కలిసిరాని కాలం
ABN , First Publish Date - 2022-12-31T00:32:05+05:30 IST
కాల గర్భంలో మరో ఏడాది కరిగిపోతోంది. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం స్వాగతం పలుకుతోంది. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోయాల్సిన సమయం ఆసన్నమైంది. గత ఏడాది.. జిల్లా వాసులకు మంచీ చెడుల జ్ఞాపకాలను మిగిల్చింది. అభివృద్ధి పరంగా పురోగతి లేదు. కొత్త ప్రాజెక్టుల మంజూరు లేదు
కలిసిరాని కాలం
కాలగర్భంలో 2022 సంవత్సరం
కొత్త ప్రాజెక్టుల జాడలేదు..
ఉన్నవాటిపై నిర్లక్ష్యం వీడలేదు
అన్నివర్గాలకూ మొండిచేయే
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
కాల గర్భంలో మరో ఏడాది కరిగిపోతోంది. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం స్వాగతం పలుకుతోంది. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోయాల్సిన సమయం ఆసన్నమైంది. గత ఏడాది.. జిల్లా వాసులకు మంచీ చెడుల జ్ఞాపకాలను మిగిల్చింది. అభివృద్ధి పరంగా పురోగతి లేదు. కొత్త ప్రాజెక్టుల మంజూరు లేదు. ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. వ్యవసాయ అనుబంధరంగాలకు ఎటువంటి ఊతం లభించలేదు. పరిశ్రమల జాడలేదు. ఉద్యోగ, ఉపాధి కల్పన జరగలేదు. కొవిడ్ విపత్తును అధిగమించడం కాస్తా ఉపశమనం. రెండేళ్ల విరామం తరువాత పెద్దపండుగ పైడితల్లి అమ్మవారి పండుగను జిల్లా వాసులు ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ అధినేతల పర్యటనలు, అధికార పార్టీలో అసమ్మతి జ్వలాలు, ప్రజల నుంచి తిరస్కరణలు కనిపించాయి.
అతిపెద్ద ప్రమాదాలు
- ఏప్రిల్ 11న చీపురుపల్లి రైల్వేస్టేషన్ పరిధిలోని బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో ఓ బోగి నుంచి పొగలు రావడంతో అపరిచితులు చైన్ లాగడంతో రైలు నిలిచింది. భయంతో పక్క ట్రాక్‌పై పరుగులుతీసే క్రమంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టింది.
- ఆగస్టు 14న మెంటాడ మండలం పిట్టాడ వద్ద ఆటోపై తాటిచెట్టు పడింది. పిట్టాడ గ్రామానికి చెందిన రొంగలి మహేష్, లోతుగెడ్డ గ్రామానికి చెందిన సింహాచలం మృతిచెందారు. సగం నరికి వదిలేసిన తాటిచెట్టు యమపాశమైంది.
- జూలై 8న దత్తిరాజేరు సమీపంలోని కల్వర్టు గోతిలో కారు దూసుకుపోయింది. అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కారులో గంజాయి నిల్వలు బయటపడ్డాయి.
- ఏప్రిల్‌లో జిల్లా పునర్విభజన జరిగింది. 1979లో రూపాంతరం చెందిన జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు వేరుపడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం నియోజకవర్గం కొత్తగా వచ్చి చేరింది. కొత్తగా బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజెన్లు ఏర్పాటయ్యాయి.
వైసీపీలో విభేదాలు
- గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ స్వీప్ చేసింది. తొలి రెండేళ్లలో సవ్యంగా నడిచినా.. ఈ ఏడాది మాత్రం వైసీపీలో విభేదాలు ఎక్కువయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నెలకొంది. చివరకు బొత్స సత్యనారాయణ కూడా అసమ్మతి పోటు తప్పేలా లేదు. ఎస్.కోట, నెల్లిమర్ల నియోజకవర్గంలో నేతల మఽధ్య విభేదాలు బాహటంగానే ప్రస్పుటమయ్యాయి. అటు గడడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిలదీతలు తప్పలేదు. సంక్షేమ పథకాల్లో కోత, అభివృద్ధి లేకపోవడం వంటి వాటిపై ప్రజల నుంచి నిరసన సెగలు వచ్చాయి. గడపగడపకూ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకబడ్డారని సాక్షాత్ సీఎం జగనే ప్రకటించడం గమనార్హం.
- ఏప్రిల్ 11న సీఎం జగన్ మంత్రివర్గాన్ని విస్తరించారు. చాలామంది సీనియర్లకు తప్పించినా.. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణకు కొనసాగింపు ఇచ్చారు. అయితే ఆయన పురపాలక శాఖ తప్పించి విద్యాశాఖ అప్పగించడంపై రకరకాల చర్చలు నడిచాయి. ఆయన అయిష్టతగానే మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారని వార్తలు వచ్చాయి.
అధినేతల పర్యటనలు
- జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబరు 13న జిల్లాలో పర్యటించారు. జగనన్న కాలనీ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం, అవినీతిని వెలుగుతీసే భాగంగా జనసేన ‘సోషల్ ఆడిట్’ను నిర్వహించింది. విజయనగరం గుంకలాం లేఅవుట్ నుంచే పవన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లేవుట్‌ల ఏర్పాటులో వైసీపీ నేతలు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- ఈ ఏడాది డిసెంబరు 14న సీఎం జగన్ జిల్లాకు విచ్చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి కుమారుడు వివాహానికి హాజరయ్యారు.
- డిసెంబరు 23 నుంచి నాలుగు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ’ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. బీసీ, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చంద్రబాబు సభలకు లక్షలాది మంది జనాలు తరలివచ్చారు. టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. తెలుగుదేశం పార్టీ పరంగా ఈ ఏడాది శ్రేణులు బాగానే పనిచేశారు. బాదుడేబాదుడు, ఇదేంఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాలతో యాక్టివ్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టగలిగారు. టీడీపీ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ కనిపిస్తోంది.
రెండేళ్ల అనంతరం పెద్దపండుగ
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, జిల్లా వాసులు పెద్దపండుగగా భావించే పైడితల్లి అమ్మవారి పండుగకు రెండేళ్ల ‘కొవిడ్’ ఆంక్షల తరువాత ఈ ఏడాది వేడుకలకు అనుమతి లభించింది. దీంతో అక్టోబరు 11న సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.
అభివృద్ధిలో ‘పూర్’
ఈ ఏడాది జిల్లా అభివృద్ధిలో ఎటువంటి పురోగతి లేదు. వ్యవసాయ అనుబంధరంగాలకు ఎటువంటి ఊతం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు అంతంతమాత్రమే. అనుబంధరంగాలకు ప్రోత్సాహం కరువైంది. వేలాది ఎకరాలకు సాగునీరు, విజయనగరం నగరపాలక సంస్థ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తోటపల్లి, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ, తాటిపూడి, ఆండ్ర ప్రాజెక్టుల పరిస్థితి అదే. అయితే ఆధునీకరణ పేరుతో రబీకి సాగునీరు నిలిపివేశారు. ఆధునీకరణ పనులతో భీమసింగి చక్కెర కర్మాగారాన్ని మూసివేశారు. మూడు క్రషింగ్‌లు దాటినా తెరవలేదు. అటు సీతానగరం ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీది అదే పరిస్థితి.