ఫ్యాక్టరీలు తెరవరా?

ABN , First Publish Date - 2022-12-10T00:01:33+05:30 IST

‘చక్కెర కర్మాగారాలను మరింత ఆధునీకరిస్తాం. కాలం చెల్లిన యంత్రాలతో క్రషింగ్‌లో జాప్యం జరుగుతోంది. అదే ఫ్యాక్టరీ నష్టాలకు కారణమవుతోంది. అందుకే మరమ్మతులు చేపడతాం.

ఫ్యాక్టరీలు తెరవరా?
మూడేళ్లుగా మూతపడిన భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీ

ఫ్యాక్టరీలు తెరవరా?

జిల్లాలో మూతపడిన చక్కెర కర్మాగారాలు

మూడు క్రషింగ్‌లు దాటినా తెరచుకోని పరిశ్రమలు

సంకిలి ఫ్యాక్టరీకి చెరకు తరలింపు

దూరభారం.. మద్దతు ధర అంతంతమాత్రం

జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

‘చక్కెర కర్మాగారాలను మరింత ఆధునీకరిస్తాం. కాలం చెల్లిన యంత్రాలతో క్రషింగ్‌లో జాప్యం జరుగుతోంది. అదే ఫ్యాక్టరీ నష్టాలకు కారణమవుతోంది. అందుకే మరమ్మతులు చేపడతాం. అంతవరకూ రైతులు సహకరించాలి’.. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలివి. కానీ ఏళ్లు గడుస్తున్నా ఫ్యాక్టరీలు ఆధునీకరించ లేదు. మంత్రి మాటలేవీ కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో భీమసింగి సహకార చక్కెర కర్మాగారం, సీతానగరం ఎన్‌సీఎస్‌ సుగర్‌ ఫ్యాక్టరీల్లో ఏడాది పొడవునా క్రషింగ్‌ జరిగేది. ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా రైతులకు ఎంతో ప్రయోజనకారిగా ఉండేవి. కానీ వైసీపీ ప్రభుత్వ చర్యల పుణ్యమా అని మూతపడ్డాయి. ఆధునీకరణ పేరిట పరిశ్రమలు మూసివేసి.. తరువాత అచేతనంగా విడిచిపెట్టారు. ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియడం లేదు. దీంతో రైతులు సుదూర ప్రాంతంలోని సంకిలి ఫ్యాక్టరీకి వ్యయప్రయాసలకోర్చి చెరకు తరలిస్తున్నారు. మద్దతు ధర అంతంతమాత్రంగా ఉండగా.. రవాణా, ఇతర హమాలీ ఖర్చులు సవ్యంగా చెల్లింపులు చేయడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో రైతులు చెరకు సాగును విడిచిపెట్టి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాల్సిన పరిస్థితి నెలకొంది.

గతమెంతో ఘనం...

ఉమ్మడి జిల్లాలో సంప్రదాయ పంటల్లో చెరకుది కీలక భూమిక. రైతులు వరితో పాటు చెరకు సాగుచేస్తేనే స్వాంతన చేకూరేది. జిల్లాలో పరిశ్రమలు అందుబాటులో ఉండడంతో చెరకు సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. 8 నుంచి 10 లక్షల టన్నుల చెరుకు పండించిన స్థాయికి జిల్లా రైతులు ఎదిగారు. కానీ ఆ స్థాయిలో ప్రోత్సాహం కరువైంది. భీమసింగి, ఎన్‌సీఎస్‌ ఫ్యాక్టరీలు ఉన్నా.. యంత్రాలు పాతబడడం, నిర్వహణ సామర్థ్యం తగ్గడంతో క్రషింగ్‌ ఏడాదికేడాదికి తగ్గుముఖం పట్టింది. నిర్వహణ భారంగా చూపి యాజమాన్యాలు చెరకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. బకాయిలు పేరుకుపోయాయి. వీటికి పరిష్కార మార్గం చూపించాల్సిన ప్రభుత్వం ఏకంగా ఫ్యాక్టరీలను మూసివేసింది. దీనికి ‘ఆధునీకరణ’ అనే కుంటిసాకు చూపింది. వరుసగా మూడో ఏడాది క్రషింగ్‌ లేకుండా చేసింది. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం సవ్యంగా నడిచేది. దానిని కూడా ఆధునీకరణ పేరుతో రైతులకు దూరం చేసిన అపఖ్యాతిని వైసీపీ సర్కారు మూటగట్టుకుంది.

