నేడు జడ్పీ సమావేశం
ABN , First Publish Date - 2022-03-05T06:18:37+05:30 IST
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరగనున్నది.
ఛాంబర్ల కేటాయింపు, పాఠశాలల విలీనం, చేసిన పనులకు బిల్లుల చెల్లింపుపై నిలదీయనున్న సభ్యులు
విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరగనున్నది. సభ్యులు గత సమావేశంలో లేవనెత్తిన పలు సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ముఖ్యంగా మండల పరిషత్ కార్యాలయాల్లో చాంబర్ల కేటాయింపు, పనులకు బిల్లుల పెండింగ్‌పై గత సమావేశంలో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని శనివారం జరగనున్న సమావేశంలో సభ్యులు మరోమారు ప్రస్తావించనున్నారు. అలాగే జడ్పీ సాధారణ నిధుల నుంచి మండలాల్లో అభివృద్ధి పనులకు రూ.12 కోట్లు మంజూరుచేశారు. అయితే ఈ నిధులతో పనులు చేపడితే బిల్లులు అవుతాయా? లేదా?...అనే సందేహం కాంట్రాక్టర్లలో ఉంది. ఈ విషయం కూడా సభ్యులు సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను సమీపంలో ఉన్నత పాఠశాలల్లో విలీనం, వేసవి నేపథ్యంలో తాగునీటి సరఫరా, హౌసింగ్‌తోపాటు మొత్తం 22 అంశాలతో అధికారులు అజెండా సిద్ధంచేశారు.
పనులు వేగవంతంపై దృష్టి: జల్లిపల్లి సుభద్ర, చైర్పర్సన్
39 మండలాల్లో పనులకు జిల్లా పరిషత్ సాధారణ బడ్జెట్ నుంచి రూ.12 కోట్లు మంజూరుచేశామని జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ పనులు సకాలంలో పూర్తిచేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. ఇదే విషయాన్ని శనివారం జరగనున్న సమావేశంలో సభ్యులకు వివరిస్తామన్నారు. ఉపాధి పనులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం ఉందని, జడ్పీ నిధులకు అటువంటి ఇబ్బంది ఉండదన్నారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత కార్యాలయంలో ఏళ్ల తరబడి ఒకేచోట వున్న ఉద్యోగులను సెక్షన్లు మార్చానన్నారు. దీర్ఘకాలంగా జిల్లా కేంద్రంలో వున్న ఉద్యోగ సంఘ నాయకులను త్వరలో ఏర్పాటుకానున్న కొత్త జిల్లాలకు పంపుతామని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం ఉండేలా ఎప్పటికప్పుడు పనితీరు సమీక్షిస్తున్నానన్నారు. ఖాళీగా వున్న సీఈవో పోస్టును భర్తీచేయాలని ప్రభుత్వానికి లేఖ రాశానని వివరించారు.