ధర్నాలపై చూపిన శ్రద్ధ పనిపై చూపించరా?
ABN , First Publish Date - 2022-12-16T23:46:45+05:30 IST
మండలంలోని 31 పంచాయతీల్లో 26 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా రోజుకు 480 మందికి మాత్రమే ఉపాధి పని కల్పిస్తారా.. ధర్నాలు చేయడానికి ఉన్న శ్రద్ధ వేతనదారులకు పని కల్పించడంలో లేదని డ్వామా పీడీ ఉమా పరమేశ్వరి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మెంటాడ: మండలంలోని 31 పంచాయతీల్లో 26 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా రోజుకు 480 మందికి మాత్రమే ఉపాధి పని కల్పిస్తారా.. ధర్నాలు చేయడానికి ఉన్న శ్రద్ధ వేతనదారులకు పని కల్పించడంలో లేదని డ్వామా పీడీ ఉమా పరమేశ్వరి ఆగ్రహం వ్యక్తంచేశారు. మెంటాడ ఉపాధి హామీ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో ఆమె శుక్రవారం సమావేశమయ్యారు. గ్రామాలవారి ప్రగతిని అడిగి తెలుసుకున్నా రు. వ్యవసాయ పనుల వల్ల వేతనదారులు పనికి రావడం లేదని ఫీల్డ్అసిస్టెంట్లు చెప్పుకొచ్చారు. దీంతో పీడీ తమాషాగా ఉందా.. పిట్ట కథలు చెబితే వినాలా.. అం టూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కొక్క గ్రామంలో రోజుకు 450 నుంచి 900 మంది వేతనదారులకు పని కల్పించాలని లక్ష్యాన్ని నిర్దేశిస్తే, పూర్తిగా పని కల్పించని వారు కొందరైతే, కొందరు 30 నుంచి 40 వరకు పని కల్పించి చేతులు దులుపుకుంటు న్నారని అన్నారు. ధర్నాలు, నిరసనలు చేయడానికి ఉన్న శ్రద్ధ పని కల్పించడంలో చూపరేమని ప్రశ్నించారు. ప్రణాళిక తయారీ, పనులు కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెం ట్ల తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు వరకు సమన్వయ లోపం కనిపిస్తోంద న్నారు. ఫీల్డ్‌అసిస్టెంట్ల ఒక నెల జీతం నిలుపుదల చేయాలని ఎంపీడీవో త్రివిక్రమ రావుకు ఆమె ఆదేశించారు. మండలంలో ఉపాధి హామీ అస్తవ్యస్తంగా ఉందని, కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎంపీపీ సన్యాసిరావు, వైస్ ఎంపీపీ ఈశ్వరరావు, ఎంపీడీవో త్రివిక్రమరావు, ఏపీఎం చిన్నాబ్బాయి పాల్గొన్నారు.
‘అధికార నాయకుడి పనే చేయడం లేదు’
సమావేశం జరుగుతుండగా, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రెడ్డి గౌరీ భర్త రెడ్డి రాజప్పలనాయుడు కార్యాలయం లోపలకు వచ్చారు. తను చిన్న, సన్నకారు రైతునని, వైసీపీ సీనియర్ నాయకుడునని పరిచయం చేసుకున్నారు. తన మామిడి తోట చెట్లు చుట్టూ బోదెలు గట్టి పరిచేందుకు రెండేళ్లుగా తిరుగుతున్నానని, ఉపాధి పనుల్లో భాగంగా ఈ పనులు మంజూరు చెయ్యాలని దరఖాస్తు చేశానని, అలాగే జలసిరి కోసం దరఖాస్తు చేశానని చెప్పారు. అయినా సిబ్బంది, అధికారులు ఎవరూ స్పందించలేదన్నారు. ‘నా పనే అధికారుల చేయడం లేదు. నేనెవ్వరికి రికమెండ్ చేయగలను’ అని ఆవేదన చెందారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తానని పీడీ ఆయనకు హామీ ఇచ్చారు. పని చేయని సిబ్బందిపై చర్యలు తీసుకొని, సస్పెండ్ చేస్తే ఇదే నాయకులు మళ్లీ ఒత్తిడి చేస్తారని చెప్పి ముగించడం కొసమెరుపు.