వెళ్లలేం.. రాలేం!

ABN , First Publish Date - 2022-10-01T05:13:52+05:30 IST

జిల్లాలో పాలకొండ-రాజాం ప్రధాన రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. 20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ మార్గం పూర్తి అధ్వానంగా మారింది.

వెళ్లలేం.. రాలేం!
అధ్వానంగా ఉన్న పాలకొండ-రాజాం రహదారి

  అధ్వానంగా మారిన పాలకొండ-రాజాం రహదారి

  దారిపొడవునా గోతులే..  

  ప్రయాణం.. నరకం

  నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు 

  మరమ్మతులకు గురవుతున్న వాహనాలు 

  పట్టించుకోని ప్రభుత్వం

 పెదవి విరుస్తున్న ప్రజలు

(పాలకొండ)

 జిల్లాలో పాలకొండ-రాజాం ప్రధాన రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది.  20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ మార్గం పూర్తి అధ్వానంగా మారింది.  అడుగుకో గొయ్యి ఏర్పడగా  రోజుకు కనీసం రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఈ దారి గుండా ప్రయాణమంటేనే ప్రజలు హడలెత్తిపో తున్నారు. వర్షాకాలంలో అయితే వారి బాధలు రెట్టింపవుతున్నాయి. వర్షపునీరు ఈ గోతుల్లో చేరడంతో వాహనదారులు అదుపుతప్పి తరచూ ప్రమాదాల బారినప డుతున్నారు. ఎంతోమంది గాయాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

వాస్తవంగా విజయనగరం, పార్వతీపురం మన్యం ఉమ్మడి జిల్లాలో పాలకొండ-రాజాం రహదారి ఎంతో ప్రధానమైనది. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపార అవసరాల నిమిత్తం రోజూ వేలాదిమంది ఈ  దారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అనారోగ్య, అత్యవసర సేవలకు రాజాంతో పాటు విశాఖ వెళుతుంటారు. ఒడిశా వాసులు కూడా ఇదే మార్గాన్ని ఆశ్రయిస్తుంటారు.    ఎన్నో గ్రామాలను కలుపుతున్న కీలకమైన ఈ రహదారిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.  గడిచిన మూడేళ్లలో  కనీసం మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో ఈ రోడ్డు పూర్తిగా ఛిద్రమైంది. ప్రజలకు నరకం చూపిస్తోంది. ఈ రహదారిగుండా ప్రయాణించాలంటే ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందే.  ఈ క్రమంలోనే వాహనాలు  అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. పాలకొండ మండలం పరిధిలోని అన్నవరం జంక్షన్‌ నుంచి పాలకొండ, వీరఘట్టం జంక్షన్‌కు కేవలం 300 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మాత్రం ప్రయాణాన్ని వాహనదారులు 30 నిమిషాలు పాటు ప్రయాణం చేయాల్సి ఉందంటే రహదారి దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇదిలా ఉండగా పాలకొండ-రాజాం మధ్య సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంది. 40 నిమిషాల వ్యవధిలో వాహనాలు రాకపోకలు సాగించేవి. అటువంటిది రోడ్డు పాడవ్వడంతో గంటన్నర పాటు ప్రయాణం చేయాల్సి వస్తోందని వాహన చోదకులు చెబుతున్నారు. సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వాహనాలు కూడా పాడవుతున్నాయని చెబుతున్నారు.  ఏమాత్రం ఏమరపాటుగా ప్రయాణించినా ప్రమాదానికి గురికావాల్సిందేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అతి కషమ్మీద రాకపోకలు సాగించాల్సి వస్తోందని వాపోతున్నారు.  ఇదే మార్గం గుండా ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. కనీసం వారు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.  రెండు నియోజకవర్గాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం. కానీ వారు శ్రద్ధ చూపక పోవడంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

తరచూ ప్రమాదాలు 

గడిచిన మూడేళ్లలో రాజాం-పాలకొండ రహదారిలో అన్నవరం జంక్షన్‌ నుంచి వీరఘట్టం జంక్షన్‌ వరకు ఉన్న 300 మీటర్ల పరిధిలో అనేక ప్రమాదాలు జరిగాయి.  ఈ నెల 28న ట్రాలీ ఆటో బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌కు గాయాలపాలయ్యాయి. 29న జరిగిన ఆటో బోల్తా సంఘటనలో నలుగురు మహిళలు తీవ్ర గాయాలయ్యారు. తాజాగా శుక్రవారం ఊకలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. 

   ప్రతిపాదనలు పంపించాం

మా పరిధిలో  సంకిలి వరకు ఉన్న పాలకొండ-రాజాం రహదారిని మరమ్మతులు చేసేందుకు రూ.మూడు కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. సంకిలి నుంచి రాజాం వరకు ఉన్న రహదారికి విజయనగరం జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారులకు కూడా ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం

 - రాజు, జేఈ, ఆర్‌అండ్‌బీ  

 

Read more