నిధుల్లేవ్‌.. పనుల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-08-07T04:36:46+05:30 IST

జిల్లాలో సాగునీటి కాలువలు, చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి నిర్వహణను గాలికొదిలేసింది. కాలువల్లో కనీసం జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టిన దాఖలాలు లేవు. చెరువులు కేవలం ఉపాధి పనులకే పరిమితమవుతున్నాయి. మదుములు, చాప్టాలు ఎక్కడికక్కడే ధ్వంసమయ్యాయి. అధికారులు కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు. రైతులు అడుగుతుంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే తామేమీ చేసేదని చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతులే సొంత నిధులతో శ్రమదానం చేసి బాగుచేసుకుంటున్నారు. చెరువులు, కాలువలకు పడిన గండ్లను పూడ్చుకుంటున్నారు.

నిధుల్లేవ్‌.. పనుల్లేవ్‌!
పార్వతీపురం మండలం సంగంవలస నాయుడు చెరువుకు గండిపూడ్చుతున్న రైతులు

మైనర్‌ ఇరిగేషన్‌ను గాలికొదిలేసిన ప్రభుత్వం

మూడేళ్లుగా అతీగతీ లేని వైనం

చెరువులు, కాలువలదీ దయనీయ స్థితి

కనీసం గండ్లు పూడ్చలేని స్థితిలో అధికారులు

చందాలతో రైతులే బాగుచేసుకుంటున్న వైనం

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

 జిల్లాలో సాగునీటి కాలువలు, చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి నిర్వహణను గాలికొదిలేసింది. కాలువల్లో కనీసం జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టిన దాఖలాలు లేవు. చెరువులు కేవలం ఉపాధి పనులకే పరిమితమవుతున్నాయి. మదుములు, చాప్టాలు ఎక్కడికక్కడే ధ్వంసమయ్యాయి. అధికారులు కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు. రైతులు అడుగుతుంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే తామేమీ చేసేదని చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతులే సొంత నిధులతో శ్రమదానం చేసి బాగుచేసుకుంటున్నారు. చెరువులు, కాలువలకు పడిన గండ్లను పూడ్చుకుంటున్నారు. 

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో తోటపల్లి, జంఝావతి, అడారిగెడ్డ, పావురాయిగెడ్డ ఇలా అనేక సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు 2,915 చెరువులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ సాగుకు అవసరమైన నీటిని అందించలేకపోతున్నాయి. దశాబ్దాలుగా నిర్వహణ లేక చాల చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. దీనికితోడు ఆక్రమణలతో మరింత బక్కచిక్కిపోయాయి. ముఖ్యంగా చెరువుల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. జిల్లాలో చెరువుల ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉంది. కానీ అందులో సగం ఆయకట్టుకు నీరు అందించడం కష్టతరంగా మారింది. ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి తొలగింపు చేపడుతున్నా.. ఇతరత్రా పనులు చేపట్టడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాలంలో ఏటా వేసవిలో చెరువులు, కాలువల పనులు చేపట్టేవారు. పూడిక, మట్టి తొలగింపుతో పాటు జంగిల్‌ క్లియరెన్స్‌ చేసేవారు. దీంతో చెరువులు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకి ఉండేది కాదు. అటు శిథిలమైన మదుములు, చెక్‌డ్యామ్‌లు, కల్వర్టులు, చప్టాలు బాగుచేసేవారు. ఇందుకుగాను ముందస్తుగానే అధికారులు ప్రతిపాదనలు పంపించేవారు. ఆ ప్రాప్తికి నిధులు మంజూరయ్యేవి.  

 కనీస నిధులు విదిల్చక..

ప్రధానంగా మైనర్‌ ఇరిగేషన్‌ను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు, కాలువలకు సంబంధించి కనీస నిధులు విదిల్చడం లేదు. జిల్లా వ్యాప్తంగా మైనర్‌ ఇరిగేషన్‌కు సంబంధించి మరమ్మతు పనులకు అధికారులు రూ.200 కోట్లు అవసరమని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. ఇది జరిగి ఏళ్లు గడుస్తున్నా నిధులకు మాత్రం మోక్షం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సైతం ఇంతవరకూ బిల్లులు చెల్లించలేదు. దీంతో కొన్నిచోట్ల గండ్లు, అత్యవసర పనులు చేయాలని అధికారులు సూచిస్తున్నా స్థానిక నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. 

 సరైన ప్రణాళిక లేక..

మేజర్‌ నీటి ప్రాజెక్టుల నుంచి మైనర్‌ ప్రాజెక్టుల వరకూ అదే పరిస్థితి. అసలు ఖరీఫ్‌, రబీ సన్నద్ధత అంటూ లేదు. గత మూడేళ్లుగా సాగునీటి ప్రణాళిక అంటూ ఏదీ లేదు. కొద్దిపాటి వర్షాలకే కాలువలు, చెరువులకు గండ్లు పడుతున్నాయి. మొన్నటికి మొన్న తోటపల్లి ప్రాజెక్టుకు కూతవేటు దూరంలోని ప్రధాన కాలువకు గండి పడింది. కాలువ గట్టు బలహీనంగా మారడంతో సాగునీరు వృథాగా పోయింది. అటు యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించేందుకు కూడా అధికారుల వద్ద నిధులు లేకుండా పోయాయి. అత్యవసరంగా తాత్కాలికంగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. తాజాగా పాలకొండలో బ్రాంచ్‌ కాలువకు గండి పడింది. ఇంకా పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయక ముందే కాలువలకు గండ్లు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

సాగునీటి సంఘాలు నిస్తేజం

జిల్లాలో సాగునీటి సంఘాలు నిస్తేజంగా మారాయి. మూడేళ్ల కిందటే కార్యవర్గాల పదవీకాలం ముగిసింది. కానీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. చెరువులు, కాలువలు, ఆయకట్టు పరిధిలో ఏ చిన్న సమస్య వచ్చినా నీటి సంఘాల ప్రతినిధులు స్పందించేవారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంలో తాత్సారం చేస్తుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.సాగునీటి సంఘాలకు స్థానిక సంస్థల నుంచి నిధులు సమకూరుతాయి. రైతులు ఏటా చెల్లించే నీటి పన్నులు నీటి సంఘాల ఖాతాలకు జమ అయ్యేవి. వాటికి తోడు ప్రభుత్వం ప్రత్యేక నిధులు జోడించి విడుదల చేసేవి. గత ప్రభుత్వాల హయాంలో నీటి సంఘాలకు నిధులు పుష్కలంగా విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం ఉపాధి హామీ పనులతో చేపడుతున్న పనుల వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది.

నిధులు విడుదలైతే పనులు

సాగునీటి చెరువుల నిర్వహణపై దృష్టిసారించాం. పనులకు సంబంధించి రూ.200 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశాం. కలెక్టర్‌ చేతులమీదుగా ప్రభుత్వానికి నివేదించాం. నిధులు విడుదలైన వెంటనే పనులు చేయిస్తాం. ఖరీఫ్‌లో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం.  

 అప్పలనాయుడు, ఇంజినీరింగ్‌ అధికారి, ఇరిగేషన్‌ శాఖ



Updated Date - 2022-08-07T04:36:46+05:30 IST