ఏదీ వైభవం?

ABN , First Publish Date - 2022-03-06T04:52:26+05:30 IST

ఒకప్పుడు డంపింగ్‌ యార్డు నిర్వహణతో సాలూరు మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధికారులు యార్డు పరిసరాలు చూసి విస్తుపోయేవారు.

ఏదీ వైభవం?
నిరుపయోగంగా షెడ్‌లు

దయనీయంగా సాలూరు డంపింగ్‌ యార్డు

 ఒకప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు

నేడు లోపలికి వెళ్లాలంటేనే దుర్గంధం

శిథిలమైన పరికరాలు

పట్టించుకోని నేతలు, ఉన్నతాధికారులు


ఒకప్పుడు డంపింగ్‌ యార్డు నిర్వహణతో సాలూరు మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధికారులు యార్డు పరిసరాలు చూసి విస్తుపోయేవారు. ఇక్కడ చెత్త నుంచి సంపద సృష్టి జరిగేది. ఈ విధానం ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది. జాతీయ స్థాయిలో రికార్డులు, రివార్డులు వచ్చాయి. రాష్ట్రం మొత్తంలో ఉన్న పురపాలక సంస్థలకు రోల్‌ మోడల్‌గా పేరొందింది. అటువంటి డంపింగ్‌ యార్డు నేడు దయనీయంగా మారింది.  


సాలూరు, మార్చి 5:

సాలూరులో పరిశుభ్రత...డంపింగ్‌ యార్డు నిర్వహణతో మున్సిపల్‌ అధికారులు ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. మునిసిపల్‌ కమిషనర్‌గా 2011 నుంచి 2015 వరకు పనిచేసిన షేక్‌ సుభానీ డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు పూనుకున్నారు. మునిసిపల్‌ నిధులతో పాటు 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో సాలూరు పట్టణానికి అతి సమీపంలో సుమారు 8.4 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్‌ యార్డు నిర్మించారు. అంతర్గత రహదారులు, చెత్తకు సంబంధించిన షెడ్లు, ఆహ్లాదపరిచే మొక్కలు, ఓ కొలను(చెరువు), పార్వతీపరమేశ్వరుల విగ్రహం ఇలా అత్యంత సుందరంగా డంపింగ్‌ యార్డును తయారు చేశారు. అక్కడే తన ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కూడా చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని మునిసిపాల్టీల దృష్టిని ఆకర్షించారు. మరోవైపు మునిసిపాల్టీకి ఆదాయం వచ్చేలా తీర్చిదిద్దారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే ప్రక్రియ చేపట్టారు. ప్లాస్టిక్‌, డిస్పోజల్స్‌ను తొలగించి పల్వరైజ్డ్‌ చేయడం ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేశారు. దానిని విక్రయించడం ద్వారా మునిసిపాలిటీకి ఆదాయం సమకూరేది. ఆ కళ ఇప్పుడు కరువైంది. ఆదర్శం అటకెక్కింది. యార్డులోపల కూర్చొనే బల్లలు కూడా పాడయ్యాయి. చెత్తను వేరుచేయడం మానేసి పూర్తిగా కాల్చేస్తున్నారు. ఆ పొగ వల్ల అటుగా వాకింగ్‌కు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. లోపలి యంత్రాలన్నీ మూలకు చేరిపోయాయి. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 

 రాష్ట్ర ప్రభుత్వం 2018లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మునిసిపాల్టీ పరిధిలో ఉన్న తడిచెత్తను సంఘమిత్ర రీసెర్చ్‌ ట్రైనింగ్‌ అండ్‌ కన్సల్టెన్సీ వారికి (20 సంవత్సరాలకు ఒప్పందం) ఇచ్చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పొడిచెత్త, ఇతర వ్యర్థాల నుంచి వచ్చే ఆదాయం ఏమైందో వారే చెప్పాలి. 

 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.56 లక్షలతో చెత్త తరలింపు కేంద్రం (గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రం (జీటీఎస్‌)ను ముందుగా పట్టణంలోని 25వ వార్డు బంగారమ్మపేటలో ఏర్పాటు చేయదలిచారు. ప్రజల నుంచి నిరసన రావడంతో దగ్ధసాగరం సమీపంలో ఉన్న మునిసిపల్‌ స్థలంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న డంపింగ్‌ యార్డును అభివృద్ధి చేయాలని మాత్రం చూడడం లేదు. 

 సాలూరు మునిసిపాల్టీకి ఎంతో పేరు తెచ్చిపెట్టిన డంపింగ్‌ యార్డులో ఏం జరుగుతుందో పాలకవర్గ సభ్యులకు తెలియటం లేదని ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశంలో మునిసిపల్‌ కౌన్సిలర్లు ప్రశ్నించటం గమనార్హం. ప్రజలు మాత్రం డంపింగ్‌ యార్డుకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. 

సుందరంగా తీర్చిదిద్దుతాం

గతంలో డంపింగ్‌ యార్డు ఎలా ఉందో అలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను గతంలో ఇక్కడ విధులు నిర్వహించినప్పుడు ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా పాడైంది.  గతంలో మాదిరిగా తయారుచేయడానికి ప్రయత్నం చేస్తాం.

  - బాలకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సాలూరు.

దృష్టి పెడతా

కమిషనర్‌గా ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించాను. డంపింగ్‌ యార్డులో అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటి అన్నింటిపైనా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి మళ్లీ గత వైభవం వచ్చేలా ప్రయత్నిస్తాను. 

- హెచ్‌.శంకరరావు, కమిషనర్‌, సాలూరు.Read more