ప్రాజెక్టులను పట్టించుకోరా?

ABN , First Publish Date - 2022-12-15T00:23:28+05:30 IST

‘మన్యం’లో సాగునీటి వనరులపై దృష్టి సారించడం లేదు. వాటి నిర్వహణకు నిధులు మంజూరు చేయడం లేదు.

ప్రాజెక్టులను పట్టించుకోరా?
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు

నిధులు మంజూరు చేయని వైసీపీ సర్కారు

నిర్వహణను గాలికొదిలేసిన వైనం

టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైనవి రద్దు

రైతులకు తప్పని ఇబ్బందులు

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి/పార్వతీపురం రూరల్‌)

‘వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోంది. ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. కనీసం సాగు భూములకు పూర్తిస్థాయిలో నీరందించలేకపోతోంది. జిల్లాలో నెలకొన్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. అసలు ‘మన్యం’లో సాగునీటి వనరులపై దృష్టి సారించడం లేదు. వాటి నిర్వహణకు నిధులు మంజూరు చేయడం లేదు. మూడున్నరేళ్లుగా స్పందించకపోవడంతో ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రైతుల గోడును కూడా పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘మన్యం’ జిల్లాలో అత్యధికులకు వ్యవసాయమే ఆధారం. అయితే ఏటా వారిని సాగునీటి సమస్య వేధిస్తోంది. వరుణుడిపై ఆధారపడి చాలామంది పంటలను సాగు చేస్తున్నారు. ఈ దశలో జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాల్సిన వైసీపీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. కొన్నిచోట్ల ప్రాజెక్టు పనులను సైతం చేపట్టకపోవడంతో శివారుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.

సాగని జంఝావతి హైలెవెల్‌ కెనాల్‌ పనులు

జిల్లాలోని పార్వతీపురం, సీతానగరంతో పాటు కొమరాడ మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. దీనిపై రైతులు అనేక పర్యాయాలు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు శూన్యం. ఒక విధంగా చెప్పాలంటే జంఝావతి ద్వారా సాగునీరు అందిస్తామన్నది ఎన్నికల నినాదంగా మారింది. ఇప్పట్లో వ్యవసాయ భూములకు మాత్రం సాగునీరు అందే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.వాస్తవంగా కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాల్లో వ్యవసాయ భూములకు హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా జంఝావతి నుంచి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరించింది. అయితే అప్పట్లో ప్రారంభించిన పనులు నేటికీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌ తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పనులు పూర్తికి అప్పట్లో రూ. 40 కోట్లు మంజూరు చేసింది. కాగా ఆ తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన వైసీపీ సర్కారు వాటిని రద్దు చేసింది. కొద్ది కాలానికి నెల్లూరుకు చెందిన ఆర్‌కేఎల్‌ ప్రాజెక్టుకు ఆ పనుల బాధ్యతలను అప్పగించారు. మొదట్లో కాస్త చురుగ్గా హైలెవెల్‌ కెనాల్‌ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లులు వస్తాయో లేదో అన్న సందేహంతో చేతులెత్తేశారు. పూర్తిగా పనులు చేపట్టలేమని ప్రభుత్వానికి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం అదేదీ పట్టించుకోకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. అయినా హైలెవెల్‌ కెనాల్‌కు సంబంధించిన పనుల్లో కదలిక రావడం లేదు.

అడారు గెడ్డ

పార్వతీపురం మండలంలోని అడారు వద్ద అడారుగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఇందుకోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. సుమారు 90 శాతం పనులను పూర్తి చేశారు. అయితే భూసేకరణ పూర్తికాకపోవడం వల్ల మిగిలిన 10 శాతం పనులకు మోక్షం లభించడం లేదు. దీంతో ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించలేని పరిస్థితి ఏర్పడింది.

వరహాలగెడ్డ

పార్వతీపురం మండలంలోని పెదమరికి పంచాయతీ శివ్వందొరవలస వద్ద 600 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో వరహాల గెడ్డ ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఇప్పటికి కనీసం 300 ఎకరాలకు కూడా సాగునీరందని పరిస్థితి ఉంది. నిధులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు స్పష్టం చే స్తున్నారు.

పెదంకలాం ప్రాజెక్టు ..

సీతానగరం మండలంలోని పెదంకలాం ప్రాజెక్టు నిర్వహణకు జైకా నిధులు మంజూరైనప్పటికీ పనులు మాత్రం పూర్తికాలేదు. దీంతో శివారు ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితి లేదు. రూ. 17 కోట్లు కేటాయించినా పనులు నత్తనడకన సాగుతుండడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.

తోటపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్లు ఇలా..

తోటపల్లి ప్రాజెక్టు కేంద్రంగా కురుపాం నియోజకవర్గంలో నాగూరు, చింతలబెలగాం, తోటపల్లిలో రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లిఫ్ట్‌ ఇరిగేషన్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం చింతలబెలగాంకు రూ. 17 కోట్ల 25 లక్షల 50 వేలు, తోటపల్లికి రూ. 14.34 కోట్లు, నాగూరుకు రూ. 12 కోట్ల 43 లక్షల 60 వేలు మంజూరు చేశారు. టెండర్లు ప్రక్రియ జరిగేలోపే సాధారణ ఎన్నికల ప్రారంభం కావడంతో సీన్‌ మారింది. పాలన పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ కాలంలో మంజూరు చేసిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత కొత్తగా మంజూరు చేసినట్లు ప్రకటించుకున్నా.. ఇంతవరకూ పనులు ప్రారంభించ లేదు. ఇదిలా ఉండగా జిల్లాలోని ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం రైతులకు అన్యాయం జరుగుతుందని భావించి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి తోటపల్లి ప్రాజెక్ట్‌ ద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను చేపడితే ఏ ప్రాంత రైతులకు అన్యాయం జరగదు. అయినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి కేంద్రీకరించకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.

నోటీసులు జారీ చేశాం

హైలెవెల్‌ కెనాల్‌ పరిధిలో పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశాం. జంఝావతి ద్వారా పార్వతీ పురం, కొమరాడ, సీతానగరం మండలాల్లో వ్యవసాయ భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందించాలన్న లక్ష్యంతో ఉన్నాం. ఈ మేరకు పనులు పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం.

- జగదీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, జంఝావతి ప్రాజెక్ట్‌

Updated Date - 2022-12-15T00:23:30+05:30 IST