బీఈడీ ప్రవేశాల్లో జాప్యం
ABN , First Publish Date - 2022-12-16T00:01:48+05:30 IST
బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకు సాధించిన అభ్యర్థులు కళాశాలల్లో చేరేందుకు నిరీక్షిస్తున్నారు. నోటిఫికేషన్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ జరగకపోవడంతో వారంతా గందరగోళంలో ఉన్నారు.
వెబ్ ఆప్షన్ కోసం అభ్యర్థుల నిరీక్షణ
ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి 40 రోజులు
కలెక్టరేట్, డిసెంబరు 15: బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకు సాధించిన అభ్యర్థులు కళాశాలల్లో చేరేందుకు నిరీక్షిస్తున్నారు. నోటిఫికేషన్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ జరగకపోవడంతో వారంతా గందరగోళంలో ఉన్నారు. ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి 40 రోజులు కావొస్తున్నా ఇప్పటివరకూ కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్‌కు అవకాశం ఇవ్వలేదు. దీంతో కోర్సులో చేరనున్న అభ్యర్థులు నిరాశ పడుతున్నారు. కళాశాలలో ఎప్పుడు చేరాలి? అనేదానిపై అయోమయంలో పడ్డారు. విద్యా సంవత్సరం వృథా అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
బీఈడీ ప్రవేశానికి సంబంధించి ఈ ఏడాది మే 6వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. మే 9 నుంచి జూన్ 7వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఏడాది జూలై 13న ప్రవేశ పరీక్ష జరిగింది. సుమారు 4700 మంది పరీక్ష రాశారు. అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబరు 22 నుంచి 31వ తేదీ వరకూ రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. అక్టోబరు 26 నుంచి నవంబరు 8వ తేదీ వరకూ ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేపట్టారు. దాదాపు 2800 మంది అభ్యర్థులు ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం కళాశాలల ఎంపిక (వెబ్ ఆప్షన్) నవంబరు 9 నుంచి 11 వరకూ జరగాలి. ఒక వేళ ఎవరైనా అభ్యర్థులు వెబ్ ఆప్షన్ మార్పు చేసుకోవాల్సి వస్తే గత నెల 12న అవకాశం ఉన్నట్లు షెడ్యూల్లో పొందుపరిచారు. అలాగే 14వ తేదీన కళాశాలల కేటాయింపు జరగాలి. గత నెల 15 నుంచి 19 తేదీల మధ్య ఎంపిక చేసుకున్న కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. అయితే ఈ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ జరగలేదు. షెడ్యూల్ ప్రకారం నెల రోజులు గడిచినా ఇంతవరకూ ఎటువంటి ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడంతో ఆయా అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 23 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు ఐదు వేల సీట్లు ఉన్నాయి. విద్యా సంవత్సరం గడిచి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఉన్నత విద్యా మండలి కళాశాలల ఎంపికపై ఎటువంటి అవకాశం లేకపోవడంతో అభ్యర్థులు నిరాశతో ఎదురు చూస్తున్నారు. ఇకనైనా ఉన్నత విద్యా మండలి స్పందించి వెంటనే కళాశాలలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
-------