ఈసారీ అరకొరే!

ABN , First Publish Date - 2022-07-06T05:21:31+05:30 IST

విద్యార్థులకు పాఠ్య పుస్తకాల కోసం ఏటా అవస్థలు తప్పడం లేదు. ఈ ఏడాది కూడా పుస్తకాలు అరకొరగానే వచ్చాయి. గతేడాది నిల్వలను సైతం సర్దుబాటు చేసినా ఇంకా కొరత ఉంది. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది విద్యా శాఖ ద్వారా ప్రభుత్వానికి పెట్టిన ఇండెంట్‌ ప్రకారం 14,14,880 పాఠ్య పుస్తకాలు కావాల్సి ఉంది.

ఈసారీ అరకొరే!
గంట్యాడ మండలం లక్కిడాం జడ్పీ పాఠశాలలో పుస్తకాలను సర్దుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుడు


సరిపడా సరఫరాకాని పాఠ్యపుస్తకాలు
గత నిల్వలతో నెట్టుకొచ్చినా ఇంకా కొరతే
ఏటా విద్యార్థులకు తప్పని అవస్థలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విద్యార్థులకు పాఠ్య పుస్తకాల కోసం ఏటా అవస్థలు తప్పడం లేదు. ఈ ఏడాది కూడా పుస్తకాలు అరకొరగానే వచ్చాయి.  గతేడాది నిల్వలను సైతం సర్దుబాటు చేసినా ఇంకా కొరత ఉంది. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది విద్యా శాఖ ద్వారా ప్రభుత్వానికి పెట్టిన ఇండెంట్‌ ప్రకారం 14,14,880 పాఠ్య పుస్తకాలు కావాల్సి ఉంది. ఇంతవరకు 10,71,098 పుస్తకాలే వచ్చాయి. ఇంకా 3,43,782 పాఠ్య పుస్తకాల కొరత ఉంది. గతేడాది నిల్వలు 1,67,600 పుస్తకాలను సైతం కలిపి లెక్కించి పంపిణీ చేస్తున్నారు. పాత వాటిని కూడా మండల కేంద్రాల్లోని ఎమ్‌ఆర్‌సీలకు తరలించారు. అయినా కూడా ఇంకా 1,76,182 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది.
విద్యా సంవత్సరం ప్రారంభమైనా పుస్తకాల కొరత వేధిస్తోంది. వర్కు బుక్కుల కొరత కూడా ఉంది. పాఠశాలల ప్రారంభం నాటికే విద్యా కానుకలను అందిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆచరణలో అది కనిపించలేదు. గతేడాది ఎదుర్కొన్న సమస్యలే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. వాస్తవానికి పాఠ్యపుస్తకాల ప్రచురణకు కావలసిన స్థాయిలో  ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్సుల్లోనే ముద్రణ జరుగుతోంది. అయినా కొరత తప్పడం లేదు. ఎక్కడ లోపమో గుర్తించడం లేదు. పైగా విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచే వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి కావలసిన పాఠ్యపుస్తకాల గణాంకాలను సేకరిస్తుంటారు. విద్యార్థుల సంఖ్య, వారు చదువుతున్న తరగతులు, అవసరమైన పుస్తకాలు ఇలా డేటానంతటినీ సిద్ధం చేస్తుంటారు. అందుకు అనుగుణంగా ముద్రించిన పుస్తకాలనే తీసుకువస్తుంటారు. అయినా కొరత ఎందుకు వస్తోందో అర్థంకాని ప్రశ్నగా మిగులుతోంది.


రెండు భాగాలుగా పంపిణీ
విద్యార్థులకు గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త విధానం తీసుకువచ్చారు. ఆరు నుంచి 8వ తరగతి వరకు రెండు భాగాలుగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఒకసారికే పూర్తిగా అందజేయలేకపోతున్న పరిస్థితిలో రెండో భాగం పుస్తకాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు మూడు భాగాలుగా పంపిణీ చేస్తున్నారు. మొదటి భాగం పుస్తకాలను ఇప్పుడు అందజేస్తున్నారు. రెండు, మూడు భాగాల పాఠ్యాంశాలు తరువాత వస్తాయి. 9, 10వ తరగతుల విద్యార్థులకు మాత్రమే ఒకేసారి అందజేస్తున్నారు.

డైస్‌ ప్రకారమే పంపిణీ

పుస్తకాల పంపిణీ ప్రక్రియ డైస్‌ ప్రకారం ఓ క్రమ పద్ధతిలో జరుగుతోంది. తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్య, ఆధార్‌ లింక్‌ చేసిన విద్యార్థుల జాబితా మా వద్దకు వస్తుంటాయి. ఆ ప్రకారమే పుస్తకాల సంఖ్యను గుర్తించి అందుకు అనుగుణంగా ఇండెంట్‌ పెడతాం. వేసవి సెలవుల్లోనే ఆయా మండల విద్యా శాఖ అధికారులకు ఆర్టీసీ కార్గో సేవల ద్వారా పుస్తకాలు పంపించాం.
                     - ఆర్‌.ఉమారాణి, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీ ఇన్‌చార్జి, విజయగరరం.

అందరినీ అందని బ్యాగ్‌లు
కలెక్టరేట్‌: సమస్యలు నడుమ మంగళవారం పాఠశాలలు తెరుచున్నాయి. మొదటి రోజున కనీస స్థాయిలో విద్యార్థులు పాఠశాలలకు రాలేదు. ఆ కొద్దిమంది విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో  పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయలేకపోయారు. అందరికీ బ్యాగ్‌లు, షూలు అందజేయలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1812 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు లక్షా 70 వేలు మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదటి రోజు 50 శాతం కంటే తక్కువగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ నుంచి  పాఠశాలలకు వచ్చిన జేవీడీ కిట్లలో 8 రకాలు వస్తువులు ఉండాలి. కానీ పాఠ్య పుస్తకాలు, బ్యాగ్‌లు, షూలు పూర్తిస్థాయిలో రాలేదు. ప్రతి పాఠశాలకు పది బ్యాగ్‌లు చొప్పున మాత్రమే పంపిణీ చేశారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాడు -నేడు కింద చేపట్టిన భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన 117 జీవోపై ఉపాధ్యాయలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు. జీవోను రద్దు చేయాలంటూ ఆందోళన చేపడుతున్నారు.Read more