‘చింత’ తీరేనా!
ABN , First Publish Date - 2022-10-04T05:11:07+05:30 IST
‘మన్యం’లో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు చింతపండు. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
‘మన్యం’లో కానరాని చింతకాపు
వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం
దిగుబడిపై సన్నగిల్లుతున్న ఆశలు
ఆవేదనలో గిరిజన రైతులు
ఇంకా మద్దతు ధర నిర్ణయించని జీసీసీ
మార్కెట్ ధర కంటే ఎక్కువగా చెల్లించాలని విన్నపం
(సీతంపేట)
‘మన్యం’లో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు చింతపండు. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. చింతపువ్వు దశలోనే ఈదురుగాలులు, వర్షాలు అధికంగా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడింది. దీంతో సాగుపై గిరిజన రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. ఆశించిన స్థాయిలో జీడిపంట లేకపోగా, చింత దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో దాని మీద ఆధారపడిన వారికి ఈ ఏడాది నిరాశే ఎదురైంది. వాస్తవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, కొమరాడ, పాచిపెంట ప్రాంతాల్లో 5 వేల క్వింటాళ్లు, సీతంపేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది. అసలు మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంత వాసులు కూడా భారీగా కొనుగోలు చేస్తుంటారు. జీసీసీకి కూడా ప్రధాన ఆదాయం చింతపండు కొనుగోలు ద్వారా సమకూరుతుంది. కాగా గత ఏడాది జీసీసీలో చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలుకు మొగ్గు చూపలేదు. 2020లో కిలో చింతపండు మద్దతు ధర రూ.36గా నిర్ణయించారు. గత ఏడాది నిల్వలు ఉండడంతో మద్దతు ధరను రూ.32.50గా ప్రకటించినప్పటికీ గిరిజనుల నుంచి చింతపండును కొనుగోలు చేయలేదు. దీంతో గిరిజనులు మైదాన ప్రాంత వ్యాపారులకు కిలో రూ.40 నుంచి రూ.45కు పంటను అమ్ముకున్నారు. ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. అయితే ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో ఆర్థిక కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని గుజ్జి, పెద్దూరు, కిరప, గాడిదపాయి, తాడిపాయి, కిల్లాడ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ జీసీసీ చింతపండుకు మద్దతు ధర నిర్ణయించలేదు. ఏటా లానే ఈ సారి కూడా బయట మార్కెట్ కంటే తక్కువగా ధర నిర్ణయిస్తే చింతపండును విక్రయించేదని లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్న కాస్త పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కొనుగోలుకు ప్రణాళికలు..
ఈ ఏడాది పెద్దఎత్తున చింతపండు కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. గత ఏడాది రూ.32.50 పైసలకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మద్దతు ధరను ఇంకా నిర్ణయించలేదు. గిరిజనుల నుంచి సేకరించిన చింతపండుకు గతంలో ఆన్‌లైన్ చెల్లింపులు జరిగేవి. ప్రస్తుతం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. గత ఏడాది కోల్డ్ స్టోరేజ్‌లో చింతపండు నిల్వ ఉన్నందువల్ల కొనుగోలు తగ్గిందని, ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండదు.
- సంధ్యారాణి, డివిజనల్ మేనేజర్, జీసీసీ