పని ఒత్తిడిపై ఆవేదన.. ఆందోళన

ABN , First Publish Date - 2022-10-18T04:05:38+05:30 IST

పై ఫొటోలో కనిపిస్తున్న వారంతా ఎస్‌.కోట మండల గ్రామ సచివాలయ వ్యవసాయ, హార్టీకల్చర్‌ సహాయకులు. పని ఒత్తిడి తగ్గించాలన్న డిమాండ్‌తో సోమవారం స్థానిక మండల వ్యవసాయ కార్యాలయం నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.

పని ఒత్తిడిపై ఆవేదన.. ఆందోళన
ఎస్‌.కోట మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవసాయ, హార్టీకల్చర్‌ సహాయకులు


రోడ్డెక్కిన గ్రామ సచివాలయ వ్యవసాయ, హార్టీకల్చర్‌ సహాయకులు
మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద నిరసన
తూర్పుగోదావరి జిల్లాలో మృతిచెందిన ఉద్యోగి వర్మకు నివాళి


పై ఫొటోలో కనిపిస్తున్న వారంతా ఎస్‌.కోట మండల గ్రామ సచివాలయ వ్యవసాయ, హార్టీకల్చర్‌ సహాయకులు. పని ఒత్తిడి తగ్గించాలన్న డిమాండ్‌తో సోమవారం స్థానిక మండల వ్యవసాయ కార్యాలయం నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒత్తిడిని తట్టుకోలేక ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న సచివాలయ హార్టికల్చర్‌ సహాయకుడు సుభాష్‌ చంద్ర వర్మకు నివాళులు అర్పించారు. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా తమను ఇబ్బందులకు గురిచేయడం తగదంటూ హితవు పలికారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

శృంగవరపుకోట, అక్టోబరు 17:

ఇ-క్రాప్‌తో పాటు ఈకేవైసీ నమోదుకు ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడికి తట్టుకోలేని గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు, హార్టీకల్చర్‌ సహాయకులు రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా విధుల్లో సర్వర్‌ సమస్య తరచూ ఎదురవుతోంది. వివరాలను అప్‌లోడ్‌ చేసే యాప్‌ కూడా కొన్ని మొబైల్స్‌లో పనిచేయడం లేదు. వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వం టార్గెట్‌ విధిస్తుండడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం (13/2020) వీరికి మద్దతుగా నిలుస్తోంది. కాగా ప్రభుత్వం ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లో ఇ-క్రాప్‌ నమోదు చేయిస్తుంది. తద్వారా రైతు ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు.. ఏఏ పంటలు పండుతున్నాయో తెలుస్తుంది. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు త్వరగా నష్టపరిహారం అందించేందుకు విలుంటుంది. పంటల బీమా కూడా పొందవచ్చు. అన్నిటి కంటే ముఖ్యంగా పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఈకేవైసీనే ఆధారంగా తీసుకుంటోంది. ఈపక్రియను పూర్తిచేసే బాధ్యతను గ్రామ సచివాలయ వ్యవసాయ, హార్టీకల్చర్‌ సహాయకులకు అప్పగించారు. వెబ్‌లాండ్‌లో వున్న సర్వే నెంబర్‌ల వారీగా ఈ పక్రియ జరగాలి. దీనిపై పర్యవేక్షణను తహసీల్దార్‌లకు అప్పగించారు. గ్రామ రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ పని చేయాలి. వీరు చేసే పనిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఇంతవరకు బాగున్నప్పటికీ ఈ ప్రక్రియ అమలులో తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. ఒక్కోసారి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.


