బ్యాగు.. బేజారు!

ABN , First Publish Date - 2022-10-18T04:09:35+05:30 IST

భోగాపురం మండల విద్యావనరుల కేంద్రంలో నాణ్యతలేని బ్యాగులు ఇలా గుట్టలుగా పోగుచేశారు. జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా విద్యాసంవత్సరం ప్రారంభంలో బ్యాగులు అందించారు. అయితే అవి నాసిరకానివి కావడంతో ఇచ్చిన వారం రోజులకే పాడయ్యాయి.

బ్యాగు.. బేజారు!
భోగాపురం మండల విద్యావనరుల కేంద్రంలో గుట్టలుగా ఉన్న నాణ్యత లేని బ్యాగులు


నాసిరకంగా విద్యాకానుక బ్యాగులు
ఇచ్చిన కొద్దిరోజులకే పాడైన వైనం
తిరిగి కార్యాలయాలకు చేర్చుతున్న హెచ్‌ఎంలు
ఎమ్మార్సీల్లో గుట్టలు గుట్టలుగా...
మల్లగుల్లాలు పడుతున్న అధికారులు


భోగాపురం మండల విద్యావనరుల కేంద్రంలో నాణ్యతలేని బ్యాగులు ఇలా గుట్టలుగా పోగుచేశారు. జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా విద్యాసంవత్సరం ప్రారంభంలో బ్యాగులు అందించారు. అయితే అవి నాసిరకానివి కావడంతో ఇచ్చిన వారం రోజులకే పాడయ్యాయి. దీంతో వాటిని వెనక్కి పంపిస్తున్నారు.  వీటిని ఏంచేయాలో తెలియక అధికారులు ఇలా కార్యాలయంలో నిల్వ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 65 వేల వరకూ బ్యాగులు బాగాలేకపోవడంతో కార్యాలయాలకు తిరిగి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

(భోగాపురం)
జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా ఇచ్చిన బ్యాగులు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ఇచ్చిన కొద్దిరోజులకే జిప్పులు ఊడిపోవడం, బ్యాగు చిరిగి పోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వంతో పాటు అధికారులు మాత్రం అంత సవ్యంగా పంపిణీ చేసినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాకానుక పేరుతో పుస్తకాలు, యూనీఫారం, బూట్లు, సాక్సులు అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు బ్యాగు కూడా పంపిణీ చేసింది. వీటికిగాను ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతోంది.అయితే ప్రారంభం నుంచే బ్యాగులు బాగాలేదని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కామెంట్స్‌ వినిపించాయి. ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అటు అధికారులు కూడా ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే బ్యాగులు పంపిణీ చేసి నెలలు దాటుతోంది. అటు నాసిరకం బ్యాగులు అంటూ విద్యార్థుల నుంచి వెనక్కి వస్తున్నాయి. వాటన్నింటినీ మండల కార్యాలయాల్లో సంరక్షిస్తున్నారు. కానీ వాటి స్థానంలో కొత్తవాటిని తెచ్చే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు కార్యాలయాలు నాసిరకం బ్యాగులతో నిండిపోతున్నాయి.


ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలోని 34 మండలాల్లో 2,814 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.  2,22, 561 మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లతో బ్యాగులు అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే 64 వేల బ్యాగులు పాడైనట్టు అధికారులు గుర్తించారు.  భోగాపురం మండలంలో 74 పాఠశాలలకు సంబంధించి 6,013 మంది విద్యార్థులకు బ్యాగులు అందించగా... అందులో 1,850 నాసిరకంగా ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులు యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి ఎమ్మార్సీ కార్యాలయానికి వాటిని అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కార్యాలయానికి సమాచారమిచ్చినట్టు స్థానిక ఎంఈవో రమణమూర్తి తెలిపారు.


ప్రభుత్వానికి నివేదించాం
జిల్లా వ్యాప్తంగా బ్యాగులు నాసిరకం సరఫరా అయినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని మండలాల్లో ఇటువంటి బ్యాగులు 64 వేల వరకూ ఉన్నట్టు గుర్తించాం. ప్రభుత్వానికి నివేదించాం. వాటి స్థానంలో కొత్తవి మంజూరైన వెంటనే విద్యార్థులకు అందిస్తాం.
-శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష సీఎంవో, విజయనగరం



Updated Date - 2022-10-18T04:09:35+05:30 IST