మరో తుఫాన్?
ABN , First Publish Date - 2022-12-15T00:21:15+05:30 IST
మరో తుఫాన్ రావొచ్చునని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు. త్వరగా పంటను కల్లాలకు తరలించాలనుకుంటున్నారు.
అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం
కలెక్టరేట్, డిసెంబరు 14:
మరో తుఫాన్ రావొచ్చునని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు. త్వరగా పంటను కల్లాలకు తరలించాలనుకుంటున్నారు. రెండు రోజులు క్రితం మాండస్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా కాస్త వర్షం కురిసింది. చిరుజల్లలే కురవడంతో వరిపై పెద్దగా ప్రభావం చూపలేదు. మళ్లీ నాలుగు రోజుల్లో తుఫాన్ ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు రావడంతో రైతులు వరి పంటను కల్లాలకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో పడ్డారు. జిల్లాలో 2 లక్షలు 30 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇప్పటి వరకూ లక్షా 55 వేల ఎకరాల్లో కోతలు పూర్తి చేసుకుని చిన్న చిన్న కుప్పలుగా పంటను భద్రపర్చారు. 75 వేల ఎకరాల్లో ఇంకా వరి కోతలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు సాగు చేస్తున్న వరి గింజలు కాస్త తడిచినా మొలకలు రావడంతో రైతులు కాస్త టెన్షన్ పడుతున్నారు. చేతికి అందే పంటను ఎలా దక్కించుకోవాలోనని కలవర పడుతున్నారు.
ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు
మరో నాలుగు రోజుల్లో తుఫాన్ ఉందని వాతావరణం శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయి. అయితే ఈ తుఫాన్ ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండదన్న సూచనలు వచ్చాయి. రెండు రోజులైతే గాని స్పష్టంగా చెప్పలేం.
తారక రామరావు, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ
---------