వైభవం.. పందిరి రాట ఉత్సవం

ABN , First Publish Date - 2022-09-18T05:28:24+05:30 IST

మేళతాళాలు.. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ పైడిమాంబ సిరిమానోత్సవ తొలి ఘట్టం శనివారం పూర్తయ్యింది.

వైభవం.. పందిరి రాట ఉత్సవం
పందిరిరాట వేస్తున్న అర్చకులు, భక్తులు, అధికారులు


పైడితల్లి ఆలయాల్లో భక్తుల కోలాహలం
అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్‌
సిరిమానోత్సవ ఏర్పాట్లు ఇక మొదలు
విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 17:
మేళతాళాలు.. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ  పైడిమాంబ సిరిమానోత్సవ తొలి ఘట్టం శనివారం పూర్తయ్యింది. మూడులాంతర్ల వద్ద వున్న చదురుగుడిలో ఉదయం 9.30 గంటలకు,  రైల్వేస్టేషన్‌ వద్ద వున్న వనంగుడిలో 11 గంటలకు సాంప్రదాయం ప్రకారం పందిరిరాట ప్రక్రియను నిర్వహించారు. చదురుగుడిలో ఉదయం 6 గంటల నుంచే భక్తులు పైడిమాంబను దర్శించుకున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్‌ దంపతులు, కలెక్టరు ఎ.సూర్యకుమారిలు పైడిమాంబను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పందిరిరాటలో ఈవో కిషోర్‌కుమార్‌, ఆలయ అర్చకుడు బంటుపల్లి వెంకటరావుతో పాటు ట్రస్టు బోర్డు సభ్యులు, పైడిమాంబ మాలధారణ చేసే భక్తులు, నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. వనంగుడిలోనూ పందిరిరాట వేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పైడిమాంబను దర్శించుకున్నారు. పందిరిరాట ఉత్సవంలో భాగంగా ఆ తల్లిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.. మేయర్‌ వీవీ లక్ష్మీ, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ఇసరపు రేవతీదేవి, మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, పాలకవర్గ సభ్యులు తాడి సురేష్‌, పతివాడ రమణ, వెత్సా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సిరిమానోత్సవ ఏర్పాట్లు ఇక వేగిరం
సిరిమానోత్సవానికి నాందిగా నిలిచే పందిరిరాట ప్రక్రియ ముగియడంతో దేవదాయశాఖ అధికారులు ఇతర ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఈ నెల చివరి వారంలోగా కలెక్టర్‌ సూర్యకుమారి, ఎస్పీ దీపికాపాటిల్‌ ఆధ్వర్యంలో ఒక సమావేశం, ఆర్డీవో స్థాయిలో సిరిమానోత్సవ ప్రక్రియలో పాల్గొనే పరివారమైన బెస్తావారి వల, అంజలి రథం, పాలధారతో పాటు హుకుంపేట వాసులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు సిరిమాను చెట్టును గుర్తించడం, ఆ చెట్టుకు పూజలు నిర్వహించడం, చెట్టును విజయనగరం తీసుకురావడం, సిరిమానుగా మలిచే తంతు తదితర ప్రక్రియలన్నీ నెలాఖరులోగా దశలవారీగా పూర్తి చేయనున్నారు.


Read more