయా అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.  ఫలితంగా ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈనెల 5న తొలిసారిగా జిల్లాలోని దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ పరిసరాల్లో పులి ఆవుపై దాడి చేసింది. 8న గజపతినగరం మండలం మరుపల్లి కొండపై పులి అడుగుజాడల్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇదేరోజు కొత్తవలస మండలం గులివిందాడలో పులి అడుగులు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇదేరోజు విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఆవుపై దాడి చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి.  అంటే ఒకేరోజు అటు విశాఖ, ఇటు విజయనగరం జిల్లాల్లో పులి సంచరించినట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 9న గజపతినగరం మండలం జయతి పంచాయతీ పరిధి బిరసాడవలసలో మేకల మందపై పులి దాడి చేసి రెండు మేకల్ని చంపేసింది. 16న బొండపల్లి మండలం కొత్తపనసలపాడులో ఆవుని చంపి దూడను ఎత్తుకెళ్లింది. 22న మెరకముడిదాం మండలం పులిగుమ్మిలో సంచరించినట్లు పాదముద్రల ద్వారా అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. 25న బాడంగి మండలం హరిజన పాల్తేరులో ఆవుపై దాడిచేసి మెడభాగం తినేసింది. 26న మెంటాడ మండలం పెద చామరాపల్లిలో పులిని చూసి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు, సిబ్బంది పరుగులు తీశారు.  26న రాత్రి తెర్లాం మండలం గొలుగువలస ప్రాంతంలో పులి సంచరించిందని సాక్షాత్తూ అటవీశాఖ ఉన్నతాధికారులే స్పష్టం చేశారు. వంగర ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని జిల్లా అటవీశాఖాధికారి రాజబాబు ప్రకటించారు. ఆయన ఊహను నిజం చేస్తూ శనివారం వంగర మండలం కింజంగి, తదితర ప్రాంతాల్లో పులి కదలికలు ఉన్నట్లు పాలకొండ అటవీశాఖ సిబ్బంది ధ్రువీకరించారు.


రెండు పులులేనా?

వాస్తవానికి జిల్లాలో రెండు పులులు తిరుగాడుతున్నాయనేందుకు వాటి కదలికలు బలం చేకూరుస్తున్నాయి. 8న గజపతినగరం ప్రాంతంలో ఉన్న పులి అదేరోజు  కొత్తవలసకు ఎలా చేరింది. గజపతినగరం - కొత్తవలస పట్టణాల మధ్య సుమారు 58 కిలోమీటర్లు ఉంటుంది. కొత్తవలస నుంచి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించి 9న గజపతినగరం మండలం జయతికి చేరడం సాధ్యమేనా? అన్న సందేహాలు నెలకొన్నాయి. 25న బాడంగి ప్రాంతంలో తిరిగిన పులి 26న మెంటాడ మండలంలోకి ఎలా చేరగలిగింది. ఈ రెండు ప్రదేశాల మద్య దూరం 38 కిలోమీటర్లు ఉంటుంది.  26న మెంటాడ  నుంచి అదేరోజు రాత్రి 50 కిలోమీటర్ల దూరంలోని తెర్లాం మండలం గొలుగువలసకు ఎలా చేరింది. అంటే జిల్లాలో రెండు పులులు సంచరిస్తున్నట్లు వెల్లడవుతోంది. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.


జడ్పీ మీటింగ్‌లో చర్చ

శనివారం జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో పులి అంశం చర్చకు వచ్చింది. పులుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ పులుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పపటు చేశామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. బొత్స మట్లాడుతూ పులులను బంధించేందుకు వీలుగా బోన్లు ఏర్పాటు చేయాలన్నారు. 


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

వంగర/తెర్లాం, ఆగస్టు 27: జిల్లాలో పులి సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. వంగర, తెర్లాం  మండలాల్లో పులి కదలికలను గుర్తించిన జిల్లా ఫారెస్టురేంజ్‌ అధికారి ఆర్‌.రాజా బాబు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అటవీశాఖ అధికారి వెంకటరావు, తహసీల్దార్‌ ఐజాక్‌, ఎస్‌ఐ లోకేశ్వరరావులు శనివారం సాయంత్రం వంగర మండలం కోనంగిపాడు, మరువాడలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు నిర్జన ప్రదేశాలకు వెళ్లరాదని, రాత్రిపూట ఇంటిలోనే ఉండాలని  సూచించారు. పులి కదలికలు కనిపిస్తే తమకు తెలియజేయాలన్నారు. అలాగే,  ఫారెస్టు రేంజ్‌ బీట్‌ ఆఫీసర్‌ స్వప్న, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ రిషికుమార్‌, తహసీల్దార్‌ రాజేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్‌, పశువైద్యాధికారి జె.నరేంద్రకుమార్‌లు  తెర్లాం మండలం గొలుగువలసకు వెళ్లి పులి కాలి ముద్రలను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. పులి మళ్లీ ఈ పొలిమేరలో తిరిగే అవకాశం ఉందని,  రాత్రి సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.   


పులిని పట్టుకుంటాం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ సంచరిస్తోంది. తెర్లాం మండలం గొలుగువలస ప్రాంతంలో ఆవు దూడపై దాడిచేసి వంగర సమీప ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పాదముద్రల ఆధారంగా  గుర్తించాం. పులిని పట్టుకునేందుకు శాఖాపరంగా చర్యలను కొనసాగిస్తున్నాం. 

- రాళ్లపల్లి రాజాబాబు, జిల్లా అటవీశాఖాధికారి

Read more