పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భావం
ABN , First Publish Date - 2022-04-05T06:12:05+05:30 IST
‘పార్వతీపురం మన్యం’ జిల్లా ఆవిర్భావ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కలెక్టర్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించారు.
తొలి అడుగు
పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భావం
కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్, ఎస్పీ
కుర్చీల కోసం నేతల వెతుకులాట
అధికారులపై ఎమ్మెల్యే రాజన్నదొర ఆగ్రహం
కాసేపటికే ఆయనకు అస్వస్థత
పార్వతీపురం, ఏప్రిల్ 4 : ‘పార్వతీపురం మన్యం’ జిల్లా ఆవిర్భావ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కలెక్టర్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ముందుగా డిప్యూటీ సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయ శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఆమెతో పాటు కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, విశ్వసరాయి కళావతి, శంబంగి చినప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీలు రఘురాజు, విక్రాంత్, తదితరులు కలెక్టర్, జేసీ, డీఆర్‌వో, వీడియో కాన్ఫరెన్స్ చాంబర్లు, జిల్లా ఖజానా కార్యాలయాల భవనాలను ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ చాంబర్లను ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తుండగా... మరోవైపు కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు హుటాహుటిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ కార్యాలయానికి వెళ్లారు.
హామీ ప్రకారం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పాలనకు ప్రాధాన్యమిస్తున్నామని... ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక జిల్లా ఉండగా, అరకు పార్లమెంట్ పరిధిలో రెండు జిల్లాలు ఉండడం సీఎం జగన్ వ్యక్తిగత శ్రద్ధ వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్ట్రంలో 51 డివిజన్లను 72 డివిజన్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేగవంతంగా జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
కుర్చీలు మేమే వేసుకోవాలా?
కలెక్టర్ కార్యాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవం అనంతరం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌కు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు కుర్చీ లేకపోవడం చూసి ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కుర్చీలు మేం వేసుకోవాలా? ఇలానే ఏర్పాట్లు చేస్తారా?’ అంటూ అధికారులపై మండిపడ్డారు. దీంతో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి జోక్యం చేసుకుని కుర్చీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. కుర్చీలు వచ్చేవరకూ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు కొంతసమయం నిలబడే ఉన్నారు. కుర్చీలు వచ్చిన తరువాత బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు కల్పించుకుని ఎమ్మెల్యే రాజన్నదొరను కుర్చీలో కూర్చోబెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైన తరువాత సుమారు గంటకు పైగా కొంతమంది వైసీపీ నాయకులు, అధికారులు హాలు బయట ఉన్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని అనుమతించలేదు. జియ్యమ్మవలస మండలానికి చెందిన ఒక వైసీపీ నాయకుడు గరుగుబిల్లి ఎస్‌ఐ రాజేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మమ్మల్నే ఆగమంటారా’ అంటూ మండిపడ్డారు.
ఎమ్మెల్యే రాజన్నదొరకు అస్వస్థత
సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుండగా ఎమ్మెల్యే రాజన్నదొర అస్వస్థతకు గురయ్యారు. స్వల్పంగా గుండె నొప్పి రావడంతో సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఏరియా ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి పర్యవేక్షణలో రాజన్నదొరకు ఆరోగ్య పరీక్షలు చేశారు. సుమారు మూడు గంటల అనంతరం ఆయన్ని డిశ్చార్జి చేశారు. పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్, మున్సిపల్ చైర్‌పర్సన్ బి.గౌరీశ్వరి, తదితరులు రాజన్నదొరను పరామర్శించారు.
ఆనందంగా ఉంది
కొత్త జిల్లాకు తొలి కలెక్టర్‌గా పనిచేయడం అదృష్టమని... ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానని కలెక్టర్ నిశాంత్‌కుమార్ తెలిపారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వహస్తానని చెప్పారు. కార్యాలయ భవనాల ప్రారంభం అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు అభివృద్ధే లక్ష్యంగా జిల్లాను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో పారదర్శకంగా పనిచేస్తానన్నారు. పాలన వికేంద్రీకరణ ఫలితాలు అందరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు.
అవకాశం దక్కడం అదృష్టం
పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ విద్యా సాగర్‌నాయుడు తెలిపారు. మన్యం జిల్లా తొలి ఎస్పీగా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల సహకారంతో సరిహద్దు గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తానన్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య ఎటువంటి అంతరం లేకుండా చూస్తామన్నారు.
అభివృద్ధికి కృషి
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వహిస్తానని జాయింట్ కలెక్టర్ ఆనంద్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ పూర్తయిన తరువాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.
వేడుకలకు మంత్రి బొత్స దూరం
పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భావ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆదివారం ఇక్కడి వివిధ శాఖల అధికారుల భవనాలను పరిశీలించిన ఆయన... సోమవారం జిల్లా ఆవిర్భావ దినోత్సవానికి హాజరవుతారని అంతా భావించారు. కానీ ఆయన హాజరుకాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.