రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2022-12-16T23:56:50+05:30 IST

జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రోడ్డెక్కిన రైతులు
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

పార్వతీపురం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి)/పార్వతీపురంటౌన్‌: జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పార్వతీపురంలోని ఏఎంసీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కల్లాల్లో సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, పనికిరాని గోనె సంచులను అందిస్తున్నారని చెప్పారు. 40కేజీల 500 గ్రాముల ధాన్యం అందిస్తుంటే 42 కేజీలు ఇవ్వాలని కొన్ని మండలాల్లో అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. మిల్లుల వద్ద బస్తాదించడానికి రూ.ఐదు డి మాండ్‌ చేస్తున్నారని తెలిపారు. అనంతరం రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు బి.అప్పలనాయుడు, పి.శ్రీను నాయుడు, ముత్యాలు, దాసు, బి.నరసింగరావు తదితరులు మాట్లాడుతూ ..ప్రభుత్వం రైతులకు ఖాళీ గోనె సంచులను ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. బయట వాటిని కొనాలంటే రూ.ఎనిమిది వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు. 40 కేజీల వద్ద సుమారు రూ. పది కోల్పోవల్సి వస్తుండగా, కేజిన్నర ధాన్యం అదనంగా ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. కొందరు అధికారులు రైస్‌ మిల్లర్లకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. చాలాచోట్ల రైతు భరోసా కేంద్రాలు తెరచుకోకపోగా, ఇప్పటికీ ధాన్యం రవాణాకు వాహనాలను సమకూర్చకపోవడం, కొనుగోలు పక్రియను చేపట్టకపోవడం విచారకరమన్నారు. పంటపొలాల్లో ధాన్యాన్ని సేకరించిన 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెబుతున్నా.. అది అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డీఆర్వో వెంకటరావుకు వినతిపత్రం అందించారు. జంబ్లింగ్‌ విధానం వల్ల ఎదురవుతున్న ఇక్కట్లు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పార్వతీపురం మండలం పెద్దబొండపల్లికి చెందిన రైతులు వంగపండు ఆదినారాయణ , ఎస్‌.కృష్ణ, ఎం.సూర్యనారాయణ, వీజీ నాయుడు , దశరథ నాయుడు , సీతానగరం మండలం చినబోగిలికి చెందిన బి.అప్పారావు తెలిపారు. ఆయా సమస్యలను జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఆర్వో హామీ ఇచ్చారు.

Updated Date - 2022-12-16T23:56:52+05:30 IST