ఇవి కాలువలా?

ABN , First Publish Date - 2022-05-19T05:10:54+05:30 IST

పైరు పచ్చగా ఉండాలంటే నీరు అవసరం. నీళ్లు పూర్తిస్థాయిలో అందివ్వాలంటే సాగునీటి కాలువలే ఆధారం. సాగుకు కీలక వనరుగా భావించే కాలువలు కొన్నేళ్లుగా రూపు మారుతున్నాయి. పూడిక, పిచ్చి మొక్కలతో నిండిపోయి నీటి నిల్వ, ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతూ కనిపిస్తున్నాయి.

ఇవి కాలువలా?
పిచ్చి మొక్కలతో సారథిగెడ్డ


పిచ్చి మొక్కలు.. పేరుకున్న పూడిక
ఏళ్లుగా పట్టించుకోని అధికారులు
నీరందక నష్టపోతున్న రైతులు


పైరు పచ్చగా ఉండాలంటే నీరు అవసరం. నీళ్లు పూర్తిస్థాయిలో అందివ్వాలంటే సాగునీటి కాలువలే ఆధారం. సాగుకు కీలక వనరుగా భావించే కాలువలు కొన్నేళ్లుగా రూపు మారుతున్నాయి. పూడిక, పిచ్చి మొక్కలతో నిండిపోయి నీటి నిల్వ, ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతూ కనిపిస్తున్నాయి. రెండు జిల్లాలకు ఆధారంగా ఉన్న రాజాం చుట్టుపక్కల ఉన్న ప్రధాన సాగునీటి కాలువలు అరకొర నీళ్లతో వెలవెలబోతున్నాయి. రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.

రాజాం రూరల్‌, మే 18:
కాలువలు జలకళతో ఉంటే రైతు మోములో సంతోషం కనిపిస్తుంటుంది. ఏ పంట అయినా సాగు చేయవచ్చునన్న ధీమా తొణికిసలాడుతుంది. నేడు అదే కొరవడుతోంది. సాగునీటి కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోతున్నాయి. ఏళ్లుగా మరమ్మతుల్లేక, పూడిక తొలగించక శివారు భూములకు నీరివ్వని పరిస్థితి నెలకొంది. సాగునీటి కాల్వలను శుభ్రం చేసి, మరమ్మతులు చేపట్టాలని రాజాం రైతాంగం అనేకమార్లు నేతలు, అధికారులకు విన్నవిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో భవిష్యత్‌పై అన్నదాతలు గుబులు చెందుతున్నారు.
- రెండు జిల్లాల్లోని 30 గ్రామాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరందించే రాజాం సమీపంలోని సారధిగెడ్డ పూర్తిగా పిచ్చిమొక్కలు, ఇతరత్రా వ్యర్థాలతో నిండిపోయింది. ఒకప్పుడు మిగులు జలాలతోనూ చెరువులు, వాగులు, వంకల ద్వారా వచ్చి చేరే నీటితోనూ ఈ గెడ్డ ప్రవహిస్తూ జలకళతో ఉండేది. సారధిగెడ్డకు ఆ విధమైన రూపు నిస్తూ ఒకప్పుటి బొబ్బిలి రాజులు సాగునీటి వ్యవస్థను రూపొందించారు. ఈ గెడ్డ ద్వారా రాజాం మండలంలోని బీఎన్‌వలస, జీసీ పల్లి, మారేడుబాక, కొత్తవలస, సారధి, అంతకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలం నాగులవలస, పెంట, కొత్తపెంట గ్రామాల చెరువులను నింపుతోంది. మరోవైపు సంతకవిటి మండలం మండాకురిటి, సిరిపురం తదితర గ్రామాలలోని పొలాలకు సాగునీరందించేది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సారధిగెడ్డను బాగు చేసేందుకు ఏ అధికారీ, నేత చొరవ తీసుకోవడం లేదు. దీంతో కాలువలోని మొక్కలు చెట్లు అయిపోయాయి. పూడిక పెరిగి గెడ్డను మైదానంలా మార్చేసింది.
- రుద్రసాగరం కాలువ సైతం మరమ్మతులకు నోచుకోవడంలేదు. తెర్లాం ప్రాంతం నుంచి మిగులుజలాలు ప్రవహిస్తూ రాజాం, రేగిడి మండలాల పరిధిలో సుమారు 30 గ్రామాల రైతాంగానికి భరోసాగా ఉండేది. దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరందించేలా ఆ కాలువను  నిర్మించారు. రాజాం మండలలోని కొత్తపేట, ఒమ్మి, ఆగూరు, అమరాం తదితర గ్రామాల మీదుగా రేగిడి మండలం కాగితాపల్లి, బాలకవివలస, కొర్లవలస, పనసలవలస, తదితర గ్రామాల రైతాంగానికి రుద్రసాగరం ద్వారా సాగునీరందేది. ఈ ప్రధాన సాగునీటి వనరు కూడా దయనీయంగా మారింది. కాల్వల్లో పిచ్చిమొక్కలు వెక్కిరిస్తున్నాయి.

తోటపల్లి పిల్ల కాల్వలదీ అదే దుస్థితి
తోటపల్లి ప్రధాన కాల్వ నుంచి రాజాం నియోజకవర్గంలోని వందలాది ఎకరాలకు నీరందించే పిల్లకాల్వలు సైతం మూడేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. నాలుగు మండలాల్లోనూ ఇదే దుస్థితి. ఫలితంగా శివారు భూములకు సకాలంలో సాగునీరందక రైతులు నానా అవస్థలకు గురవుతున్నారు. భవిష్యత్తులో సాగు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేకపోలేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అఽధికారులు సాగునీటి కాల్వలను బాగుచేయడంపై దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.


