సాగు షురూ..

ABN , First Publish Date - 2022-07-19T04:48:55+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులంతా పొలంబాట పట్టారు. వరి నాట్లు వేయడంలో బిజీ అయ్యారు. గ్రామాల్లో ఏ పంట పొలం చూసినా రైతులు, కూలీలతో కళగా కనిపిస్తోంది. మెట్టు పంటలు కూడా కోతకు వచ్చాయి. వర్షాలకు చెరువులు నిండడం... నదుల్లో ప్రవాహాలు పెరగడం.. జలాశయాలు కూడా నిండుగా ఉండడంతో కొండంత ఆశతో అన్నదాతలు ఖరీఫ్‌ను ఆరంభిస్తున్నారు.

సాగు షురూ..
బొబ్బిలి మండలంలో నాట్లు వేస్తున్న రైతులు


ఊపందుకున్న ఖరీఫ్‌ వ్యవసాయ పనులు
కోతకు వచ్చిన మెట్ట పంటలు..
వరి నాట్లు వేస్తున్న రైతులు
కూలీలకు పెరిగిన డిమాండ్‌
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులంతా పొలంబాట పట్టారు. వరి నాట్లు వేయడంలో బిజీ అయ్యారు. గ్రామాల్లో ఏ పంట పొలం చూసినా రైతులు, కూలీలతో కళగా కనిపిస్తోంది. మెట్టు పంటలు కూడా కోతకు వచ్చాయి. వర్షాలకు చెరువులు నిండడం... నదుల్లో ప్రవాహాలు పెరగడం.. జలాశయాలు కూడా నిండుగా ఉండడంతో కొండంత ఆశతో అన్నదాతలు ఖరీఫ్‌ను ఆరంభిస్తున్నారు.  కొన్ని జలాశయాల పరిధిలో ఇప్పటికే నాట్లు పూర్తిచేశారు. ఎక్కువ శాతం రైతులు ఉబాలు చేపడుతున్న కారణంగా కూలీలకు డిమాండ్‌ పెరిగింది. ఎకరంలో నాట్లు వేసేందుకు రూ.2500 నుంచి రూ.2700 వరకు డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది రూ.2000 నుంచి 2200 వరకు తీసుకునే వారు. ఈ ఏడాది అదనంగా రూ.300 నుంచి 500వరకు కూలి పెంచేశారు. డిమాండ్‌ కారణంగా అడిగినంతా ఇచ్చి వ్యవసాయ పనులను పూర్తి చేస్తున్నారు. కాగా వ్యవసాయ పెట్టుబడి భారీగా పెరుగుతోంది. ఎకరం భూమిలో పంట చేతికి అందేటప్పటికి రూ.35వేల నుంచి రూ.40వేలు అవుతోంది. దీంతో రైతులు వరి వేసేందుకు భయపడుతున్నారు. పంటకు ముందు మూడు సార్లు దుక్కి వేయాలి. నారు పోయాలి. తర్వాత నారు తీసి కట్టలుగా చేసి సర్దాలి. అనంతరం నాట్లు వేయాలి. కొద్దిరోజుల తర్వాత కలుపు తీయడం... ఎరువులు వేయడం... పురుగు మందులు పిచికారీ చేయడం తదితర పనులు చేపట్టాల్సి ఉంటుంది. అన్నీ అయ్యాక వాతావరణం అనుకూలిస్తేనే పంట చేతికి అందుతుంది. కానీ చివరి దశలో అకాల వర్షాలు, తుఫాన్ల ప్రభావంతో భారీగా నష్టపోవడం ఏటా చూస్తున్నాం. ఇదే కారణంతో కొందరు రైతులు సాగుకు వెనుకంజ వేస్తున్నారు.

 ఈ ఏడాది జిల్లాలో 3.32 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో పంటలు సాగవుతాయని అంచనా. ఉద్యాన పంటలు మినహా  వరి, చెరకు, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, గోగు తదితర పంటలు వ్యవసాయ శాఖ పరిధిలోకి వస్తున్నాయి. ఇవి కాకుండా ఉద్యాన పంటలుగా ఉన్న మామిడి, జీడి, కొబ్బరి, అరటి, ఆయిల్‌పామ్‌, బొప్పాయి, కోకో, జామ, సపోటా, కూరగాయలు, పువ్వులు పంటలు 1.75 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు.

Updated Date - 2022-07-19T04:48:55+05:30 IST