సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఏడాదిన్నరగా నిలిచిన తాగునీటి సరఫరా

ABN , First Publish Date - 2022-12-07T00:12:39+05:30 IST

సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులను తాగునీటి సమస్య వేధిస్తోంది.

సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఏడాదిన్నరగా నిలిచిన తాగునీటి సరఫరా
సీతంపేట ఏరియా ఆసుపత్రి

రోగులకు తప్పని ఇబ్బందులు

అధికారులు స్పందించాలని విన్నపం

(సీతంపేట)

సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులను తాగునీటి సమస్య వేధిస్తోంది. బయట నుంచి బాటిళ్లతో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే గర్భిణులు, బాలింతలకు భోజన సౌకర్యం నిలిచిపోగా, వేడినీటిని సైతం అందించడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా ఆసుపత్రిలో మోటారు మరమ్మతుల కారణంగా తాగు నీరు సరఫరా నిచిచిపోయింది. గత ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఆసుపత్రికి వచ్చేవారికి అవస్థలు తప్పడం లేదు. మిగతా రోగుల మాటెలా ఉన్నా.. ఆసుపత్రిలో డెలివరీ అయిన బాలింతలకు నిలువెచ్చటి నీటిని అందించాల్సి ఉంది. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను కూడా సమకూర్చాల్సి ఉంది. అయితే ఇంతవరకు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ కూడా అందుబాటులోకి తేలేదు. ఆసుపత్రి సిబ్బంది బయట నుంచి క్యాన్లతో అడపాదడపా నీరును సమకూరుస్తున్నారు. అయినా రోగులకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. మరోవైపు సీతంపేట కేంద్రంగా ఉన్న రెండు మెడికల్‌ షాప్‌ల యజమానులు రోజూ వేడినీటిని ఉచితంగా అందజేస్తున్నారు. దీంతో గర్భిణులు, బాలింతలకు కుటుంబ సభ్యులు, రోగులు అక్కడకు చేరుకుని బాటిళ్లలో మినరల్‌ వాటర్‌, వేడినీటిని తీసుకెళ్తున్నారు. నిత్యం వారు ఈ అవస్థలు పడుతున్నా.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. అసలు ఏరియా ఆసుపత్రిలో రోజుకు ఐదు నుంచి పది వరకు డెలివరీలు అవుతుండగా బాలింతలకు వేడినీటిని అందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని మండలవాసులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటరావును వివరణ కోరగా బాలింతలు, గర్భిణులకు వేడినీరు సరఫరా చేయడం లేదన్నారు. బయట నుంచి నీరు తెప్పించి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు భోజనాల సరఫరాకే నిధులు మంజూరు కాలేదని తెలిపారు.

Updated Date - 2022-12-07T00:12:40+05:30 IST