తరచూ నిబంధనలు, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు
ఏటా సెప్టెంబర్‌ నెలాఖరుతో ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తుంది. ఈ కారణంతో ఇ-క్రాప్‌ నమోదుకు ఆగస్టు మూడో వారం నుంచి తొందరపెట్టారు. మొదట సెప్టెంబర్‌ 7నాటికి పూర్తిచేయాలని గడువు విధించారు. అప్పటికి జిల్లాలో ఉబాలే పూర్తికాలేదు. దీంతో ఇ-క్రాప్‌ నమోదును ప్రభుత్వ పొడిగిస్తూ వచ్చింది. అయితే ఇ-క్రాప్‌ నమోదును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేసేందుకు రూపొందించిన యాప్‌ పనిచేయడానికి సర్వర్‌ సహకరించ లేదు. తరచూ మొరాయించేది. రాత్రి సమయంలో మాత్రమే పని చేస్తుండేది. దీనికి తోడు ఈ యాప్‌ అన్ని మొబైల్స్‌లో పని చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ల్లోనూ ఇదే పరిస్థితి అని  క్షేత్ర స్థాయి సిబ్బంది వాపోతున్నారు. తరచూ ఇ-క్రాప్‌ నిబంధనలు, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం, మధ్యలో కాన్ఫరెన్సులు, మెయిల్స్‌తో సమయం సరిపోయేది కాదు. ఈ పరిస్థితుల వల్ల ప్రభుత్వం పెడుతున్న టార్గెట్‌లు సకాలంలో పూర్తిచేయలేకపోతున్నామని వారు వాపోతున్నారు. పంట పొలాలన్నీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడం, కొన్ని రియల్‌ ఎస్టేట్‌లుగా మారడం, కొన్నిచోట్ల ఖాళీగా వదిలేయడం తదితర కారణాలతో ఇ-క్రాప్‌ చేసేందుకు ఆటంకం కలుగుతోందనేది ఉద్యోగుల మాట.


భూములిక్కడ.. యజమానులెక్కడో!
గ్రామంలో వ్యవసాయ భూములున్న యజమానులు ఎక్కడో వేరే గ్రామాలు, పట్టణాల్లో వుంటున్నారు. పొలంలో వున్న పంటను నమోదు చేయగలుగుతున్న వ్యవసాయ, హార్టీకల్చర్‌ సహాయకులు ఎక్కడో నివశిస్తున్న భూ యజమానులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఈకేవైసీ చేసేందుకు రైతు వేలు ముద్ర వేయాల్సి ఉంటుంది. రైతులు అందుబాటులో లేక సకాలంలో ఈకేవైసీ పూర్తి చేయలేకపోతున్నారు. ఆధార్‌ ఆధారిత ఈకేవైసీ చేసేందుకు ప్రయత్నించినా భూ యజమానుల నుంచి సహకారం వుండడం లేదు. ఆధార్‌ నెంబర్‌ నమోదు చేయగానే భూ యజమాని ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ నంబర్‌ వెళ్తుంది. ఆ నంబర్‌ను భూయజమాని చెబితేనే ఈకేవైసీ ప్రక్రియ సాగుతుంది. సైబర్‌ నేరాల భయంతో  ఓటీపీ చెప్పేందుకు కొందరు ఇష్టపడడం లేదు.


అదనపు బాధ్యతలు
కొంత మంది గ్రామ సచివాయ వ్యవసాయ, హార్టీకల్చర్‌ సహాయకులకు కొన్ని గ్రామాలకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. తాను పని చేస్తున్న గ్రామంలో పాటు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లోనూ ఇ-క్రాప్‌, ఈకేవైసీ టార్గెట్‌లను పూర్తిచేయాలి. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలతో జరుగుతున్న అలస్యాన్ని పట్టించుకోకుండా ఉన్నతాధికారులు అందరిముందే చీవాట్లు పెడుతుండడంతో వీరంతా మానసికంగా తట్టుకోలేకపోతున్నారు. ఈ విదంగానే తూర్పుగోదావరి జిల్లాలో సచివాలయ హార్టీకల్చర్‌ సహాయకుడు సుభాస్‌ చంద్రవర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక రోడ్డెక్కాల్సి వస్తోందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించకుండా పనులు అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


జామిలోనూ నివాళి
జామి : విధుల్లో ఒత్తిడి వల్ల ప్రాణాలు కోల్పోయిన తూర్పుగోదావరి జిల్లా సచివాలయ హార్టికల్చర్‌ ఉద్యోగి సుభాష్‌చంద్రవర్మకు జామి మండలంలోని సచివాలయ ఉద్యోగులు నివాళులు అర్పించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ విధుల్లో ఒత్తిడి తెచ్చి తమను అధికారులు వేధించొద్దని కోరారు.


బొబ్బిలిలో కొవ్వొత్తులతో ర్యాలీ
బొబ్బిలి: సచివాలయం ఉద్యోగులపై రోజురోజుకు తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధికారుల వేధింపులు పెరుగుతున్నాయంటూ సోమవారం సాయంత్రం బొబ్బిలి పట్టణంలో సచివాలయాల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగి సుభాష్‌ చంద్రవర్మకు నివాళి అర్పించారు. మండల పరిషత్‌ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రతినిధి కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-18T04:05:38+05:30 IST