కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం

ABN , First Publish Date - 2022-11-30T00:15:05+05:30 IST

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలైతే ప్రారంభమైంది కానీ ఎక్కడా ఈతంతు సాగడం లేదు. కీలక నేతలున్న ప్రాంతాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కువ మిల్లులు వారి చేతిలో ఉండడమే దీనికి కారణం.

కల్లాల్లో ధాన్యం.. కళ్లలో దైన్యం

పూర్తిస్థాయిలో ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

బ్యాంక్‌ గ్యారెంటీలివ్వని మిల్లర్లు

రూ.100 కోట్లు గ్యారెంటీ తీసుకోవాలని అధికారుల లక్ష్యం

ఇంతవరకు ఇచ్చింది రూ.12కోట్లే

అయోమయంలో అన్నదాతలు

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలైతే ప్రారంభమైంది కానీ ఎక్కడా ఈతంతు సాగడం లేదు. కీలక నేతలున్న ప్రాంతాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కువ మిల్లులు వారి చేతిలో ఉండడమే దీనికి కారణం. మరోవైపు వరి చేను కోతలు ముమ్మరమయ్యాయి. అమ్మకానికి పంట సిద్ధమవుతోంది. పంట కొంటారని గంపెడాశతో రైతులు ఎదురుచూస్తున్నారు. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకపోవడంతో కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఎప్పటిలా దళారులు ప్రవేశించి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. గుట్టుగా రైతుల చేతిలో డబ్బులు పెట్టి కొంత పంటను తీసుకుపోతున్నారు. మిల్లర్లంతా ఒక్కటై తెలివిగా బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు.

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ఏటా మాదిరి ధాన్యం కొనుగోలు తంతు ఆలస్యమవుతోంది. దళారుల టార్గెట్‌ పూర్తయ్యాక అసలు కొనుగోళ్లు ఊపందుకోవడం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. బ్యాంకు గ్యారెంటీ సకాలంలో ఇవ్వకుండా ధాన్యం కొనుగోళ్లు తమ చేతుల్లోకి తీసుకొనేలా మిల్లర్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 132 మిల్లులున్నాయి. వీరు గతేడాది రూ.86 కోట్లు బ్యాంకు గ్యారంటీ చూపారు. ఈ ఏడాది వంద కోట్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని జేసీ, పౌర సరఫరాలశాఖ డీఎంలు లక్ష్యంగా ఇచ్చారు. అయితే ఇంతరకు 20 మంది మిల్లర్లు రూ.12 కోట్లు మాత్రమే బ్యాంకు గ్యారంటీ చూపారు. రైతుల పంట నూర్పిడిలు ప్రారంభించినా మిల్లర్లు మాత్రం బ్యాంక్‌ గ్యారంటీలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

జిల్లా వ్యాప్తంగా 132 ధాన్యం మిల్లులు ఉండగా ప్రస్తుతం 83 మిల్లులే షార్టెక్స్‌ మిషన్లు అమర్చారు. ఈ మిల్లులకే ధాన్యాన్ని మిల్లింగ్‌కు అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో మరికొన్ని మిల్లులు షార్టెక్స్‌ మిషన్లను అనుసంధానం చేస్తున్నారు. అయితే బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకుండా జాప్యం చేసి ధాన్యం కొనుగోళ్లు సకాలంలో ప్రారంభం కాకుండా ప్రయత్నిస్తున్నారు. తమకు నచ్చినట్లు ధర, తూకం వేసుకునేలా తెరచాటున దళారులను ఏర్పాటు చేసుకుని కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం జిల్లాలో 510 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఇంతవరకు ఏడు టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.

దిగుబడి వచ్చినా..

జిల్లాలో ఈ ఏడాది వరి పంట సంతృప్తిగా పండింది. రైతులు కష్టానికి తగ్గట్టు ప్రకృతి అనుకూలించి దిగుబడులు సాధించారు. కాని గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించడం లేదు. వరి కోతలకు రెండు నెలల ముందునుంచే జేసీ ఆధ్వర్యంలో కొనుగోళ్ల కసరత్తు ప్రారంభిస్తున్నారు కాని సకాలంలో పంట కొనడం లేదు. మిల్లర్ల నుంచి త్వరగా బ్యాంక్‌ గ్యారెంటీలు తెప్పించలేకపోతున్నారు. దీంతో ఏటా మాదిరిగానే ఇప్పటికీ కొనుగోళ్లు ఊపందుకోలేదు. జిల్లాలోని 27 మండలాల్లో చాలా గ్రామాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభించారు. కొంత మంది రైతులు నేరుగా పంట కోత నూర్పిడి యంత్రాలతో ధాన్యాన్ని తీసి బస్తాల్లో సిద్ధం చేస్తున్నారు.

లక్ష్యం 3.5 లక్షల టన్నులు

ఈ ఏడాది జిల్లాలో సుమారు 98వేల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1.20 లక్షల హెక్టార్లు ఉండేది. జిల్లా విభజన తరువాత వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. 98వేల హెక్టార్లుగా ఉంది. ఆ మేరకు రైతుల నుంచి 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే లక్ష్యం కంటే ఎక్కువగానే ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రైతులు తమ తిండి అవసరాలకు భద్రపర్చుకోగా మిగిలిన 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నది అధికారుల అంచనా.

మద్దతు ధరే కీలకం

ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర ఆశాజనంగానే ఉంటోంది. కాని కొనుగోలు చేసేటపుడు మాత్రం ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. ఈ ఏడాది క్వింటాలు ధాన్యం ధర గేడ్‌-ఎ క్వింటాలు రూ.2060గా ప్రకటించారు. జిల్లాలో సాధారణ రకం ధాన్యం మద్దతు ధరనే అమలు చేస్తున్నారు. క్వింటాలు వద్ద రూ.2,040 అందించాల్సి ఉంది. ఈ ధర రైతులకు అందడం లేదు. అధికారులు కొనుగోలు విషయంలో పక్కాగా ఉండాలని రైతులు కోరుతున్నారు. భారీగా కూలీల రేట్లు, వ్యవసాయ యంత్రాల అద్దెలు, ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు ఇలా పెట్టుబడి భారీగా పెట్టారు. ఈ పరిస్థితిలో మద్దతు ధర కల్పించి రైతులకు ఊరట కల్పించాల్సి ఉంది.

నేతల బంధుగణానివే..

జిల్లాలోని ధాన్యం మిల్లుల్లో ఎక్కువ శాతం వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారివి లేదా వారి బంధుగణానివే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులకు చెందిన మిల్లులు అధికంగా ఉన్నాయి. దీంతో మిల్లర్లు వారికి నచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరో వైపు ప్రభుత్వం మిల్లర్లకు అందించాల్సిన మిల్లింగ్‌, రవాణా, హమాలీ ఇలా వివిధ బకాయిలు మూడేళ్లుగా అందించడం లేదు. దీంతో రైతుల నుంచే దోపిడీ చేసుకోండి అన్న రీతిలో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

----------

Updated Date - 2022-11-30T00:15:05+05:30 IST

Read more