చదువులెలా?

ABN , First Publish Date - 2022-06-11T05:32:32+05:30 IST

ప్రభుత్వం ఉన్నత విద్యను అందించేందుకు ఎనిమిదేళ్ల కిందట డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఇంతవరకు శాశ్వత భవనాలు మాత్రం చేపట్టలేదు. జిల్లాలో రెండుచోట్ల మినహా ఇతర కళశాలలకు పక్కా భవనాలు లేక ఆరుబయట, ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.

చదువులెలా?
కళాశాల ఆవరణలో నేలపై తరగతులు నిర్వహిస్తున్న దృశ్యం(ఫైల్‌)

ఎనిమిదేళ్లయినా సొంతభవనాలు లేని డిగ్రీ కళాశాలలు
ఐదు కళాశాలల్లో రెండింటికే పక్కా భవనాలు
ఆరుబయట, ఇరుకు గదుల్లో తరగతులు
ప్రయోగాలకు తీవ్ర ఇక్కట్లు

ప్రభుత్వం ఉన్నత విద్యను అందించేందుకు ఎనిమిదేళ్ల కిందట డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఇంతవరకు శాశ్వత భవనాలు మాత్రం చేపట్టలేదు. జిల్లాలో రెండుచోట్ల మినహా ఇతర కళశాలలకు పక్కా భవనాలు లేక ఆరుబయట, ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సైన్స్‌ ప్రయోగాలకు తగ్గిన వసతి లేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసౌకర్యాల నడుమ పరాయిపంచన డిగ్రీ చదువులు సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా తయారైంది.

రాజాం, జూన్‌ 10:
జిల్లాలో రాజాం, చీపురుపల్లి, విజయనగరం, ఎస్‌.కోట, గజపతినగరంలో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. చీపురుపల్లి. ఎస్‌.కోటకు మాత్రం సొంత భవనాలు ఉండగా మిగతా వాటికి ఇంతవరకు భవనాల నిర్మాణం చేపట్టలేదు. జూనియర్‌ కళాశాల భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రభావం విద్యార్థుల ప్రవేశాలపై పడుతోంది. డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్నప్పటికీ సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నాయని కొంతమంది ప్రైవేటు సంస్థల వైపు మొగ్గుచూపుతున్నారు.

 రాజాంలో డిగ్రీ కళాశాల మంజూరై సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. 2014లో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ విద్యార్థుల ఇబ్బందులు చూసి కళాశాల మంజూరుకు చర్యలు చేపట్టారు. జీఎమ్‌ఆర్‌ సంస్థ చైర్మన్‌ గ్రంధి మల్లిఖార్జునరావు ప్రభుత్వానికి కేటాయించిన 34 ఎకరాల్లో డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికి ఐదెకరాలు  ఇచ్చేలా చొరవ తీసుకున్నారు. ఆ స్థలంలో కళాశాల భవన నిర్మాణం చేపడితే విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయని, వేరేచోట స్థలం ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్‌ ఒత్తిడి తేవడంతో ప్రస్తుతం రాజాం సమీపంలోని మొగులివలస సమీపంలో స్థలం కేటాయించినట్టు తెలిసింది. అయితే ఈ స్థలానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదంటున్నారు. ప్రస్తుతం రాజాం జూనియర్‌ కళాశాల  భవనాల్లోనే నడుస్తున్న డిగ్రీ కళాశాలలో 657 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్ని గదులే ఉండడంతో వసతి చాలడంలేదు. ఒక పూట ఇంటర్‌ మరోపూట డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు.. ప్రయోగశాలలు ఏర్పాటు చేసి మరిన్ని గ్రూపులు మంజూరు చేస్తే విద్యార్థుల ప్రవేశాలు 900 నుంచి 1000దాటే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు.

 గజపతినగరం కళాశాలలో 223 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో భవనాల నిర్మాణం చేపట్టలేదు. కొన్ని గదులే ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. చీపురుపల్లిలో కళాశాలకు సొంత భవనం ఉన్నప్పటికీ వసతి చాలని పరిస్థితి. ఇక్కడ 740 మంది చదువుతున్నారు. మరో 20 గదుల వరకు నిర్మించాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రం విజయనగరంలో 2019లో డిగ్రీ కళాశాల మంజూరైంది. ఈ ఏడాది 317 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా కేంద్రంలోనే సొంత భవనాలు లేవు. సాంస్కృతిక కళాశాల భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. సొంత భవనాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

ప్రయోగాలు కష్టమే
డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేపట్టకపోతే ప్రయోగశాలలు నిర్వహించడం కష్టతరమవుతుందని ప్రధానాచార్యులు అంటున్నారు. నాణ్యమైన విద్య ప్రశ్నార్థకంగా మారిందన్న ఆవేదన వారి మాటల్లో వినిపిస్తోంది. ప్రధానంగా బీఎస్సీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫర్నీచర్‌ లేక వారికి ఇక్కట్లు తప్పడం లేదు.

స్థలం కోసం ప్రయత్నిస్తున్నాం
కళాశాల ప్రిన్సిపాల్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి సొంత భవనాల కోసం స్థలాలను పరిశీలిస్తున్నాం. గతంలో కేటాయించిన స్థలం విద్యార్థులకు దూరం అవుతుందన్న ఆలోచనతో మొగులివలస వద్ద కేటాయించాలని తహసీల్దార్‌ను కోరాం. స్థలం కేటాయించిన వెంటనే నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తాను.
    - పి.స్వప్న హైందవి, డిగ్రీ కళాశాల, ప్రధానాచార్యులు, రాజాం


Read more