ఆ పంచాయతీల్లో మళ్లీ ఎన్నికలు
ABN , First Publish Date - 2022-01-20T05:09:20+05:30 IST
ఆ పంచాయతీల్లో మళ్లీ ఎన్నికలు

- ఈసారి ఒడిశా తరఫున పోరు
- ఐదుకు చేరిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు
సాలూరు రూరల్ : గంజాయిభద్ర, పగులుచెన్నారు, పట్టుచెన్నారు పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ పదవికి ఇప్పటికే ఐదుగురు వ్యక్తులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదేమిటి పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తవ్వలేదు కదా మళ్లీ ఎన్నికలేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఆ పంచాయతీల్లో ఎన్నికలు నిజమే కాని ఇప్పుడు ఒడిశా పక్షాన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రా ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. ఒడిశాలో 853 జడ్పీ స్థానాలు, 6794 సర్పంచ్ స్థానాలు,6793 సమితి సభ్యులు, 91913 వార్డుసభ్యుల స్థానాలకు వచ్చే నెల 16, 18, 20, 22, 24 తేదీల్లో ఎన్నికల నిర్వహణకు ఒడిశా ఎస్ఈసీ ఆదిత్యప్రసాద్ పాఢి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ క్రమంలో సాలూరు మండలంలో ఉన్న కొఠియా పంచాయతీకి వచ్చే నెల 18న ఎన్నికలు జరగనున్నా యి. ఈ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ఈ నెల 17 నుంచి ఆరంభమైంది. నామినేషన్లు స్వీకరణ ఈ నెల 21 వరకు జరగనుంది. కొఠియా పంచాయతీలో 13 వార్డులున్నాయి. పం చాయతీ సర్పంచి అభ్యర్థులుగా బుధవారం ముసిరి పాంగి, నింగరాజ్ గెమ్మెల,లీవ్ గెమ్మెలలు నామినేషన్లు వేశారు. ఇప్పటికే వినోద్‌కుమార్ పంగి, మోహన్ పంగి నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం ఇప్పటి వరకు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ ఎగువ మెండంగి (ఏపీలో గ్రామం)కి మంజు హిమరిక, ఆరవ వార్డు బోరబందుకు గోమారి ఖోర, పదవ వార్డు మతలంబికి రజత్‌కుమార్ కిలో, 13వ వార్డు గంజాయిభద్ర (ఏపీ పంచాయతీ కేంద్రం) సంజు గెమ్మెల వార్డు సభ్యులకు నామినేషన్లు వేశారు. నామినేషన్ ప్రక్రియ 21తో ముగియగా 22న పరిశీలన, 23 నుంచి 25 వరకు నామినేషన్లు ఉపసంహరణ, వచ్చే నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. పం చాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరగనున్నాయి. సాలూరు మండలంలో పట్టుచెన్నారు, పగులుచెన్నారు, గంజాయిభద్ర పంచాయతీల్లో పూర్తిగాను, సారిక, కురుకూటి పంచాయతీల్లో కొన్ని గ్రామాల్లో ఒడిశా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ గ్రామాల్లో గతేడాది ఫిబ్రవరి 13న ఏపీ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆయా గ్రామాలు వారు మళ్లీ పంచాయతీ ఎన్నికలకు ఓటు వేయనున్నారు.