ప్రతిపాదనలు పంపిస్తున్నా..
రుద్రసాగరం, సారథిగెడ్డ కాలువల మరమ్మతుల కోసం పలుమార్లు చీఫ్‌ ఇంజినీర్‌కు ప్రతిపాదనలు పంపించాం. ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. నిధులు మంజూరు కాలేదు. ఆ రెండు సాగునీటి వనరుల్లో పిచ్చిమొక్కలు పేరుకుపోవడం వాస్తవమే. రైతులు సాగునీటికి ఇబ్బందులు పడకూడదని తమ వంతుగా ప్రయత్నిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నాం.
                - రాజేష్‌, ఏఈ, ఇరిగేషన్‌


-----------

29న పాలీసెట్‌
పరీక్షకు పక్కా ఏర్పాట్లు: డీఆర్‌వో
కలెక్టరేట్‌, మే 18: ఈనెల 29న జరగనున్న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు పక్కగా ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో గణపతిరావు ఆదేశించారు. తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం పట్టణంలోని 10 కేంద్రాలు, బొబ్బిలిలో 9, గజపతినగరంలో 4 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష హాల్‌లోకి గంట ముందు అనుమతిస్తారని, 11 తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని చెప్పారు. విద్యాశాఖ నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. వేసవిలో దృష్టిలో పెట్టుకుని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లును ప్రథమ చికిత్సకు అవసరమైన ముందులను పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్దకు అవసరమైన చోట బస్సులు నడపాలని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాలిటెక్నికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా పరీక్షల సమన్వయ అధికారి విజయలక్ష్మి, విద్యాశాఖ ఏడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

ఫొటో రైటప్‌: 18 కలెక్టరేట్‌ 1: మాట్లాడుతున్న డీఆర్‌వో గణపతిరావు
========================

నేటి నుంచి మిషన్‌ నిర్మాణ్‌ శిక్షణ
కలెక్టరేట్‌, మే 18: పదో తరగతి నుంచి ఇంజినీరింగ్‌ వరకూ చదివే విద్యార్థుల కోసం మిషన్‌ నిర్మాణ్‌ -2022 పేరిట ఐదురోజుల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమగ్ర శిక్ష అభియాన్‌ పర్యవేక్షణలో కేంబ్రిడ్జి అసైన్‌మెంట్‌, సెంచరీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ సంయుక్త అధ్వర్యంలో ఈనెల 19 నుంచి 23 తేదీ వరకూ శిక్షణ ఉంటుందని పేర్కోన్నారు. కెరియర్‌ గైడెన్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ప్రత్యేక వర్క్‌షాపులు ఉంటాయని వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సర్టిఫై చేసిన శిక్షకులతో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్‌ నంబర్లు 9000204925,9000201525ను సంప్రదించ వచ్చని తెలిపారు.
--------

ఘనంగా అమ్మవార్ల అంపకోత్సవం
బొబ్బిలి, మే 18: గొల్లపల్లి దాడితల్లి, పాతబొబ్బిలి సరేపోలమ్మ సిరిమానోత్సవాల ముగింపు క్రమంలో బుధవారం అమ్మవార్లకు ఘనంగా అంపకోత్సవం నిర్వహించారు.  దాడితల్లిని మేళతాళాలతో, అమ్మవారి ఘటాలతో కృష్ణాపురంలోని అమ్మవారి గుడివద్దకు  చేర్చారు. పాతబొబ్బిలిలో కూడా ప్రభలు, మేళతాళాలు, ఘటాలతో అమ్మవారిని గుడివద్దకు సాంప్రదాయబద్ధంగా సాగనంపారు. బైపాస్‌ రోడ్డులోని దాడితల్లి అమ్మవారిని బుధవారం ఆలయ అర్చకుడు పిండిప్రోలు మణికుమార్‌ శర్మ ప్రత్యేకంగా అలంకరించారు. మూడో రోజు కూడా భక్తులు పెద్దసంఖ్యలో ఘటాలతో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత బొబ్బిలి కోటకు చేరుకున్న దాడితల్లి సిరిమానుకు రాజవంశీయుడు బేబీనాయన ప్రత్యేక పూజలు చేశారు.

ఫోటోః 18బిబిఎల్‌పి 4: అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
-------------

కమిషనర్‌ బాధ్యతల స్వీకారం
విజయనగరం రింగురోడ్డు, మే 18: నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా శ్రీరాములనాయుడు బుధవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జి కమిషనర్‌ ప్రసాదరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగర పరిస్థితి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై సహాయ కమిషనర్‌ ప్రసాదరావు ఆయనకు వివరించారు. అనంతరం కమిషనర్‌ శ్రీరాముల నాయుడు మాట్లాడుతూ, అందరి సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఫోటోరైటప్‌: 4 విజడ్పీ 5: నగరపాలక సంస్థ కమిషనర్‌గా శ్రీరాముల నాయుడు
-------------------------

జీవన‘యానం’
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఆ శ్రమ జీవుల బతుకు పయనం ప్రత్యేకం. స్వయంశక్తినే నమ్ముకుంటారు. పని ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. శ్రమే వారి ఆయుధం. ఎండైనా.. వానైనా కుటుంబమంతా కలిసి పనిచేస్తారు. సాయంత్రానికి కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోతారు. భర్తకు భార్య చేదోడువాదోడుగా ఉంటూ బతుకుబండిని ఇద్దరూ కలిసి నడిపిస్తారు. అలాంటి మూడు జంటలు విజయనగరంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ కెమెరా కంట పడ్డాయి.
                - విజయనగరం(ఆంధ్రజ్యోతి)

Read more