తగ్గిన సాగు

లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ కర్మాగారంపై ఉమ్మడి జిల్లాలో 15 మండలాల రైతులు ఆధారపడేవారు. సీజన్ల వారీగా ఐదు లక్షల టన్నుల చెరకును పండించేవారు. మూడేళ్లుగా పరిశ్రమ మూతతో చెరకు సాగును గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం 1.5 లక్ష టన్నులకు చెరకు సాగు దిగజారిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. భీమసింగి ఫ్యాక్టరీది అదే పరిస్థితి. దాదాపు చెరకు రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. అదే కొనసాగితే మాత్రం జిల్లాలో చెరకు పండించే రైతులు తగ్గుముఖం పట్టే అవకాశముంది. ఈ సీజన్‌ క్రషింగ్‌కు సంబంధించి రెండు ఫ్యాక్టరీలు తెరవడం అసాధ్యం. దీంతో ఎన్‌సీఎస్‌ ఫ్యాక్టరీ పరిధిలో లక్షన్నర టన్నులు, భీమసింగి పరిధిలో 26 వేల టన్నుల చెరకును సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

‘మద్దతు’ అంతంతమాత్రం

మద్దతు ధర అంతంతమాత్రమే. టన్ను చెరకు ధరకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,780, కానీ వివిధ కారణాలతో రైతుకు అందిస్తున్నది కేవలం రూ.2,350 మాత్రమే. అంటే టన్ను చెరకు వద్ద రూ.430 తేడా ఉంటుంది. దీనికితోడు ఫ్యాక్టరీకి తరలిస్తున్న చెరకు విషయంలో రైతులకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. దవ్వ, రేకులు సవ్యంగా తొలగించడం లేదని తిరస్కరిస్తున్నారు. అదే దళారుల ద్వారా అందించే చెరకుకు మాత్రం ఎటువంటి అడ్డంకులు పెట్టడం లేదు. ప్రభుత్వ మద్దతు ధర చెల్లించని యాజమాన్యాలు కొంతమొత్తం కమీషన్‌కు దళారులకు అవకాశమిస్తున్నాయి. అటు దళారుల ద్వారా తీసుకెళుతున్న చెరకుకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో రైతులు వారినే ఆశ్రయించక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది. అటు రవాణా చార్జీలు, హమాలీల ఖర్చుల విషయంలో కూడా మొండిచేయి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతం నుంచి చెరకును సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీకి తరలించినా 50 కిలోమీటర్లు తక్కువ లేకుండా ఉంటుంది. ఎస్‌.కోట, గజపతినగరం నియోజకవర్గాల నుంచి అయితే 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రవాణా కష్టాలు ఎక్కువ కావడంతో ఎక్కువ మంది చెరకు సాగునే విరమించుకోవాల్సిన పరిస్థితి ఉమ్మడి జిల్లాలో దాపురిచింది.

మద్దతు ధర దక్కడం లేదు

చెరకు రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలను మూసివేస్తున్నారు. క్రషింగ్‌ సీజన్లు దాటుతున్నా వినియోగంలోకి తేవడం లేదు. అసలు పరిశ్రమలను తెరిచే ఉద్దేశ్యం ఉందో లేదో తెలియడం లేదు. సంకిలి ఫ్యాక్టరీకి చెరకు మళ్లిస్తున్నా రవాణా చార్జీలు, కూలీల ధరలు సవ్యంగా చెల్లించడం లేదు.

-పి.సింహాచలం, రైతు, గజరాయునివలస, బాడంగి మండలం

సాగు మానేశా

ఈ ఏడాది చెరకు సాగు మానేశా. భీమసింగి ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నేరుగా చెరకు తరలించేవారం. చిన్నచిన్న ఇబ్బందులున్నా యాజమాన్యానికి చెబితే వెనువెంటనే సమస్యలు పరిష్కారమయ్యేవి. ఫ్యాక్టరీ మూతపడడంతో ఇక్కట్లు మొదలయ్యాయి. సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని సంకిలి ఫ్యాక్టరీకి తరలించినా గిట్టుబాటు కావడం లేదు. అందుకే ఈ ఏడాదికి చెరకు సాగును మానుకున్నాం.

కె.శ్రీనివాసరావు, రైతు, కొర్లాం,

Updated Date - 2022-12-10T00:01:35+05:30 IST