సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక
ABN , First Publish Date - 2022-10-18T04:40:38+05:30 IST
జిల్లాలోని ఐటీడీఏ ప్రాంతాల్లో సమగ్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు.
కలెక్టర్ నిశాంత్‌కుమార్
పార్వతీపురం, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐటీడీఏ ప్రాంతాల్లో సమగ్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘స్పందన’ కార్యక్రమం అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీవోలు, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈ నెల 25 నాటి కి తుది కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. వాగులు, వంకలతో సహా వంతెనల నిర్మాణం, అనుసంధానం చేసేందుకు ఉన్న అన్ని ప్రదేశాలను గుర్తించి అందులో పొందుపరచాలని తెలిపారు. జిల్లాలో నాడు-నేడు పనుల కార్యనిర్వహణ బాధ్యతలు పేదరిక నిర్మూలన సంస్థ సహాయ ప్రాజెక్టు మేనేజర్లు (ఏపీఎంలు) చేపడుతున్నారన్నారు. వారికి మంగళవారం నుంచి శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పూర్తిస్థాయి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించి ధ్రువీకరణ పత్రాలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ బి.జగన్నాథరావును ఆదేశించారు. ఇదిలా ఉండగా ఈ నెల 21న పాలకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 12 కంపెనీలు వస్తున్నాయని, 1140 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం నిరుద్యోగ యువత జాబ్‌మేళా పోస్టర్‌ను విడుదల చేశారు. రైతుభరోసా కార్యక్రమం కింద జిల్లాలో 1,39,356 మంది అన్నదాతలకు ప్రభుత్వం రూ. 60.267 కోట్లు అందించినట్లు కలెక్టర్ వెల్లడించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమవుతుందని చెప్పారు. ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో పలువురు రైతులకు చెక్కు అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి .రాబర్ట్‌పాల్, తదితరులు పాల్గొన్నారు.