ఆ గ్రామాలకు.. ‘104’ వెళ్లట్లే!

ABN , First Publish Date - 2022-12-16T00:07:01+05:30 IST

‘ప్రతి నెల నిర్ధేశించిన సమయానికి 104 వాహనం వచ్చేది. వృద్ధులు, మహిళలు వైద్యసేవలు పొందేవారు. నెలకు తగ్గట్టు మందులు అందుకునేవారు’ కానీ గత రెండు నెలలుగా ఆ వాహనం జాడలేదు. దీంతో కొండశిఖర, మధుర గ్రామాల ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ఆ గ్రామాలకు.. ‘104’ వెళ్లట్లే!
104 వాహనం

ఆ గ్రామాలకు.. ‘104’ వెళ్లట్లే!

సచివాలయ ప్రాంతాలకే పరిమితమవుతున్న సంచార వైద్యశాల

వేధిస్తున్న వాహనాల కొరత..15 మండలాలకు ఒక్కొక్కటే..

మధుర గ్రామాల ప్రజలకు అందని వైద్యసేవలు

(గరుగుబిల్లి)

‘ప్రతి నెల నిర్ధేశించిన సమయానికి 104 వాహనం వచ్చేది. వృద్ధులు, మహిళలు వైద్యసేవలు పొందేవారు. నెలకు తగ్గట్టు మందులు అందుకునేవారు’ కానీ గత రెండు నెలలుగా ఆ వాహనం జాడలేదు. దీంతో కొండశిఖర, మధుర గ్రామాల ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తెరపైకి తీసుకురావడంతో 104 వాహనాలు సచివాలయాలు ఉన్న ప్రాంతాలు, పెద్దగ్రామాలకే పరిమితమవుతున్నాయి. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాలు, గూడేలకు అసలు ఆ వాహనాలు వెళ్లడం లేదు. మండలానికి ఒకటి, రెండు వాహనాలు ఉండడంతో.. అన్ని గ్రామాలకు సర్దుబాటు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో 104 వాహనాల ద్వారా అరకొరగానే సేవలందుతున్నాయి.

ఉన్నవి 19 వాహనాలే..

జనాభాకు తగ్గట్టు వాహనాలు లేవు. సాలూరు, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండలాలకు రెండు చొప్పున వాహనాలున్నాయి. మిగిలిన మండలాలకు మాత్రం ఒక్కో వాహనాన్ని మాత్రమే కేటాయించారు. అటు వైద్యులు, సిబ్బంది కొరత కూడా వేదిస్తోంది. 19 వాహనాలకు ఐదుగురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. బీపీ, సుగర్‌, థైరాయిడ్‌ వంటి సమస్యలతో వృద్ధులు బాధపడుతున్నారు. అటువంటి వారికి 104 వాహనాలు ఎంతగానో ఉపయోగపడేవి. కానీ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో అస్తవ్యస్తంగా మారింది. పీహెచ్‌సీ వైద్యులకే 104 బాధ్యతలను అప్పగించారు. పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులు ఉన్నట్లయితే ఒకరు 104 సేవలు, మరొకరు ఆరోగ్య కేంద్రంలో సేవలందించాలి. మన్యం జిల్లా పరిధిలోని 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 104 వాహనాలకు సంబంధించి ప్రభుత్వం జీపీఎస్‌ విధానం ఏర్పాటు చేసింది. సంబంధిత వైద్యులు సేవలందించే సమయంలో ఈ ప్రాంతంలోనే లాగిన్‌ కావాల్సి ఉంది. మధుర గ్రామాలకు వెళ్లి సేవలందిద్దామన్నా జీపీఎస్‌ విధానం అడ్డుగా మారింది. 104 వాహనంలో 15 రకాల సేవలు అందేవి. కానీ ఇవి ఇప్పుడు దూరమయ్యాయి. సచివాలయాలకు ఆనుకుని సుమారు 3 నుంచి 5 కిలో మీటర్ల దూరంలో మధుర గ్రామాలు అధికంగా ఉన్నాయి. సచివాలయాల పరిధిలో నెలకు రెండు సార్లు సేవలందిస్తున్నాయి. అవి కూడా సచివాలయం ఉండే గ్రామ పరిధిలోనే కావడంతో మిగతా గ్రామాల పరిధిలో ప్రజలకు సేవలండం లేదు.

ఇబ్బంది పడుతున్నాం

గతంలో 104 వాహనం ప్రతీ గ్రామానికి వచ్చేది. కానీ ఇప్పుడు సచివాలయం ఉన్న ప్రాంతాలకే పరిమితమం అవుతోంది. దీంతో దూరాభారంగా మారడంతో ఇబ్బందిపడుతున్నాం. వాహనాల సంఖ్యను పెంచి ప్రతీ గ్రామాన్ని సందర్శించే ఏర్పాట్లు చేయాలి.

- జి.వెంకటలక్ష్మి, గదబవలస, కొత్తూరు సచివాలయం

వర్ణనాతీతం

మధుర గ్రామాల ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. గతంలో నెలలో నిర్ధేశించిన సమయానికి వాహనం వచ్చేది. వైద్య పరీక్షలతో పాటు మందులు ఇచ్చేవారు. బాగా ఉన్న విధానాన్ని తప్పించడం బాధాకరం.తిరిగి పాత సేవలనే కొనసాగించాలి.

కండేన బలరాంనాయుడు, సాంబన్నవలస, గొట్టివలస సచివాలయం

మెరుగైన సేవలు

104 వాహనాల ద్వారా మెరుగైన సేవలందిస్తున్నాం. ప్రతీ గ్రామంలో సేవలందించేలా ఆదేశాలిచ్చాం. వా హనంలో ఫ్యామిలీ డాక్టర్‌ తో పాటు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

-దుర్గా కళ్యాణి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో, పార్వతీపురం మన్యం

Updated Date - 2022-12-16T00:07:03+05:30 IST