ఓరి.. దేవుడా!

ABN , First Publish Date - 2022-10-08T05:02:08+05:30 IST

జిల్లా కేంద్రంలో పురాతన ఆలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. అటు పాలకులు.. ఇటు అధికారులు దృష్టి సారించకపోడంతో చారిత్రక ఆనవాళ్లకు చెదలు పడుతున్నాయి.

ఓరి.. దేవుడా!
పార్వతీపురంలో సీతారామస్వామి ఆలయం

  జిల్లాకేంద్రంలో చారిత్రక ఆలయాలకు చెద

  కనీస అభివృద్ధికి నోచుకోని వైనం

  ఆలనా.. పాలనకు దూరం

  ధూపదీప నైవైద్యాలకు దాతలపైనే ఆధారం 

  పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు 

 (పార్వతీపురంటౌన్‌, అక్టోబరు 7)

 జిల్లా కేంద్రంలో పురాతన ఆలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. అటు పాలకులు.. ఇటు అధికారులు దృష్టి సారించకపోడంతో చారిత్రక ఆనవాళ్లకు చెదలు పడుతున్నాయి. పండగల సమయాల్లోనూ దాతల సహకారంతో ఉత్సవాలు, పూజలు చేయాల్సిన దుస్థితి. మొత్తంగా సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఆలయాలను ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా పార్వతీపురంలో సీతారామస్వామి, జగన్నాథ స్వామి,  రమా సత్యనారాయణ స్వామి ఆలయాలకు ఎంతో చరిత్ర ఉంది. వాటి ఆలనా .. పాలనా చూసేవారు కొరవడడంతో నానాటికీ వాటి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ముఖ్యంగా  జగన్నాఽథ స్వామి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేసే గుడించా మందిరం కూలడానికి సిద్ధంగా ఉంది.  ఇక 150 ఏళ్ల చరిత్ర కలిగిన రమా సత్యనారాయణ స్వామి ఆలయం కూడా జీర్ణావస్థకు చేరుకుంది.  ఒకప్పుడు పార్వతీపురం గ్రామ పంచాయతీగా ఉన్న కాలంలో పట్టణంలో కొంతమంది దాతలు ఈ ఆలయాన్ని నిర్మించారు. అన్నవరంలో సత్యనారాయణ స్వామి దేవాలయంలో మాదిరిగా ఇక్కడ కూడా పూజలు జరిగేవి. కాలానుగుణంగా దేవదాయశాఖాధికారులు ఆలయాభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. గత మూడేళ్లుగా జిల్లా కేంద్రంలో ఉన్న దాతలు, భక్తుల సాయంతో  ఆయా ఆలయాల్లో  వ్రతాలు, పూజలను తూతూ మంత్రంగానే జరిపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆలయాల్లో దేవుళ్ల భోగం కోసం దేవదాయశాఖ మంజూరు చేస్తున్న నిధులు అరకొరగా ఉండడంతో అర్చకులు దాతల సహయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. 

   కమిటీల నియామకం ఎప్పుడు..?

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో  దేవదాయశాఖ ఆద్వర్యంలో పట్టణంలోని పురాతల ఆలయాలకు సంబంధించి చైర్మన్‌లు, కమీటీ సభ్యుల నియామకం జరిగింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, మరోవైపు ఆలయాల కమిటీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఆలయాల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది.  గత ఏడాది నుంచి నాలుగు ఆలయాలకు చైర్మన్ల పేర్లు ప్రకటించారు. అయితే ఇప్పటికీ వారితో ప్రమాణ స్వీకారం చేయించలేదు. దీనిపై దేవదాయశాఖాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్రవాసులు కోరుతున్నారు.  

      ప్రతిపాదనలు పంపించాం

జిల్లా కేంద్రంలో చారిత్రక ఆలయాల అభివృద్ధికి సంబంధించి దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం.  ఆలయ కమిటీల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. దేవుళ్ల భోగాలకు నిధులు మంజూరు చేస్తున్నాం. 

- ప్రసాదరావు, జిల్లా కేంద్ర గ్రూపు దేవాలయాల అధికారి  


Updated Date - 2022-10-08T05:02:08+05:30 IST